టెక్ ప్రియులు ఎప్పడుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇకపై విండోస్ 11 లోడ్ చేసిన పీసీలు సహా అర్హత కలిగిన విండోస్-10 పీసీల్లోనూ ఈ కొత్త ఓఎస్ అందుబాటులో ఉండనుంది. అధునాతన ఫీచర్లు, డిజైన్‌తో వస్తున్న ఈ ఓఎస్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
"మునుపెన్నడూ లేని విధంగా పీసీలు మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే విండోస్ 11ను మీ ఉత్పాదకత పెంచి, సృజనాత్మకతకు రెక్కలు తొడిగేలా తీర్చిదిద్దాం." అని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి
విండోస్ 11తో (ప్రీలోడెడ్) వచ్చే ఆకర్షణీయ కొత్త డివైజ్‌ల్లో ఈ అప్‌గ్రేడ్ నేటి (అక్టోబర్ 5) నుంచి అందుబాటులో ఉండనుంది . అయితే విండోస్ 10తో వచ్చే కొత్త డివైజ్‌లు ఈ ఓఎస్ కోసం అప్‌గ్రేడ్ సదుపాయం కల్పించనున్నారు.
విండోస్ 10 వాడుతున్నారా?
మీరు ప్రస్తుతం విండోస్ 10 వాడుతున్నట్లు అయితే మీ పీసీ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అర్హత (ఎలిజిబిలిటీ) ఉందో లేదో చూడాలి. పీసీ హెల్త్ చెక్ యాప్ ద్వారా అది తెలుసుకోవచ్చు.
ఆ తర్వాత విండోస్ 11 అప్‌గ్రేడ్ సిద్ధంగా ఉందో లేదో సెట్టింగ్స్‌లో చెక్ చేయాలి. అందుకోసం.. విండోస్ అప్డేట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. (Settings > Update & Security > Windows Update) చెక్ ఫర్ అప్డేట్స్లో (Check for updates) చూడాలి.
మీ డివైజ్‌కు ఎలిజిబిలిటీ ఉండి, అప్‌గ్రేడ్ సిద్ధంగా ఉంటే డౌన్లోడ్, ఇన్స్టాల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు విండోస్ 11 కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
విండోస్ 11 పొందాలనుకుంటే..
విండోస్.కామ్ లేదా స్థానిక స్టోర్‌లో నేరుగా విండోస్ 11తో వచ్చే కొత్త పీసీలను కొనుగోలు చేయండి.
విండోస్.కామ్ లేదా స్థానిక స్టోర్‌లో ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అర్హత ఉన్న విండోస్ 10 పీసీని కొనండి.
పీసీ హెల్త్ చెక్ యాప్ ద్వారా మీ ప్రస్తుత విండోస్ 10 పీసీ.. ఉచితంగా విండోస్ 11కి అప్‌గ్రేడ్ అవ్వగలదో లేదో చెక్ చేయండి.
ఫీచర్లు ఇవే
- అధునిక డిజైన్, సౌండ్ సిస్టమ్‌తో వచ్చే ఓఎస్ వాడటానికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది
- రీసెంట్ ఫైల్స్‌ను చూసుకోవడానికి డివైజ్ ఏదైనా క్లౌడ్, మైక్రోసాఫ్ట్ 365 వినియోగించుకునేలా రూపకల్పన
- మల్టీ టాస్కింగ్, స్నాప్ లేఅవుట్, స్నాప్ గ్రూప్స్ ఫీచర్
- ప్రజలు త్వరగా అనుసంధానం కావడానికి టాస్క్‌బార్‌లో మైక్రోసాఫ్ట్ టిీమ్స్ సదుపాయం
- సమాచారాన్ని త్వరితగతిన అందుకోవడానికి ఏఐతో కూడిన విడ్జెట్స్
- హై క్వాలిటీ గేమ్స్ ఆడటానికి అందుబాటులోకి డైరెక్ట్ఎక్స్12 అల్టిమేట్, డైరెక్ట్సోరేజీ వంటి సాంకేతికతలు
- కావాల్సిన యాప్స్ కోసం విశ్వనీయ, సరికొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్
- దివ్యాంగులు సులువుగా వాడుకునేలా ప్రత్యేకమైన డిజైన్
- స్టోర్‌లో కొత్త యాప్స్ ఉంచేందుకు డెవలపర్లు, క్రియేటర్లకు అవకాశం
- టచ్, డిజిటల్ పెన్, వాయిస్ ఇన్‌పుట్‌లతో వేగంగా, సమర్థవంతమైన పనితీరుతో ఓఎస్
- హైబ్రిడ్ పనుల కోసం రూపొందించిన విండోస్ 11లో పీసీ భద్రత కోసం పటిష్ట సాంకేతిక ఏర్పాటు