తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

VPN: నెట్టింట సేఫ్​గా విహరించండిలా..

ఇప్పటి జనరేషన్​లో అంతర్జాలంలేనిదే ఏ పనీ జరగదు. కానీ నెట్టింట్లో అడుగుపెట్టగానే ఎన్నో కళ్లు మనపై దృష్టిపెడుతుంటాయి. ఏ సైట్ ఓపెన్ చేస్తున్నాం, ఎంతసేపు గడుపుతున్నాం లాంటి వివరాలన్నీ ట్రాక్ చేస్తాయి. ఇది ప్రతిసారీ ప్రమాదకరం కాకపోయినా ప్రైవసీని మాత్రం దెబ్బతీస్తాయి. దీనికి పరిష్కారమే 'వీపీఎన్'. అదేంటి? ఎలా పనిచేస్తుందో తెలుసా?

vpn
VPN: నెట్టింట సేఫ్​గా విహరించండిలా!

By

Published : May 30, 2021, 6:21 PM IST

ప్రస్తుతం సమస్త ప్రపంచాన్ని ఏకం చేసేది ఏదైనా ఉందంటే అది అంతర్జాలమే. భూగోళంపై ఏ మూలన ఏం జరుగుతుందో ఇట్టే మన మునివేళ్లతో తెలుసుకోవచ్చు. రోజువారీ పనుల్లో భాగంగా మనం ఎన్నో సైట్​లు, యాప్​లను సందర్శిస్తాం. ఇలా ప్రతిసారీ మన యూజర్ యాక్టివిటీ సర్వర్లలో రికార్డ్ అవుతుంది. ఈ ట్రాకింగ్ ప్రతిసారీ ప్రమాదకరం కాకపోవచ్చు, కానీ మన ప్రైవసీకి మాత్రం ఇది భంగం కలిగించేదే.

యూజర్ల ఇంటర్నెట్​ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. అడ్వర్టైజ్​మెంట్స్​ ఇందులో ప్రధానమైనది. యూజర్ల అభిరుచికి తగ్గట్లు ప్రకటనలు కనిపించేలా చేసేందుకు బ్రౌజర్ యాక్టివిటీ ఉపయోగపడుతుంది. మన బ్రౌజింగ్ అలవాట్లను గుర్తించి సరిపోలిన సమాచారాన్ని మనకు ఈ నెట్​వర్క్​లు అందిస్తాయి. మీరెప్పుడైనా గ్రహించే ఉంటారు.. ఆన్​లైన్​లో ఓ ప్రొడక్ట్​ను మీరు సర్చ్ చేస్తే.. తర్వాత ఏ వెబ్​సైట్​కు వెళ్లినా మీకు అవే యాడ్​లు కనిపిస్తాయి. ఇలాంటివి జరగకుండా ఉంచడం సహా మన బ్రౌజింగ్ వివరాలను గోప్యంగా ఉంచేందుకు ఉపయోగించేదే వీపీఎన్(VPN).

వీపీఎన్ ఏంచేస్తుంది?

వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్(Virtual Private Network). ఇది యూజర్లకు, ఇంటర్నెట్​కు మధ్య సురక్షితమైన కనెక్షన్ అందిస్తుంది. వీపీఎన్​ ద్వారా మనం సెకండరీ నెట్​వర్క్​కు కనెక్ట్ అవుతాం. బ్రాడ్​బ్యాండ్​లో మన ఇంటర్నెట్ యాక్టివిటీని వీపీఎన్ నెట్​వర్క్​ పూర్తిగా అడ్డుకుంటుంది. ఇతర సైట్లు, నెట్​వర్క్​లు మన బ్రౌజింగ్ యాక్టివిటీని చూడకుండా చేస్తుంది. రిమోట్ వర్కింగ్ కోసం వీపీఎన్​ను సంస్థలు ఉపయోగిస్తుంటాయి. పనికి సంబంధించిన సమాచారాన్ని, ఫైళ్లను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసే వీలు దీని ద్వారా కలుగుతుంది.

వీపీఎన్ కనెక్షన్ ఎలా పనిచేస్తుంది?

వీపీఎన్ నెట్​వర్క్​ ఒక రకమైన భద్రతను అందిస్తుంది. ఇంటర్నెట్ యాక్టివిటీని ఎవరో ట్రాక్ చేస్తున్నారనే భయాన్ని దూరం చేస్తుంది. ఇది ఫోన్​ను ప్రైవేట్ సర్వర్లకు కనెక్ట్ చేస్తుంది. తద్వారా యూజర్ల ఐపీ అడ్రెస్ ఇతర నెట్​వర్క్​లకు కనిపించదు. డివైజ్ నుంచి వెళ్లే సమాచారాన్ని ఎన్​క్రిప్ట్ చేస్తుంది. ఏ నెట్​వర్క్​, సైట్ వీటిని గుర్తించలేవు.

వీపీఎన్ రూటర్ ఎంపిక చేసుకోవడం...

వీపీఎన్​ వల్ల చాలా లాభాలు ఉన్నప్పటికీ.. వీటిని తప్పుడు అవసరాలకు ఉపయోగించేవారూ ఉన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా పనిచేస్తే వారిని గుర్తించడమూ కష్టమవుతుంది. అందువల్లే మార్కెట్​లో వీపీఎన్ రూటర్లు సులభంగా లభించవు. అయితే, వీపీఎన్ క్లైంట్, క్లైంట్​ మోడ్​కు సహకరించే వీపీఎన్ హోమ్ రూటర్లు పరిమితమైన ఆప్షన్లతో బయట దొరుకుతాయి. ఎక్కువ లాభాలు, సెక్యూరిటీ ఇచ్చే వీపీఎన్ రూటర్​ను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

వీపిఎన్ ఎంచుకున్నాక..?

వీపీఎన్ బ్రాడ్​బ్యాండ్ కనెక్షన్ ప్రొవైడర్​ను ఎంపిక చేసుకున్న తర్వాత 'కిల్ స్విచ్'ను ఆన్ చేసుకోవాలి. ఒకవేళ వీపీఎన్ ఆగిపోతే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిలిచిపోయేలా ఈ 'కిల్ స్విచ్' పనిచేస్తుంది. తద్వారా ఇంటర్నెట్ యాక్టివిటీ సురక్షితంగా ఉంటుంది. వీపీఎన్ కనెక్షన్​ను లేటెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్​కు అనుగుణంగా అప్​డేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఇవీ చదవండి-

ABOUT THE AUTHOR

...view details