Whatsapp 256 Limit : వాట్సాప్‌లో ఎవరైనా గ్రూపు కట్టొచ్చు, టెక్ట్స్ మెసేజ్‌ల నుంచి 2 జీబీ మీడియా ఫైల్స్ వరకు షేర్ చేసుకోవచ్చు. అంతేనా.. నగదు చెల్లింపులు, ఆడియో/వీడియో కాల్స్, కమ్యూనిటీస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా మరో ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేయనుంది. ఒకటికంటే ఎక్కువ గ్రూపులలో సభ్యులుగా ఉన్నవారికి తరచుగా వచ్చే నోటిఫికేషన్లు విసుగుపుట్టిస్తుంటాయి. కొన్నిసార్లు గ్రూపు నోటిఫికేషన్లను మ్యూట్ చేస్తే, మరికొన్ని సందర్భాల్లో మరిచిపోతుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది.
వాట్సాప్ కొత్త ఫీచర్‌తో 256 మంది కంటే ఎక్కువమంది సభ్యులుగా ఉన్న గ్రూపు నోటిఫికేషన్లు ఆటోమేటిగ్గా మ్యూట్ అవుతాయి. ఉదాహరణకు మీరు సభ్యులుగా ఉన్న గ్రూపులో ఇప్పటిదాకా 256 మంది ఉన్నారు. ఈ గ్రూపులో ఇతరులు షేర్ చేసే మెసేజ్‌లు ఎప్పటిలానే మీకు నోటిఫికేషన్ స్క్రీన్‌లో కనిపిస్తాయి. కొత్తగా 257వ వ్యక్తి చేరితే, గ్రూపులో ఇతరులు షేర్ చేసే మెసేజ్‌లు మీకు నోటిఫికేషన్ స్క్రీన్‌లో కనిపించవు. వాట్సాప్ చాట్ పేజీలో ఈ గ్రూపు నోటిఫికేషన్లు మ్యూట్ అయినట్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. యూజర్ అన్‌మ్యూట్ చేస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి. ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్ 2.22.24.15 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం వాట్సాప్ గ్రూపు సభ్యుల సంఖ్యను 256 నుంచి 1024కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.