What Not to Do on Your Office Computer : కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఆ సంస్థ తరఫున సెల్ఫోన్లు ఇస్తాయి. ఎలాగో ఫ్రీ కదా అనుకుని ఎలా పడితే అలా వాడేస్తుంటాం. కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఉచిత ఇంటర్నెట్ దొరికిందికదా అని మన వ్యక్తిగత వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి చూస్తాం. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నప్పుడు కంపెనీ వాళ్లు చూడరు కదా అనుకుని ఇష్టం వచ్చినట్లు వాటిని వాడేస్తూ ఉంటాం. కానీ.. కంపెనీకి చెందిన డివైజ్‌లు వారి పర్యవేక్షణలో ఉంటాయని మీకు తెలుసా ? మీ డివైజ్‌లో ఒక వేళ మానిటరింగ్ సాఫ్ట్వేర్ లేకపోయినా.. మీరు చేసే పనిని యాక్సెస్ చేయడానికి షేర్డ్ సర్వీస్‌లు ఉంటాయి. వీటిని కంపెనీ ఉన్నతాధికారులు లేదా IT నిపుణులను చూస్తూ ఉంటారు. మీరు కనుక కంపెనీ ఫోన్లు లేదా కంప్యూటర్లను సొంత అవసరాలకు వాడినట్లైతే .. మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అందువల్ల కంపెనీ సెల్‌ఫోన్, కంప్యూటర్లో ఏయే పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
1. వ్యక్తిగత పనులు చేయవద్దు!
వ్యక్తిగత కార్యకలాపాల కోసం మీ కంపెనీ ఇచ్చిన ఫోన్, కంప్యూటర్ని ఉపయోగించకండి. వ్యక్తిగత కాల్స్, మెసేజెస్ చేయడం లేదా ఈ-మెయిల్స్ పంపడం లాంటివి చేయవద్దు. అలాగే సోషల్ మీడియా వినియోగం సహా, వ్యక్తిగత అవసరాలకు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయకండి.
2. వ్యక్తిగత ఫొటోలు వద్దు!
కంపెనీ ఫోన్‌తో ఫొటోలు తీయడం, దిగడం మానుకోండి. ఒక వేళ మీరు వాటిని డిలీట్ చేసినప్పటికీ.. ఆటోమేటిక్ బ్యాకప్ వల్ల క్లౌడ్‌లోకి అప్లోడ్ అవుతాయి. వీటిని మరొకరు చూసే అవకాశముంది. కొన్ని సార్లు వీటిని దుర్వినియోగం చేసే అవకాశమూ ఉంటుంది.
3. పర్సనల్ ఫైల్స్ ఉంచకండి!
ఆఫీస్ వర్క్ కోసం ఇచ్చిన కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో మీ వ్యక్తిగత ఫైల్స్‌ని ఉంచకండి. ఒక వేళ మీరు జాబ్ కోల్పోతే వెంటనే వాటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. పైగా జాబ్ విషయంలో ఏమైనా చట్టపరమైన పోరాటం జరిగితే.. ఈ అంశం మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది.
4. సెర్చ్ హిస్టరీపై అప్రమత్తంగా ఉండండి!
గూగుల్ లేదా ఇతర సెర్చ్ హిస్టరీపై అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి వీటిల్లో వెతక్కపోవడమే మంచిది. ఎందుకంటే సెర్చ్ హిస్టరీ అనేది కంప్యూటర్లో అత్యంత సులభంగా యాక్సెస్ చేయగల వాటిలో ఒకటి.
5. ప్రైవేటు సంభాషణలకు నో చెప్పండి
కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా ప్రైవేట్ చాట్లను ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ప్రైవేటు చాట్లు చేయవద్దు. అలాగే వాటిలో సోషల్ మీడియాను ఉపయోగించవద్దు.