Whatsapp HD image sharing : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన ఫ్లాట్‌ఫాం ద్వారా హెచ్డీ క్వాలిటీ ఇమేజ్‌లను పంపించేందుకు వీలుగా ఓ సరికొత్త ఫీచర్‌ను తేవడానికి సన్నాహాలు చేస్తోంది. డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ మేరకు కొన్ని వాట్సాప్ హెచ్డీ ఇమేజ్ ఫీచర్ ఉన్న స్క్రీన్‌షాట్స్‌ను లీక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా iOS 23.11.0.76లోనూ, వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.23.12.13లోనూ అందుబాటులోకి వచ్చింది.
WhatsApp HD photo quality and its uses
వాట్సాప్‌లో ఈ హెచ్డీ ఫోటో ఫీచర్ వస్తే.. కనుక అది యూజర్లకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టాండర్డ్ క్వాలిటీలోనూ, అవసరమైతే హెచ్డీ క్వాలిటీలోనూ ఇమేజ్‌లను పంపించుకోవచ్చు. దాని కోసం మాన్యువల్‌గా మనం హెచ్డీ ఫోటో ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే హెచ్డీ క్వాలిటీ ఇమేజ్‌లను కొంత మేరకు కంప్రెస్ చేసి మాత్రమే వాట్సాప్‌లో పంపించగలం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ గ్యాలరీలోని ఫొటోలకు వాటర్‌మార్క్ పెట్టనప్పటికీ, వాట్సాప్ ద్వారా హెచ్డీ క్వాలిటీ చిత్రాలను పంపినప్పుడు, డిఫాల్ట్‌గా ఇమేజ్ బబుల్‌పై హెచ్డీ వాటర్‌మార్క్ పడుతుంది.