మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు.. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు ఈ దిశగానే మరో ముందడుగు పడబోతోంది. తర్వాతి తరం ఇంటర్నెట్(Metaverse Internet) అందుబాటులోకి రానుంది. కొద్ది సంవత్సరాల్లో మనుషులు పూర్తిగా వర్చువల్ ప్రపంచంలోనే గడిపేలా సాంకేతికత రూపుదిద్దుకుంటోంది!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్.. ఈ తర్వాతి తరం సాంకేతికతపై(Facebook Metaverse) దృష్టిసారించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మెటావర్స్ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ఫేస్‌బుక్‌ను ఓ సామాజిక మాధ్యమ సంస్థగా కంటే.. మెటావర్స్ కంపెనీగా ప్రజలు చూస్తారని చెబుతున్నారు. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ముందున్నారు మార్క్. ఇప్పటికే వేలాది మందిని ఈ పని కోసం నియమించుకున్నారు. ఐరోపాలో ఫేస్బుక్ తరఫున ఈ ఇంజినీర్లంతా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.
ఫేస్బుక్ దారిలోనే అనేక వీడియో గేమ్ కంపెనీలు మెటావర్స్‌పై(Metaverse Games) దృష్టిపెట్టాయి. ఆన్లైన్లో రాబోయే అతిపెద్ద మార్పు ఇదే కానుందని అంచనా వేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఫేస్బుక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మెటావర్స్ గురించి వివరించింది. దీంతో టెక్ నిపుణుల దృష్టి దీనిపై పడింది. ఇదే అంతర్జాల భవిష్యత్ కావొచ్చు. లేదంటే ఫేస్‌బుక్‌కు వచ్చిన బ్రహ్మాండమైన, వాస్తవ రూపం దాల్చని ఆలోచనగానే మిగిలిపోవచ్చు.
ఇంతకీ మెటావర్స్ అంటే ఏంటి?
ఇంటర్నెట్ రాకతో మనలో వచ్చిన మార్పులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అన్ని పనులూ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. భూగోళమంతా మన మునివేళ్ల మీదే ఉంటోంది. అయితే, మెటావర్స్ అనేది వీటన్నింటికీ మించి. ఇప్పటివరకు భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయిన మనుషులను వర్చువల్ వరల్డ్‌ను(Metaverse Virtual World) పరిచయం చేస్తుందీ మెటావర్స్. డిజిటల్ పరికరాల తెరలను చూడటానికే పరిమితమైన మనల్ని... అవధుల్లేని అంతర్జాల లోకంలో విహరించే వీలు కల్పిస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అంతులేని ప్రపంచం. దూరంగా ఉన్నవాళ్లు ఒకరినొకరు వర్చువల్‌గానే కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్‌గా, రియల్‌టైమ్‌లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లు, అగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, ఇతర పరికరాల సాయంతో ఈ మెటాఫోర్ను అభివృద్ధి చేయనున్నారు.
ఈ పనులే కాదు.. వర్చువల్ షాపింగ్లూ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలు కూడా మెటాఫోర్ విధానంలోనే అందుబాటులోకి రానున్నట్లు అధునాతన సాంకేతికతలపై పనిచేసే విశ్లేషకులు విక్టోరియా పెట్రాక్ పేర్కొన్నారు. 'ఇది తర్వాతి తరం కనెక్టివిటీ. ఈ నిరంతర విశ్వంలో ఇక్కడ ప్రతీదీ ఒకే చోట లభిస్తుంది. భౌతిక జీవితాన్ని గడిపినట్లే.. వర్చువల్‌గా మీ జీవితాన్ని గడుపుతారు' అని వివరించారు.
అయితే, ఈ సాంకేతికత ఇంతవరకు అందుబాటులోకి రాలేదు కాబట్టి వీటి గురించి ఇప్పుడే ఓ నిర్ధరణకు రాలేమని మరో గార్ట్నర్ రీసర్చ్ సంస్థ విశ్లేషకుడు ట్యూనాగ్ ఎంగుయెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మెటావర్స్ సాంకేతికతకు సంబంధించిన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి 10-15 సంవత్సరాలు పడుతుందని ఫేస్బుక్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
మెటావర్స్ అన్న పదాన్ని మొదటిసారి నీల్ స్టీఫెన్సన్ అనే రచయిత ఉపయోగించారు. 1992లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల 'స్నో క్రాష్'లో దీని గురించి ప్రస్తావించారు.
మెటావర్స్‌లో మనం ఏం పనులు చేయొచ్చు?
మెటావర్స్‌లో వర్చువల్ కాన్సర్ట్‌లు, ఆన్లైన్ పర్యటనలు చేపట్టవచ్చు. అంతర్జాలంలోనే దుస్తులు ధరించి మనకు సరిపోయే సైజులను గుర్తించవచ్చు. వర్క్ ఫ్రం హోమ్ విషయంలో విప్లవాత్మకంగా నిలవనుందీ మెటావర్స్. వీడియో కాల్స్‌లోనే సహోద్యోగులతో చూడటానికి బదులుగా.. వర్చువల్ వాతావరణంలో కలిసి పనిచేసుకోవచ్చు.
ఫేస్బుక్ ఇప్పటికే కంపెనీల కోసం హొరైజాన్ వర్క్రూం సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసింది. ఈ సంస్థే తయారు చేసిన 'ఆక్యులస్ వీఆర్' హెడ్సెట్లను ధరించి ఈ వర్క్రూంలలో పని చేసుకోవచ్చు. అయితే దీనిపై వచ్చిన రివ్యూలు మాత్రం ఆశాజనకంగా లేవు. ఒక్కో హెడ్సెట్ ఖరీదే 300 డాలర్లు (రూ.22 వేలకు పైగా) ఉంటోంది. దీంతో ఈ అత్యాధునిక పరిజ్ఞానం చాలా కంపెనీల తాహతకు మించినదేనని అర్థమవుతోంది.
ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై ఏ విధంగా కనెక్ట్ అవ్వాలనే అంశంపై సంస్థలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ సాంకేతికత కోసం నిర్దిష్ట నియమనిబంధనలను రూపొందించాల్సి ఉంది. ఇంటర్నెట్ మాదిరిగా.. ఏ కంపనీకి నియంత్రణ లేని వాతావరణాన్ని సృష్టించుకోవాలి. మెటావర్స్ అంటే ఒక్కటే అన్న భావన కలిగేలా చూడాల్సి ఉంది.
ఫేస్బుక్ పూర్తిగా మెటావర్స్‌లోకి మారుతోందా?