waterproof phones: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, మోడళ్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన చరవాణులు మార్కెట్లోకి వస్తున్నా.. నీటిలో పడగానే ఇట్టే మూగబోతున్నాయి. అసలు నీటి నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే 'వాటర్‌ప్రూఫ్' మొబైల్ ఫోన్లను ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నారన్నది ఇంకా సమాధానం వెతకాల్సిన సవాలుగానే మిగిలిపోయింది. 39% ఫోన్లు నీటిలో పడి పాడైపోయినట్టు 2018లో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది.
స్మార్ట్ఫోన్లు నీటిని వికర్షించేలా (వాటర్-రిపెల్లింగ్) చేయడంలో ఉత్పత్తిదారులు కొంతవరకూ విజయం సాధించారు. నీరు సులభంగా చొరబడని (వాటర్-రెసిస్టెంట్) ఫోన్లను తీసుకురాగలిగారు. అలాగని ఇవేమీ ఫోన్ లోపలికి నీరు చేరకుండా 100% అడ్డుకోలేకపోతున్నాయి. నీటిలో పూర్తిగా మునిగిపోయే సందర్భాల్లో చాలామటుకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో నీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించే వాటర్‌ప్రూఫ్ చరవాణుల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది.
తప్పుడు ప్రచారానికి భారీ జరిమానా:తమ ఫోన్లు నీటిలోనూ భేషుగ్గా పనిచేస్తాయంటూ తప్పుడు ప్రచారం చేసిన ఓ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థకు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు గతవారం సుమారు రూ.75 కోట్ల (14 మిలియన్ డాలర్ల) జరిమానా విధించింది. సముద్రపు నీటిలో పడితే, తమ ఫోన్లలోని ఛార్జింగ్ పోర్టులు తుప్పు పడతాయని, తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే పాడవుతాయని ఆ సంస్థ నిజం వెల్లడించింది.
ఆ రేటింగ్‌ను ఎలా కొలుస్తారు?:ఇంగ్రెస్ ప్రొటెక్షన్ (ఐపీ) అనే రేటింగ్ సిస్టం ద్వారా.. ఫోన్లు ధూళి వంటి ఘన పదార్థాలు, నీరు వంటి ద్రవపదార్థాలను వికర్షించే గుణాన్ని కొలుస్తారు. రెండు సంఖ్యలతో ఈ రేటింగ్‌ను సూచిస్తారు. 'ఐపీ68'ను తీసుకుంటే, ఇందులో ఎడమవైపు సంఖ్య ఘన పదార్థాల నుంచి, కుడివైపు సంఖ్య ద్రవ పదార్థాల నుంచి కల్పించే రక్షణ స్థాయులకు సూచన. ఈ సంఖ్యలు 0 (నో ప్రొటెక్షన్) నుంచి 6/8 (హై ప్రొటెక్షన్) వరకూ రేటింగ్‌ను సూచిస్తాయి. అయితే ఇవి కేవలం ప్రయోగశాల పరీక్ష ఫలితాలను అనుసరించి నిర్ధరించినవే.