Wear Smart Watch While Sleeping is Safe or Not : ప్రపంచం మొత్తం "స్మార్ట్"గా ముందుకు సాగుతోంది. అవకాశం ఉన్న ప్రతి చోటా ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. చాలా మంది స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇవి ఫిట్‌నెస్ రిపోర్ట్‌ను అందిస్తున్నాయి. ఎంత దూరం నడిచారు? ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి? ఎంత సమయం నిద్ర పోయారు? వంటి విషయాలను చెప్పేస్తాయి. అయితే.. నిద్రపోతున్నప్పుడు స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్ ధరించడం సురక్షితమేనా? రేడియేషన్ ద్వారా ఆరోగ్యానికి ఏమైనా హాని కలిగిస్తుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మరి.. దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లలో స్లీప్ ట్రాకింగ్ ఎలా పని చేస్తుంది?
మన శరీరంలోని కండరాలు, మెదడు రిలాక్స్ కావడానికి మంచి నిద్ర చాలా అవసరం. కానీ.. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళన వల్ల సరైన నిద్ర ఉండదు. అందుకే.. ఎంతసేపు నిద్రపోయామనే విషయం తెలుసుకునేందుకు స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు ఉపయోగిస్తుంటారు. ఇవి ఫిట్‌నెస్ లెక్కించడానికి యాక్టిగ్రఫీ అనే సెన్సార్ సహాయం తీసుకుంటాయి. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లలో ఈ సెన్సార్ ఉంటుంది. అలాగే.. గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ సెన్సార్లతో మణికట్టు కదలికలను పరీక్షించడం ద్వారా నిద్రను ట్రాక్ చేస్తాయి. కొన్ని స్మార్ట్‌వాచ్‌లు నిద్రను లెక్కించడానికి హార్ట్ రేట్‌ను కూడా కాలిక్యులేట్ చేస్తాయి.
స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లలో రేడియేషన్ ఉంటుందా?
చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొన్ని రకాల రేడియేషన్లను విడుదల చేస్తాయి. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ (EMF) రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. అయితే.. ఇది తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అలాగే.. నాన్ అయోనైజింగ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. కాబట్టి వీటివల్ల ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
నిద్రపోతున్నప్పుడు స్మార్ట్‌వాచ్ ధరిస్తే?
స్మార్ట్‌వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌లను ధరించి నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఎక్కడా నిరూపితం కాలేదని నిపుణులు చెబుతున్నారు. వీటి నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ తక్కువ మొత్తంలో ఉండటం వల్ల.. 24/7 పెట్టుకోవచ్చని అంటున్నారు. స్లీపింగ్ ట్రాక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చని చెబుతున్నారు.