ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్. గతేడాది చివర్లో తీసుకొచ్చిన డిస్‌అపియరింగ్ మెసేజింగ్ ఫీచర్‌కి కొత్తగా మరిన్ని ఆప్షన్లు (Whatsapp update) జోడించనున్నట్లు తెలుస్తోంది. గతంలో డిస్‌అపియరింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసి మెసేజ్ పంపిన వారం రోజుల తర్వాత సదరు మెసేజ్ డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ పీచర్‌కి కొత్తగా రెండు రకాల ఆప్షన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో ఒకటి 24 గంటల తర్వాత మెసేజ్ డిస్‌అపియర్ ఆప్షన్, మరోటి 90 రోజుల తర్వాత మెసేజ్ డిస్‌అపియర్ అయ్యే ఆప్షన్. ప్రస్తుతం ఈ రెండు ఆప్షన్లు ప్రయోగాల దశలో ఉన్నాయని, త్వరలోనే యూజర్లకి అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ఆండ్రాయిడ్ బీటా యూజర్స్ 2.21.17.16 వెర్షన్‌ని అప్‌డేట్ చేసుకుని ఈ ఫీచర్‌ని పరీక్షించవచ్చు. ఐఓఎస్ బీటా యూజర్స్‌కి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇదే కేటగిరీలో వాట్సాప్ వ్యూ వన్స్ పేరుతో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని సాయంతో యూజర్స్ తాము పంపిన మెసేజ్‌లను అవతలి వ్యక్తి చూసిన వెంటనే వాటంతటవే డిలీట్ అయిపోతాయి.
ఇవేకాకుండా వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. వాట్సాప్‌లో మనం వెబ్ లింక్‌లు షేర్ చేసినప్పుడు చిన్న థంబ్ ఇమేజ్‌తోపాటు సదరు లింక్‌కు సంబంధించిన ఒకటి లేదా రెండు లైన్ల సమాచారం కనిపిస్తుంది. ఇకమీదట ఈ వెబ్‌లింక్ ప్రివ్యూ ఫీచర్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాట్సాప్‌లో లింక్ షేర్ చేసిన తర్వాత ఇమేజ్ సైజు పెద్దగా, లింక్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం మరింత పెద్దగా..నాలుగు నుంచి ఐదు లైన్ల వరకు కనిపిస్తుందట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్స్‌కి ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చని వాబీటాఇన్ఫో తెలిపింది.