Whatsapp Account In Two Phones: ప్రపంచంలో నిత్యం కోట్లాది మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ఇతరులతో ఎక్కువగా చాట్ చేస్తుంటారు. అవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్ కూడా చేసుకుంటారు. అందుకే తమ యూజర్ల కోసం వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకురానుంది.
ఇటీవలే వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ అకౌంట్ ఉన్న ప్రైమరీ మొబైల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా.. ఇంతకు ముందే వాట్సాప్ వెబ్ ద్వారా కనెక్ట్ అయిన కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో మెసేజ్‌లు రిసీవ్ చేసుకోవచ్చు, సెండ్ చేయవచ్చు. ఇలా మొత్తంగా ఒకేసారి ఓ ఫోన్, నాలుగు డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ వాడుకోవచ్చు. అయితే తాజాగా ఎంతోమందికి ఉపయోగపడే మరో ఫీచర్‌ను తీసుకురానుంది ఆ సంస్థ. తమ ప్రైమరీ మొబైల్‌లో ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను ఇంకో ఫోన్‌లో వాడుకునే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ అకౌంట్‌ను మరో ఫోన్‌కు లింక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు.