టెక్నాలజీ పెరిగాక.. అన్ని సేవలు అరచేతిలోకి వచ్చేశాయి. ముఖ్యంగా గూగుల్ అందించే సేవలు మన జీవితంలో భాగమయ్యాయి. సందేశాల కోసం జీ మెయిల్, మార్గదర్శిగా జీ మ్యాప్స్, ముఖ్యమైన పత్రాలు, ఫొటోలను భద్రపర్చుకోవడం కోసం గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, లావాదేవీలకు జీపే ఇలా గూగుల్ అందిస్తోన్న అనేక సేవల్ని వినియోగించుకుంటున్నాం. ఈ క్రమంలో మన డేటా మొత్తాన్ని గూగుల్ అకౌంట్‌లో దాచేస్తున్నాం. వాటి గురించి మూడో కన్నుకు తెలియకకుండా పాస్‌వర్డ్ పెట్టుకుంటాం. అంతా బాగానే ఉంది. కానీ.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి గూగుల్ అకౌంట్ డేటా సంగతేంటి? ఎవరికీ పాస్‌వర్డ్ తెలియదు కాబట్టి.. ఆ అకౌంట్ ఏమైపోతుంది? ఇలాంటి సందేహం ఎవరికైనా కలిగిందా..? అడగకముందే అన్ని సమకూర్చే గూగుల్ ఈ విషయాన్ని ఎందుకు వదిలేస్తుంది..? దీనికి గూగుల్ వద్ద పరిష్కారాలున్నాయి. అవేంటంటే..
వివిధ అవసరాల కోసం గూగుల్ అకౌంట్‌ను తెరుస్తాం. అయితే.. అవసరం తీరాక లేదా మరో గూగుల్ అకౌంట్ ప్రారంభించడం లేదా వ్యక్తి మరణించడం వల్ల ఆ అకౌంట్ నిరుపయోగకరంగా మారిపోతుంది. అలా ఎక్కువ కాలం ఉపయోగించకుండా ఉన్న అకౌంట్లను గూగుల్ ఇనాక్టివ్(క్రియరహితం) చేస్తుంది. అయితే, ఇనాక్టివ్ అయినా అకౌంట్ డేటాను ఏం చేయాలనే విషయంలో యూజర్‌కు గూగుల్ రెండు ఆప్షన్లు ఇస్తుంది.
1. గూగుల్ డేటా యాక్సెస్ చేసే అవకాశం ఆ వ్యక్తి నచ్చిన వారికి ఇవ్వడం
- ఎంతకాలానికి అకౌంట్‌ను ఇనాక్టివ్ చేయాలి.. ఇనాక్టివ్ అయితే, అందులోని డేటా తీసుకోవడానికి ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనే విషయాన్ని యూజరే నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం myaccount.google.com/inactive సైట్‌లోకి వెళ్లి మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇన్‌యాక్టివేట్ అకౌంట్ మేనేజర్
- ఇనాక్టివ్ చేయడానికి ఎంత కాలం వేచిచూడాలో తెలిపి.. మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్.. ఇతర వివరాలను నమోదు చేయాలి. గరిష్ఠంగా 18 నెలలపాటు అకౌంట్ ఇనాక్టివ్ కాకుండా చూసుకోవచ్చు. ఆ తర్వాత గూగుల్.. ఆ అకౌంట్ ఇనాక్టివ్ అవగానే ఆ డేటాను ఎవరితో (గరిష్టంగా పది మంది) పంచుకోవాలనుకుంటున్నారో వారి మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను అడుగుతుంది. వాటిని నమోదు చేయాలి. వారి మెయిల్ ఐడీ జత చేయగానే గూగుల్ పే, గూగుల్ ఫొటోస్, గూగుల్ చాట్, లోకేషన్ హిస్టరీ తదితర వివరాలను జాబితా రూపంలో చూపిస్తుంది. వాటిలో ఏయే డేటాను యాక్సెస్ చేయొచ్చో ఎంపిక చేయాలి. పంచుకోవాల్సిన జాబితా
- ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. అకౌంట్ ఇనాక్టివ్ అవగానే ఆ వ్యక్తి ఎంపిక చేసుకున్న వారికి గూగుల్ మెయిల్ పంపించి అలర్ట్ చేస్తుంది. పంచుకోవాలనుకున్న డేటా వివరాలను మెయిల్‌లో పొందుపరుస్తుంది. దీంతో వారికి ఆ అకౌంట్ డేటాను చూసేందుకు, డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే, ఇనాక్టివ్ అయిన సమయం నుంచి మూడు నెలల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.