WhatsApp Latest Feature : మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో వాట్సాప్ యూజర్లు ఇకపై వీడియో కాల్స్ చేసేటప్పుడు, తమ స్క్రీన్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్బుక్ పోస్టులో (WhatsApp Screen Sharing Feature For Video Calls) తెలిపారు.
'ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు.. మన స్క్రీన్‌ని లైవ్‌లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందికి షేర్ చేయవచ్చు. ముఖ్యంగా దీని వల్ల లైవ్‌లో.. డాక్యుమెంట్ షేరింగ్, ఫొటోస్ బ్రౌజింగ్, వెకేషన్ ప్లానింగ్ లేదా ఫ్రెండ్స్‌తో షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటిలోని పెద్దవారికి లైవ్‌లో టెక్ సపోర్ట్ ఇవ్వవచ్చు' అని వాట్సాప్ తెలిపింది.
అప్డేట్ కావాలి!
WhatsApp Latest Version : వాట్సాప్ తీసుకొచ్చిన స్క్రీన్ షేరింగ్ ఫర్ వీడియో కాల్స్ ఫీచర్ ఉపయోగించాలంటే.. కచ్చితంగా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్డేట్ చేసుకున్న తరువాత వీడియో కాల్ చేసేటప్పుడు కొత్తగా స్క్రీన్ దిగువ భాగంలో 'Share' ఐకాన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే.. స్క్రీన్ షేరింగ్ యాక్సెస్ పర్మిషన్స్ అడుగుతుంది. మీరు దానిని కూడా ఓకే చేస్తే.. వెంటనే మీరు ఎవరెవరికి స్క్రీన్ చేయాలనుకుంటున్నారో.. వారందిరికీ లైవ్‌లో మీ స్క్రీన్ కనిపిస్తుంది.