తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీ స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా? ఈ జాగ్రత్తలు పాటించండి! - reason for mobile heating

మొబైల్​ ఫోన్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. చేతిలో ఫోన్​ లేనిదే ఏ పని కావడం లేదని చాలా మంది చెప్పే మాట. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ వినియోగంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనేది తెలుసుకుందాం.

Why do smartphones explode and how to avoid and control heating
స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!

By

Published : Aug 30, 2021, 7:51 AM IST

స్మార్ట్‌ఫోన్ల వినియోగానికి అలవాటుపడటం వల్ల వాటిని విడిచి ఉండలేని పరిస్థితి. రోజులో చాలా పనులు చక్కబెట్టేందుకు స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడుతుంటాం. అయితే దీని వినియోగంతో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయనేది ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం స్మార్ట్‌ఫోన్‌లో మంటలు రావడం వల్ల విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అంతకు ముందు బెంగళూరులో మహిళ బ్యాగ్‌లో ఉన్న ఫోన్‌ పేలింది. దానికన్నా ముందు ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి వ్యక్తి గాయపడటం వల్ల మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఫోన్ ఎందుకు పేలుతుంది? ఫోన్ ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

.

అలాంటి ఫోన్లు వాడకండి

మనలో చాలా మంది ఫోన్ కిందపడి పగిలిన తర్వాత ఫోన్ పనిచేస్తుంటే రిపేర్ చేయించకుండా అలానే ఉపయోగించేస్తుంటారు. అయితే పగిలిన ఫోన్లను ఉపయోగించకపోవడం మంచిదంటున్నారు టెక్ నిపుణులు. ఫోన్ పాడైన వెంటనే దాన్ని సర్వీస్‌ చేయించాలి. కొన్నిసార్లు పగిలిన చోటు నుంచి నీరు లేదా చెమట ఫోన్‌ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. దానివల్ల బ్యాటరీ, ఇతర ముఖ్య భాగాలు పనిచేయకపోవచ్చు. దాంతో ఫోన్‌పై ఒత్తిడి పెరిగి మంటలు చెలరేగే అవకాశం ఉంది.

.

నకిలీ ఛార్జర్లు, బ్యాటరీలకు దూరం

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫోన్లలో చాలా వరకూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్‌తో వస్తున్నవే. ఇందుకోసం మొబైల్ కంపెనీలు బ్యాటరీలతోపాటు ఛార్జింగ్ వైర్లు, అడాప్టర్లను ప్రత్యేకమైన టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి. అందువల్ల నకిలీ ఛార్జర్లు, బ్యాటరీలను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఫోన్‌తోపాటు కంపెనీ ఇచ్చిన ఛార్జర్లతోనే ఫోన్ ఛార్జ్‌ చేయమని మొబైల్‌రంగ నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. ఫోన్‌లో బ్యాటరీ మార్చేటప్పుడు కంపెనీ సూచించిన బ్యాటరీనే ఉపయోగించడం మేలు. నకిలీ బ్యాటరీలు లేదా తక్కువ ధరకు లభించే బ్యాటరీలు సరైన ప్రమాణాలు పాటించకపోవచ్చు. దీనివల్ల బ్యాటరీ త్వరగా వేడెక్కి మంటలు చెలరేగవచ్చు. అందుకే కంపెనీ సూచించిన వాటిని ఉపయోగించడం మంచిది.

.

వేడెక్కుతుంటే వాడొద్దు

మీరు ఉపయోగిస్తున్న ఫోన్ తరచూ వేడెక్కుతున్నట్లు గమనిస్తే వెంటనే ఆ ఫోన్ ఉపయోగించకుండా పక్కకు పెట్టేయడం మేలు. ఫోన్ వేడెక్కెడం అనేది దానిపై ఒత్తిడి పెరిగినప్పుడు లేదా అందులో ఏదైనా లోపం ఉన్నప్పుడు జరుగుతుంది. వెంటనే మీ ఫోన్‌ను సర్వీస్‌ సెంటర్‌ తీసుకెళ్లి చెక్ చేయించండి. అలానే ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి ఉపయోగించడం.. బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించడం వంటివి చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఫోన్ పనితీరు మందగించి తొందరగా పాడయ్యే అవకాశం ఉంది.

.

అలా చేయకపోవడం మంచిది

కొంత మంది కార్‌లో ఛార్జింగ్ పెట్టేందుకు ఉపయోగించే కేబుల్స్‌నే పవర్‌ బ్యాంక్‌ లేదా ఇంట్లో పవర్ ప్లగ్‌ నుంచి ఫోన్‌ను ఛార్జ్‌ చేసేందుకు ఉపయోగిస్తుంటాం. వాటితో కూడా మీ ఫోన్‌కు ప్రమాదం పొంచి ఉంది. కార్‌ నుంచి మొబైల్​కు వచ్చే పవర్‌తో పోలిస్తే పవర్‌ బ్యాంక్‌, ఇంట్లో పవర్‌ ప్లగ్‌ నుంచి వచ్చే పవర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. వాటికి అనుగుణంగా ఛార్జింగ్ కేబుల్స్‌ను వేర్వేరు ప్రమాణాలతో తయారుచేస్తారు. అలానే పవర్‌ అడాప్టర్‌తో ఫోన్ ఛార్జింగ్ చేసే సమయంతో పోలిస్తే పవర్‌ బ్యాంక్‌తో ఫోన్ ఛార్జ్‌ అయ్యేందుకు, కార్‌ అడాప్టర్‌తో ఫోన్ ఛార్జ్‌ అయ్యే సమయంలో ఎంతో తేడా ఉంటుంది. అందుకే ఒకే ఛార్జింగ్ కేబుల్‌ను వేర్వేరు అవసరాలకు ఉపయోగించవద్దని సూచిస్తున్నారు టెక్ నిపుణులు.

.

వంద శాతం అవసరంలేదు

మనలో చాలా మంది ఫోన్‌ను వంద శాతం ఛార్జింగ్ అయ్యేవరకూ అలానే ఉంచుతారు. కొన్నిసార్లు రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తారు. అయితే మొబైల్​ను వంద శాతం ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు మొబైల్ రంగ నిపుణులు. ఫోన్ 90 శాతం ఛార్జింగ్ అయిన తర్వాత ఛార్జ్ చేయడం ఆపడం ఉత్తమని సూచిస్తున్నారు. దానివల్ల ఫోన్‌ బ్యాటరీ ఎక్కువ కాలం సమర్థంగా పనిచేస్తుందట. కొన్నిసార్లు ఫోన్ ఎక్కువసేపు చార్జ్‌ చేసిన బ్యాటరీ వేడెక్కి పేలుడు ఘటనలు చోటుచేసుకోవచ్చు.

.

వాటికి దూరంగా ఉంచండి

కొన్నిసార్లు సూర్యరశ్మి తగిలే చోటులో ఫోన్‌ ఉంచి ఛార్జ్‌ చేస్తుంటాం. దానివల్ల ఫోన్ వేడెక్కె ప్రమాదం ఉంది. సాధారణంగా ఫోన్ ఛార్జ్‌ చేస్తున్నప్పుడు కొంత వేడిగా ఉంటుంది. అలాంటి సమయంలో సూర్యుడి నుంచి వచ్చే కాంతి వల్ల ఫోన్ మరింత వేడెక్కుతుంది. అలానే వేడిని పుట్టించే వస్తువులకు దూరంగా ఉంచి ఫోన్ ఛార్జ్‌ చేయడం మంచిది. దానివల్ల మొబైల్​పై అదనంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఛార్జ్‌ చేసేప్పుడు ఫోన్‌పై ఎలాంటి వస్తువులు ఉంచకపోవడం ఉత్తమం.

.

సర్వీస్‌ ఎక్కడ చేయిస్తున్నారు

ఫోన్‌ ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దగ్గర్లోని మొబైల్ రిపేర్ షాపుకు వెళ్లి సర్వీస్ చేయిస్తుంటాం. కొంత కాలం ఫోన్ చక్కగా పనిచేసిన తర్వాత వెంటనే మరో సమస్య తలెత్తుంది. అందుకే ఫోన్‌లో ఏదైనా సమస్య ఉంటే అధీకృత సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి రిపేర్‌ చేయించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అలానే స్థానికంగా ఉండే రిపేర్ షాప్‌లలో సిబ్బందికి సరైన శిక్షణ పొంది ఉండకపోవచ్చు. ఫోన్‌లో కంపెనీ యాక్ససరీలు కాకుండా థర్డ్‌ పార్టీ యాక్ససరీలు ఉపయోగించడం వల్ల ఫోన్‌పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు చోటుచేసుకోవచ్చు.

ఇదీ చూడండి..ఈ​​ ఫోన్స్​ ఉంటే ఛార్జింగ్ ఆలోచన అక్కర్లేదు!

ABOUT THE AUTHOR

...view details