Tesla Malfunction: టెస్లా.. వాహన రంగంలో ఓ సంచలనం. అదిరే లుక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వంటి అధునాతన, అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు, ఎస్‌యూవీలు తీసుకొచ్చి.. నెక్స్ట్ జనరేషన్ వెహికిల్‌గా గుర్తింపు పొందింది. అయితే.. ఇప్పుడీ సంస్థను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో లోపాలు సవాళ్లు విసురుతున్నాయి. కార్ల యజమానులు, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. అనేక మంది ప్రాణాలను రిస్క్‌లో పడేస్తున్నాయి.
సడెన్ బ్రేక్‌లతో ప్రయాణికులకు షాక్‌లు
సెల్ఫ్ డ్రైవింగ్.. టెస్లా కార్లలోని ప్రత్యేక ఫీచర్. ఇది ఉంటే మనం డ్రైవింగ్ చేయనవసరం లేదు. ప్రశాంతంగా కూర్చుంటే.. కెమెరాలు, సెన్సార్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రీలోడెడ్ మ్యాప్స్ సాయంతో కారే మనల్ని కావాల్సిన చోటుకు తీసుకెళ్తుంది. అయితే.. డ్రైవర్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు వాహనాన్ని నియంత్రించాలని చెబుతోంది టెస్లా.
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్‌ను అమెరికాలో ఎక్కువ మందే ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇటీవల దీనిపై ఫిర్యాదులు ఎక్కువైపోయాయి. అమెరికా ప్రభుత్వ విభాగమైన జాతీయ రహదారి భద్రతా సంస్థ (ఎన్హెచ్టీఎస్ఏ)కు అనేక మంది టెస్లా యజమానులు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేస్తున్నారు. అందరి సమస్య ఒక్కటే ఫాంటమ్ బ్రేకింగ్.
ఫాంటమ్ బ్రేకింగ్ అంటే... అనవసరంగా కారు సడెన్ బ్రేక్ వేయడం. ఇది టెస్లా కార్లలో కొత్తేమీ కాదు. అంతకుముందు దాదాపు రెండేళ్లలో ఎన్హెచ్టీఎస్ఏకు ఇదే విషయంపై 34 ఫిర్యాదులు వచ్చాయి. కానీ.. గత 3 నెలల్లో లెక్క మారింది. ఏకంగా 107 కంప్లైంట్లు అందాయి. "ఆటో పైలట్ మోడ్‌లో ఉండగా కారు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తోంది. ఒక్కోసారి హైస్పీడ్ హైవేలపై ఇలా జరుగుతోంది. వెనుక నుంచి ఏదైనా కారు ఢీకొడుతుందేమోనన్న భయంతో నా పాదాన్ని యాక్సలరేటర్పైనే ఉంచాల్సి వస్తోంది." అని ఓ వ్యక్తి ఎన్హెచ్టీఎస్ఏకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అవతలివైపు లైనులో వెళ్లే వాహనాలు హెడ్ లైట్లు, నీడల కారణంగా టెస్లా కార్లు ఇలా సడెన్ బ్రేక్‌లు వేస్తున్నట్లు ఆ ఫిర్యాదుల విశ్లేషణ ద్వారా తెలిసింది. అనేక అడుగుల దూరంలో ఒక ప్లాస్టిక్ సంచి కనిపించినా తన కారు బ్రేక్ వేసిందని ఓ వ్యక్తి వెల్లడించాడు.