WhatsApp New Features : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను మ్యూట్ (శబ్దం రాకుండా) చేసేందుకు మీకు అవకాశం కలుగుతుంది.
స్పామ్ కాల్స్‌కు చెక్
WhatsApp silence unknown callers : వాట్సాప్‌లో తెలియని నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. విదేశీ నెంబర్ల నుంచి, అలాగే ప్లస్ 188, 427, 22, 24, 31, 494 నంబర్లతో మొదలయ్యే వాట్సాప్ కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు మార్ఫింగ్ కాల్స్, స్పామ్ కాల్స్ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. కొందరు వలపు వల విసురుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే, మరికొందరు వ్యక్తిగత డేటాను సేకరించి.. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ మాతృసంస్థ మెటా ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది. అలాగే వినియోగదారులకు మరింత నియంత్రణను ఇస్తుందని మెటా పేర్కొంది.
ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్ల్లోనూ పనిచేస్తుంది. అయితే మీరు ఈ ఫీచర్‌ను స్వయంగా ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎనేబుల్ చేసిన తరువాత మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని, తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ బయటకు వినిపించవు. ఈ ఫీచర్‌ను మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే కచ్చితంగా గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మెటా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో తరచుగా న్యూఫీచర్స్ను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవలే కొన్ని ఎంచుకున్న మార్కెట్లలో వాట్సాప్ ఛానల్స్ కూడా ప్రారంభించింది కూడా.