కొవిడ్-19 పరిస్థితులతో వీడియో కాలింగ్ యాప్‌లు ఉపయోగించేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆన్‌లైన్ క్లాసులు, బోర్డు రూం మీటింగ్స్ కోసం స్కైప్, జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లు గ్రూప్ కాలింగ్ ఫీచర్లను కొత్త హంగులతో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ యాప్‌లకు పోటీగా పాపులర్ మెసేజింగ్ యాప్‌లు కూడా గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే టెలిగ్రాం ఈ ఫీచర్‌ను అందిస్తుండగా తాజాగా వాట్సాప్ కూడా గ్రూప్ కాలింగ్‌ను యూజర్స్‌కి పరిచయం చేసింది. మరి ఈ గ్రూప్ కాలింగ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
కాల్ ఇన్ఫో స్క్రీన్
వాట్సాప్ గ్రూప్ కాలింగ్‌లో కాల్ ఇన్ఫో స్క్రీన్ ముఖ్యమైన ఫీచర్. దీని సాయంతో గ్రూప్ కాలింగ్‌కి ఎవరిని ఆహ్వానించారు..వారిలో ఎంతమంది కాల్‌లో పాల్గొంటున్నారు..ఎవరు కాల్‌లో జాయిన్ కాలేదని తెలుసుకోవచ్చు. అలానే కాల్ ప్రారంభం నుంచి ఉన్నవారు..మధ్యలో జాయిన్ అయిన వారి వివరాలు కూడా తెలుస్తాయి.
అలా చేయలేరు
సాధారణంగా ఇతర యాప్‌లలో వీడియో కాల్‌లో పాల్గొంటున్నప్పుడు కాల్‌ని రికార్డు చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ గ్రూప్ కాల్‌ని రికార్డు చేయలేరు. ఇందులో గ్రూప్ వీడియో కాలింగ్‌కి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుంది. అలానే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అవతలి వ్యక్తి స్క్రీన్ షాట్ తీసినట్లు ఎలాంటి నోటిఫికేషన్ రాదు. దీంతో ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరచాలని పలువురు యూజర్స్ కోరుతున్నారు. స్క్రీన్ షాట్ తీసినప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు.
డ్రాప్, వీడియో ఆఫ్
ఇందులో యూజర్స్ తమ వీడియోని ఆఫ్ చేసి వీడియో కాల్‌లో పాల్గొనే సదుపాయం ఉంది. ఇందుకోసం స్క్రీన్ మీద ఉన్న వీడియో సింబల్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అలానే కాల్ మధ్యలో కట్ చేసి కొద్దిసేపటి తర్వాత వీడియో కాల్ కొనసాగుతుంటే స్క్రీన్ మీద మీకు జాయిన్, ఇగ్నోర్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో జాయిన్‌పై క్లిక్ చేసి గ్రూప్ కాల్‌లో జాయిన్ కావొచ్చు.