తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం- చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ వాయిదా

US Moon Landing 2024 : దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి ల్యాండర్​ను జాబిల్లిపైకి పంపాలని ఓ ప్రైవేటు కంపెనీ ద్వారా నాసా చేసిన ప్రయోగం విఫలమైంది. వ్యోమనౌకను చంద్రుడిపైకి దింపే ప్రయత్నాన్ని స్పేస్ కంపెనీ విరమించుకుంది. మరోవైపు, చంద్రుడిపైకి మనుషులను దింపే ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వల్ల నాసా వాయిదా వేసింది.

US Moon Landing 2024
US Moon Landing 2024

By PTI

Published : Jan 10, 2024, 7:34 AM IST

Updated : Jan 10, 2024, 8:44 AM IST

US Moon Landing 2024 :అమెరికా నుంచి దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై ఒక ల్యాండర్‌ పంపాలని చేసిన ప్రయోగం ఇంధనం లీకేజీ కారణంగా దాదాపు విఫలమైంది. పెరిగ్రిన్‌ వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ ప్రకటించింది. బ్యాటరీల సమస్యను ఎట్టకేలకు శాస్త్రవేత్తలు పరిష్కరించినప్పటికీ ప్రొపెల్లెంట్‌ కోల్పోవడం వల్ల తలెత్తిన అసలు సమస్యను మాత్రం సరి చేయలేకపోయామని వెల్లడించింది. దీంతో జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అవకాశం లేదని సంస్థ తెలిపింది.

ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ విడుదల చేసిన ల్యాండర్ గ్రాఫిక్ చిత్రం

ప్రస్తుతం ల్యాండర్‌ను అంతరిక్షంలో సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు ఆపరేట్ చేయడమే తమ ముందున్న కొత్త లక్ష్యం అని కంపెనీ తెలిపింది. వాహకనౌక సూర్యుడి దిశగా ఉందనీ బ్యాటరీ కూడా ఫుల్‌గా ఉన్న నేపథ్యంలో దాదాపు 40 గంటల కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం వుల్కన్‌ రాకెట్‌ ద్వారా ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి పెరిగ్రిన్‌ను నింగిలోకి ప్రయోగించింది. 7 గంటల తర్వాత ఈ వ్యోమనౌకలో ఇబ్బంది తలెత్తింది.

లీకేజీ సమస్యపై కంపెనీ విడుదల చేసిన వ్యౌమనౌక చిత్రం

నాసా ప్రయోగం వాయిదా
Nasa Moon Mission Date :మరోవైపు ఈ ఏడాది చివర్లో చంద్రుని చుట్టూ నలుగురు వ్యోమగాములను పంపాలని భావించిన నాసా సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రయోగాన్ని 2025 సె‌‌ప్టెంబర్‌కు వాయిదా వేసింది. 50 సంవత్సరాలలో మొదటి సారి చంద్రునిపై మనుషులను ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రయోగం కూడా 2025 నుంచి 2026కు వాయిదా పడింది.

ప్రైవేటు కంపెనీలపై ఆధారపడటం వల్లే!
ఆర్టెమిస్ పేరుతో నాసా ఈ ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలపై అతిగా ఆధారపడుతోంది. ఆస్ట్రోబోటిక్ ప్రయోగం విఫలమైన నేపథ్యంలో నాసా ప్రాజెక్టు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నాసా పంపించే వ్యోమగాముల ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశాన్ని గుర్తించడం కూడా ఆస్ట్రోబోటిక్ ప్రయోగం లక్ష్యాల్లో ఒకటి. కాగా, వచ్చే నెలలో హ్యూస్టన్​కు చెందిన మరో కంపెనీ చంద్రుడిపైకి ప్రయోగం చేపట్టనుంది.

Last Updated : Jan 10, 2024, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details