WhatsApp hack news : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలను అనుసరిస్తూ, యూజర్ల డేటాను, డబ్బును కొల్లగొడుతున్నారు. తాజాగా వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం వాళ్లు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు.
ఎలా హ్యాక్ చేస్తారంటే?
WhatsApp hack news latest : ముందుగా హ్యాకర్లు ఓ వ్యక్తి పేరుపై నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరుస్తారు. అందులో పోస్టులు పెడతారు. అది నకిలీది అని తెలియక సదరు వ్యక్తికి తెలిసినవాళ్లు, ఆ పోస్టులకు కామెంట్స్, లైక్స్ చేస్తారు. ఈ విధంగా హ్యాకర్లు సదరు వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్‌ను సంపాదిస్తారు. తరువాత వారందరికీ వ్యక్తిగతంగా మెసెంజర్ లింక్‌ను పంపిస్తారు. ముఖ్యంగా యోగా క్లాసులని, లేదా ఆన్లైన్ టీచింగ్ క్లాసులని, ఏవోవే అబద్దపు పేర్లు పెట్టి లింక్‌లు పంపుతారు. ఈ లింక్‌పై క్లిక్ చేసి, తరువాత వచ్చే ఆరు అంకెల ఓటీపీని తమకు తెలియజేయాలని సూచిస్తారు. వాస్తవానికి ఇది వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్. ఇది తెలియక చాలా మంది వాట్సాప్ యూజర్లు దీనిని హ్యాకర్లకు పంపించేస్తున్నారు. దీనితో సదరు వ్యక్తుల వాట్సాప్ అకౌంట్లు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. కనుక వాట్సాప్ యూజర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.