ప్రస్తుతం 'గూగుల్ ఫొటోస్'లో ఉచిత అన్‌లిమిటెడ్ స్టోరేజ్‌ని గూగుల్ అందిస్తోంది. అయితే ఇటీవల క్లౌడ్ విధానాల్లో చేసిన మార్పులతో ఇకపై 15జీబీ స్టోరేజ్ మాత్రమే యూజర్స్ ఉచితంగా పొందనున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు గూగుల్ ఇదవరకే వెల్లడించింది.
స్టోరేజ్ పరిమితి దాటితే?
2021 జూన్ 1 లోపు 15జీబీ పరిమితి దాటిన యూజర్స్‌కి స్టోరేజ్ మేనేజ్‌మెంట్ టూల్స్‌ని గూగుల్ అందిస్తుంది. గూగుల్ వన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఏయే కేటగిరీకి (ఫొటోస్, డ్రైవ్, జీమెయిల్) ఎంత మెమొరీ ఆక్రమించిందనేది ఇందులో చూసిస్తుంది. దాని ద్వారా అవసరం లేని ఫైల్స్‌ని సులభంగా డిలీట్ చేసుకోవచ్చు. అలానే 15జీబీ స్టోరేజ్‌ని మేనేజ్ చేసుకోవచ్చు.
ఒక వేళ ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునేవారు నెలవారీ చందా చెల్లించి స్టోరేజ్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు 100జీబీ స్టోరేజ్ కోసం నెలకు రూ. 130, ఏడాదికైతే. రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది.
మరి గూగుల్ ఫొటోస్ కాకుండా స్టోరేజ్ కోసం ఉన్న ఉత్తమ క్లౌడ్ సేవల సంస్థలేవి? వాటిలో ఎంత జీబీ వరకు ఉచితంగా స్టోరేజ్ సదుపాయం పొందొచ్చు? అధిక స్టోరేజ్ కోసం గూగుల్ క్లౌడ్ కాకుండా మార్కెట్లో ఉన్న ఇతర అవకాశాలేమిటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
వన్‌డ్రైవ్
వన్‌డ్రైవ్.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ స్టోరేజ్సేవల విభాగం. ఇందులో 5జీబీ స్టోరేజ్ మాత్రమే ఉచితం. గూగుల్ ఫొటోస్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే నెలకు రూ.140 చెల్లిస్తే 100 జీబీ స్టోరేజ్ వాడుకునేందుకు వీలు కల్పిస్తోంది వన్ డ్రైవ్.
ఒకవేళ మీకు మైక్రోసాఫ్ట్ 365 సబ్స్క్రిప్షన్ ఉంటే కొత్తగా స్టోరేజ్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ యూజర్లందరికీ ఒక టెరాబైట్ (టీబీ) వరకు ఫొటోస్, ఫైళ్లు స్టోరేజ్ చేసుకునే వీలుంది.
అమెజాన్ ఫొటోస్
గూగుల్ ఫొటోస్‌కు మంచి ప్రత్యామ్నాయంగా అమెజాన్ ఫొటోస్ను చెప్పుకోవచ్చు. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే మీకు అపరిమిత ఫొటోస్, 5 జీబీ వీడియో స్టోరేజ్ సదుపాయం లభిస్తుంది.