ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎప్పుడూ ముందుంటుంది. సాధారణంగా మనం తెలియనివారి మొబైల్ నెంబరు సేవ్ చేయాలంటే వాట్సాప్‌లో చేయలేం. కాంటాక్ట్స్‌లో సేవ్ చేస్తే గానీ వాట్సాప్‌లోకి కొత్త నెంబరు రాదు. ఒక నంబరు అంటే ఫర్వాలేదు గానీ పదుల కొద్దీ కొత్త నెంబర్లు సేవ్ చెయ్యాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇలాంటి వాటి కోసమే వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అదేంటంటే..
వాట్సాప్ అప్లికేషన్లోనే కాంటాక్ట్స్ క్రియేట్, ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో వాట్సాప్ యూజర్లు ఏదైనా కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలంటే ఫోన్ కాంటాక్ట్స్ యాప్‌నకు వెళ్లి సంబంధిత డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త ఫీచర్‌తో ఆ భారం తప్పుతుంది. నిజానికి వాట్సాప్‌లో ఫలానా కాంటాక్ట్ సేవ్ చేసుకోవడానికి ఒక షార్ట్‌కట్ ఉంది. అయితే ఈ షార్ట్‌కట్‌పై క్లిక్ చేయడం ద్వారా అది ఫోన్ కాంటాక్ట్స్ యాప్‌కి తీసుకెళ్తుంది. దీనివల్ల ఫోన్‌పై రెండు అప్లికేషన్లు ఓపెన్ చేయాల్సిన భారం పడుతుంది. అలాగే యూజర్లకు ఇబ్బంది కలుగుతుంది.
ఈ కొత్త ఫీచర్‌తో ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్‌లో ఆల్రెడీ సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్‌ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే కాంటాక్ట్స్ యాప్ ద్వారా చేయగలిగే ఎడిటింగ్స్ వాట్సాప్‌లోనే చేసుకోవచ్చు. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది. వాట్సాప్ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ అప్లికేషన్ నుంచి బయటకు వెళ్లకుండా యూజర్లు వారి కాంటాక్ట్ లిస్ట్ లేదా గూగుల్ అకౌంట్‌కి కొత్త కాంటాక్ట్స్‌ను జోడించవచ్చు.