రోజూ వాట్సాప్‌లో ఎంతో మందితో ఛాట్ చేస్తుంటాం. ఫొటోలు, వీడియోలు, ఆడియో మెసేజ్‌లు ఇతరులకు పంపుతాం. అయితే వీటిలో సున్నితమైన సమాచారం ఉండొచ్చు. వాటిని పంపించిన తర్వాత మళ్లీ డిలీట్ చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. అంతలో అవి అవతల వ్యక్తి ఫోన్‌లో స్టోర్ అవ్వడం జరిగిపోతుంది. తరచూ మీడియా సమాచారం పంచుకోవడం వల్ల ఫోన్ స్టోరేజీ కూడా ఫుల్ అయిపోతుంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ సారి కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్. 'వ్యూ వన్స్' పేరుతో అద్భుతమైన ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ఎనేబుల్ చేయడం వల్ల ఫొటోలు, వీడియోలు పంపిస్తే.. అవతలి వ్యక్తి ఒక్కసారి కన్నా ఎక్కువసార్లు చూసేందుకు వీలుండదు. ఒక్కసారి చూడగానే ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతాయి. ఫోన్లోనూ స్టోర్ కావు.
'వ్యూ వన్స్' కీ ఫీచర్స్
- ఈ ఫీచర్ వల్ల మనం పంపించిన ఫొటోస్, వీడియోస్ లేదా ఇతర మీడియా.. అవతలి వ్యక్తి ఫోన్ గ్యాలరీలో స్టోర్ కావు.
- మనం పంపే ఫొటో, వీడియో ఒక్కసారి మాత్రమే చూడటానికి వీలుంటుంది. మరోసారి ఓపెన్ చేయడం కుదరదు.
- వీటిని ఫార్వర్డ్, సేవ్, స్టార్, షేర్ చేయలేము.
- అవతలి వ్యక్తి 'Read receipts' సెట్టింగ్ ఆన్చేసుకుంటే.. మనం పంపించిన మీడియాను వారు చూశారా లేదా అనేది తెలుసుకోవచ్చు. వారు ఆ మీడియాను తెరవగానే 'Opened' అని మనకు కనిపిస్తుంది.
- 14రోజులలోపు ఫొటో లేదా వీడియోను ఓపెన్ చేసి చూడకపోతే.. అది చాట్ నుంచి దానంతటదే డిలీట్ అయిపోతుంది.
- వ్యూ వన్స్ ద్వారా ఫొటో లేదా వీడియో పంపించాలంటే.. మెసేజ్ ప్రివ్యూలో ప్రతిసారి 'వ్యూ వన్స్' ఐకాన్‌ను క్లిక్ చేయాలి.
- వ్యూ వన్స్ మీడియాను ఓపెన్ చేయకపోతే బ్యాకప్ ద్వారా దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ తెరిస్తే బ్యాకప్‌లో స్టోర్ కాదు.
'వ్యూ వన్స్' ద్వారా ఫొటో లేదా వీడియోను ఎలా పంపాలి?
ఫొటో లేదా వీడియో పంపించే సమయంలో.. సెంట్ బటన్ పక్కన '1' అని కనిపిస్తుంది. దీనిపై ప్రెస్ చేయాలి. దీనిద్వారా అవతల వ్యక్తి ఓ సారి ఓపెన్ చేయగలరు. అనంతరం మళ్లీ దాన్ని తిరిగి చూడలేదు. ఆటోమెటిక్‌గా అది డిలీట్ అయిపోతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా వ్యూవన్స్ మీడియాకు భద్రత లభిస్తుంది. వాట్సాప్ కూడా ఈ మీడియాను చూడదు. మొత్తంగా వ్యక్తిగత ఫొటోలు, సున్నితమైన సమాచారం పంపించేందుకు ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.