ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రంగంలోకి దిగిన వాట్సాప్ మాతృ సంస్థ 'మెటా' సర్వీసులను పునరుద్ధరించింది. వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడడానికి గల స్పష్టమైన కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
ETV Bharat / science-and-technology
వాట్సాప్ సేవలు పునరుద్ధరణ.. దాదాపు రెండు గంటల తర్వాత.. - whatsapp server down latest news
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు దాదాపు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. మెసేజ్‌లు వెళ్లడం లేదని యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. యుద్ధప్రాతిపదికన పనిచేసిన మెటా ఇంజినీర్లు.. ఎట్టకేలకు సేవల్ని పునరుద్ధరించారు.
మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపడం, అందుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్' అని వచ్చిందని, ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని యూజర్లు వాపోయారు. ట్విట్టర్లో 'వాట్సాప్ డౌన్' హ్యాష్‌ట్యాగ్ సైతం ట్రెండ్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్చల్ చేశాయి.
అంతకుముందు వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడంపై వాట్సాప్ మాతృసంస్థ 'మెటా' అధికార ప్రతినిధి స్పందించారు. 'వాట్సాప్ సేవలు ఆగాయని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా సేవలకు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాం' అని తెలిపారు. కాసేపటికే సేవలు పునరుద్ధరించినట్లు ప్రకటించారు.
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు 2021 అక్టోబరు 5న 6 గంటలపాటు నిలిచిపోయాయి. ఫలితంగా మెటా సంస్థ షేర్ల విలువ భారీగా పతనమైంది.