WhatsApp group video call limit : మెటా కంపెనీ నేతృత్వంలోని వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తెస్తూ, తన వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఒకేసారి 32 మంది గ్రూప్ వీడియో కాల్ మాట్లాడేందుకు వీలుగా మరో మంచి ఫీచర్‌ను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం దీనిని వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్లో టెస్ట్ చేస్తోంది. త్వరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకేసారి కేవలం 8 మంది మాత్రమే గ్రూప్ వీడియో కాల్లో మాట్లాడేందుకు అవకాశం ఉంది. దీనిని నాలుగు రెట్లు పెంచి, ఒకేసారి 32 మంది మాట్లాడుకోవడానికి వీలును కల్పించే దిశగా మెటా కంపెనీ నేతృత్వంలోని వాట్సాప్ ప్రయత్నిస్తోంది.
మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి వాట్సాప్ డౌన్లోడ్
WhatsApp for windows users : వాట్సాప్ ఇటీవలే తన ఎలక్ట్రాన్ బేస్డ్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను పూర్తిగా ఆపేసింది. కనుక ఇకపై దానికి అప్డేట్స్ రావు. అందుకే దాని స్థానంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి సరికొత్త వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే విధంగా మార్పులు చేసింది. అందువల్ల విండోస్ యూజర్లు కచ్చితంగా లేటెస్ట్ వాట్సాప్‌ను నేరుగా.. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
డబ్ల్యూఏబీటాఇన్ఫో లీక్స్
WhatsApp new group video calling feature : ప్రస్తుతం ఈ నయా వీడియో కాలింగ్ ఫీచర్ ఉన్న వాట్సాప్ బీటా వెర్షన్‌ను.. విండోస్ 2.2323.1.0లో పరీక్షిస్తున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది. ఇప్పటికే పలువురు బీటా యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చిందని కూడా పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 32 మందితో ఆడియో లేదా వీడియో కాల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇది సర్వస్ సైడ్ అప్డేట్ మాత్రమే అని, త్వరలోనే అందరు యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్స్
WhatsApp upcoming features 2023 :వాట్సాప్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు తరచుగా ఎన్నో సరికొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. త్వరలో 'మెసేజ్ పిన్ డ్యురేషన్ ఫీచర్'ను తీసుకురానుంది. దీని ద్వారా వినియోగదారులు ఒక మెసేజ్‌ను 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వ్యవధి పాటు పిన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మెసేజ్ డిస్అపీయరింగ్ మోడ్, వ్యూ ఒన్స్ అండ్ మల్టీ డివైజ్ ఫీచర్స్‌ను కూడా బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. మరీ ముఖ్యంగా వాట్సాప్ పైభాగంలో డార్క్ కలర్ బార్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
WhatsApp cyber security features : సైబర్ నేరగాళ్ల నుంచి యూజర్లకు భద్రత కల్పించడం కోసం కూడా వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వాట్సాప్ యూజర్లు స్వయంగా స్పామ్ కాల్స్‌ను మ్యూట్ చేసుకునే విధంగా ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే విధంగా మల్టిపుల్ అకౌంట్స్ మధ్య సులువుగా స్విచ్ కావడానికి వీలుగా మరో ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది.