ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించే సోషల్ మీడియా యాప్స్‌లో.. 'వాట్సాప్' టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ వాట్సాప్ ఉండే గ్రూప్‌ల గురించి అందరికీ తెలిసిన విషయమే. పొద్దున్న లేచింది మొదలు.. మనకు వాట్సాప్‌లో ఉన్న స్కూల్, కాలేజీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజినెస్ లాంటి గ్రూప్స్‌లో ఏ మెసేజ్‌లు వచ్చాయో చూస్తూనే ఉంటాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ గురించి అయితే అందరికీ తెలుసు కానీ.. వాట్సాప్ కమ్యూనిటీ గురించి కొందరికి మాత్రమే ఐడియా ఉంటుంది. మరి ఈ రెండు ఒకేలా అనిపించినా వీటి మధ్య చాలా తేడా ఉంది. మరి వాట్సాప్ గ్రూప్స్, కమ్యూనిటీల మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందామా!
వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ కమ్యునిటీ ఈ రెండూ ఒకే సారి అనేక మంది వ్యక్తులతో అనుసంధానం అవ్వడానికి ఉపయోగపడతాయి. చాలా మంది ఈ రెండూ ఒకేలా పని చేస్తాయి అనుకుంటారు. నిజానికి ఈ రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్‌లో అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సహోద్యోగులతో కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసుకుని వారితో అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే, వాట్సాప్ కమ్యూనిటీస్‌లో అయితే ఒకేసారి కొన్ని గ్రూప్స్‌ని కలిపి ఓ కమ్యూనిటీగా చేసి వారితో తమ సందేశాలను, అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుసుకుందాం రండి!
వాట్సాప్ గ్రూప్:
ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సహోద్యోగులతో కలిసి వారితో అభిప్రాయాలు పంచుకోవడానికి వీలుగా వాట్సాప్‌లో గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో మనం చెప్పాలనుకునే విషయం ఒకేసారి గ్రూప్‌లో ఉన్న అందరికీ చేరుతుంది. ప్రస్తుతం ఒక్కో వాట్సాప్ గ్రూపులో 1,024 మందిని సభ్యులుగా చేర్చుకునే అవకాశం ఉంది.
వాట్సాప్ కమ్యూనిటీస్ ప్రత్యేక ఎంటి?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి వాట్సాప్‌లో అనేక గ్రూప్స్ ఉంటున్నాయి. ఆయా గ్రూప్స్‌లో ఉన్న అందరికీ ఒకేసారి ఏదైనా సమాచారం పంపించాలి అంటే.. ప్రతి గ్రూప్‌ను సెలక్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అన్ని గ్రూప్‌లకు ఒకేసారి అనుకున్న మెసేజ్‌ను పంపేందుకు వీలుగా వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇది గత కొన్ని నెలలుగా వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కమ్యూనిటీస్‌లో 50 గ్రూప్‌లను యాడ్ చేయవచ్చు. దీంతో మనం క్రియేట్ చేసిన వాట్సాప్ కమ్యూనిటీస్‌లో ఏదైనా మెసేజ్ షేర్ చేస్తే అది అందులో ఉన్న అన్ని గ్రూప్‌లకు చేరుతుంది. ఈ కమ్యూనిటీస్ ఫీచర్‌తో ఒకేసారి ఎక్కువ మందికి సమాచారాన్ని సులువుగా షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనిటీస్‌లో ఉన్న ఒక గ్రూప్‌లోని సభ్యులు మరొక గ్రూప్ సభ్యులతో మాట్లాడాలా.. వద్దా.. అనేది కమ్యూనిటీస్ అడ్మిన్‌పై ఆధారపడి ఉంటుంది.