WhatsApp Pay India News :వాట్సాప్ యూజర్లు అందరికీ శుభవార్త. ఇకపై యూపీఐ యాప్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు ఉపయోగించి.. నేరుగా వాట్సాప్ నుంచే పేమెంట్స్ చేయవచ్చు. అలాగే వాట్సాప్ ప్లాట్‌ఫాం నుంచే నేరుగా నెట్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు.
పార్టనర్షిప్తో
మెటా కంపెనీ ఆధ్వర్యంలోని వాట్సాప్.. Rozorpay, PayUలతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి సాయంతో నేరుగా వాట్సాప్‌లోనే పేమెంట్స్ చేసుకునే వెసులుబాటు యూజర్లకు కల్పిస్తోంది.
వ్యాపారం పెంచుకునేందుకే!
వాట్సాప్ వేదికగా యూజర్ల క్రయవిక్రయాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. వాట్సాప్ ఈ పేమెంట్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది.
"వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తూనే, మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసేందుకు.. తాజా వాట్సాప్ పేమెంట్ ఫీచర్ మీకు సహాయపడుతుంది. ఇకపై భారతీయులు అందరూ, తమకు నచ్చిన వస్తువులను కార్ట్‌లో చేర్చుకుని.. యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. అంతేకాదు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి కూడా డబ్బులు చెల్లించవచ్చు. ఇందుకోసం మేము రోజర్‌పే, పేయూ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాం."
- మెటా అఫీషియల్ బ్లాగ్ పోస్ట్
ఏయే యాప్స్!
WhatsApp UPI Payment Apps List In India : ప్రస్తుతం వాట్సాప్‌లో.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సహా పలు యూపీఐ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ముందు కూడా వాట్సాప్‌లో వీటిని ఉపయోగించి పేమెంట్స్ చేసే అవకాశం ఉండేది. కానీ పేమెంట్స్ చేసేటప్పుడు.. ఆయా యూపీఐ యాప్‌లకు రీడైరెక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు నేరుగా వాట్సాప్‌లోనే ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
యూజర్స్ భారీగా పెరుగుతారా?
భారతదేశంలో దాదాపు 500 మిలియన్ల వాట్సాప్ యూజర్లు ఉన్నారు. అయితే వీరిలో కేవలం 100 మిలియన్ల మంది మాత్రమే 'వాట్సాప్ పే' వాడుతున్నారు. తాజా అప్డేట్తో వాట్సాప్ పే ఉపయోగించేవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం వీటికి మాత్రమే!
ప్రస్తుతం వాట్సాప్‌లో.. ఆన్లైన్ గ్రాసరీ సర్వీస్ జియోమార్ట్; చెన్నై, బెంగళూరు మెట్రో సిస్టమ్స్ మాత్రమే ఎండ్-టు-ఎండ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి. ఇకపై మరిన్ని బిజినెస్‌లు దీనితో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా వాట్సాప్ సేల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
మెటా వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్
Meta Verified Subscription :మెటా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా.. వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించే పనిలో ఉంది. అందులో భాగంగా వెరిఫైడ్ యూజర్లకు బ్యాడ్జ్‌లు కూడా అందిస్తుంది. దీని ద్వారా సదరు వాట్సాప్ అకౌంట్‌కు సపోర్ట్, ప్రొటక్షన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా వాట్సాప్ బిజినెస్‌కు ప్రామాణికత పెరుగుతుంది.