తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

2022లో కొవిడ్​ టీకా సహా ఎన్నో అద్భుతాలు.. మరి 2023లో? - చవక ఈవీలు న్యూస్

2022 సంవత్సరంలో ఎన్నో అద్భుతాలను సృష్టించాం. అణు సంయోగ ఇంధనం, పూర్తిగా విద్యుత్తుతో ఎగిరిన విమానం, కొవిడ్-19 బూస్టర్ వంటి వాటిని విజయవంతంగా సాధించాం. అయితే మరి ఈ సంవత్సరం ఎలాంటి విజయాలను ఆశించవచ్చు?

upcoming tech trends in 2023 news
కొత్త కాలానికి కొత్త టెక్కులు

By

Published : Jan 12, 2023, 9:57 AM IST

అణు సంయోగ ఇంధనం.. పూర్తిగా విద్యుత్తుతో విజయవంతంగా ఎగిరిన ప్రయాణికుల విమానం.. కొవిడ్‌-19 బూస్టర్‌ మోతాదు.. 2022లో ఇలాంటి అద్భుతాలెన్నో సాధించాం. ఇప్పుడు 2023లో ఎలాంటి విజయాలను ఆశించొచ్చు? శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎలా పురోగమించనుంది?

వర్చువల్‌ రియాలిటీ విస్తృతం..
వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, మిక్స్‌డ్‌ రియాలిటీ వాడకం ఈ ఏడాదిలో కొత్త పుంతలు తొక్కొచ్చు. మెటావర్స్‌ సంస్థ వినూత్న మెటాక్వెస్ట్‌ 3 హెడ్‌సెట్‌ను ఈ సంవత్సరంలోనే ప్రవేశపెట్టనుంది. ఇది మెటాక్వెస్ట్‌ ప్రొ కన్నా చవకగా అందుబాటులోకి రావొచ్చు. వర్చువల్‌ రియాలిటీ కంపెనీలు కేవలం గేమింగ్‌ మీదే కాదు.. ఇతర రంగాలకూ విస్తరించటం మీద దృష్టి సారించనున్నాయి. దీంతో ఇంటి నుంచి పని, వ్యాయామాలు, సామాజిక అనుసంధాన రంగంలో వినూత్న మార్పులు రావొచ్చు.

ఆఫీస్‌ 365 యాప్స్‌ను వర్చువల్‌ రియాలిటీతో అనుసంధానించొచ్చు. మెటా, మైక్రోసాఫ్ట్‌ కంపెనీల భాగస్వామ్యం దీనికి బీజం వేయనుంది. యాపిల్‌ సంస్థ కూడా ఆగ్మెంటెడ్‌ రియాలిటీ ఉత్పత్తులను తీసుకురానుంది. యాపిల్‌ సంస్థ చిరకాల కోరిక మిక్స్‌డ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ గురించి ఈ సంవత్సరంలో మరిన్ని వివరాలు బయటకు రావొచ్చు.

ప్రధాన స్రవంతిలోకి బయోటెక్‌..
కొవిడ్‌ను ఎదుర్కోవటానికి రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా పరిజ్ఞానం మరింత విసృతం కావటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రాణాంతక జబ్బుల పనిపట్టే దిశగా శాస్త్రవేత్తలు దీన్ని వినియోగించుకోవటం ముమ్మరం చేశారు. కొవిడ్‌ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను రూపొందించిన బయోఎన్‌టెక్‌ సంస్థ ఈ ఏడాది క్షయ, మలేరియా, హెర్పిస్‌ టీకాలను మనుషులపై కొత్త టీకాలను ప్రయోగించాలని భావిస్తోంది. మరో అధునాతన చికిత్స పద్ధతైన క్రిస్ప్‌ఆర్‌ కూడా విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తోంది. క్రిస్ప్‌ఆర్‌ జన్యు సవరణ చికిత్సను అమెరికా ఎఫ్‌డీఏ తొలిసారి ఆమోదించే అవకాశముంది. జన్యుపరంగా తలెత్తే రక్త సమస్యలైన సికిల్‌ సెల్‌, థలసీమియా జబ్బులు క్రిస్ప్‌ఆర్‌ చికిత్స అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఈ సంవత్సరమే ఇది మార్కెట్‌లోకి రావొచ్చు.

చవక ఈవీలు..
ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వెల్లువ 2022లో కొత్త పుంతలు తొక్కింది. ఈ సంవత్సరం ఇవి మరింత చవకగా, ఎక్కువమందికి అందుబాటులోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వాహన తయారీ సంస్థలు చవక ఈవీలను తీసుకురానున్నట్టు ప్రకటించాయి. ఇవే కాదు.. స్వయంచాలిత (అటానమస్‌) వాహనాలూ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయొచ్చు. ఉబర్‌ సంస్థ పూర్తిగా డ్రైవర్‌ రహిత వాహన సేవలను ఆరంభించటానికి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో సేవలందిస్తున్న జనరల్‌ మోటార్స్‌కు చెందిన రోబోటాక్సీ విభాగం పెద్దఎత్తున విస్తరించాలనీ భావిస్తోంది. ఒక్క కార్లు మాత్రమేనా? అటానమస్‌ ట్రక్కులు కూడా విస్తరించనున్నాయి. ఇవి సరకు రవాణా రంగాన్ని సమూలంగా మార్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

వాణిజ్య అంతరిక్ష ప్రయోగాలు..
అంతరిక్ష ప్రయోగ రంగంలో ప్రైవేటు భాగస్వామ్య ముద్ర ఈసారి ఇంకాస్త స్పష్టం కావచ్చు. మన దేశంలోనూ గత సంవత్సరం ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటివి ఈ సంవత్సరం మరింత ఎక్కువ సంఖ్యలో ప్రయోగించొచ్చు. చంద్రుడి మీద అడుగుపెట్టాలని భావిస్తున్న ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఈ సంవత్సరం స్టార్‌షిప్‌ రాకెట్‌ను తొలిసారిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టొచ్చని భావిస్తున్నారు. చంద్రుడితో పాటు అంగారకుడి మీదికి వ్యోమగాములను పంపాలనే ప్రయత్నంలో దీంతో పెద్ద ముందడుగు పడటం ఖాయంగా తోస్తోంది.

సిబ్బంది రహిత వాణిజ్య ల్యాండర్లు కూడా చంద్రుడి మీద దిగే అవకాశమూ కనిపిస్తోంది. జపాన్‌కు చెందిన ఐస్పేస్‌ గత డిసెంబరులో ప్రయోగించిన లూనార్‌ ల్యాండర్‌ వచ్చే మార్చిలో జాబిల్లి మీద దిగనుంది. అన్నీ సవ్యంగా జరిగితే చంద్రుడి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రైవేటు సంస్థగా ఇది రికార్డులకూ ఎక్కొచ్చు. అమెరికాకు చెందిన ఆస్ట్రోబాటిక్‌, ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ వంటివీ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. స్పేస్‌ఎక్స్‌కు చెందిన పోలారిస్‌ డాన్‌ మొట్టమొదటి స్పేస్‌వాక్‌ను పూర్తి చేయాలనీ భావిస్తోంది. ఈ ప్రయోగం మార్చిలోనే జరగనుంది.

దీని ద్వారా అంతరిక్షంలో నడిచే వ్యోమగాములు ప్రత్యేక కాంటాక్టు లెన్సులను ధరించనున్నారు. గురుత్వాకర్షణ అత్యంత స్వల్పంగా ఉన్నచోట్ల కంటి మీద పడే ఒత్తిడిని తెలుసుకోవటం వీటి ఉద్దేశం. మీథేన్‌తో నడిచే తొలి రాకెట్‌ ప్రయోగమూ ఈసారి సాకారం కావొచ్చు. ద్రవ హైడ్రోజన్‌ కన్నా మీథేన్‌ మరింత స్థిరంగా ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. ఒక మాదిరి ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయొచ్చు. కాబట్టి అంతరిక్ష ప్రయోగ రంగంలో ఇది విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టొచ్చు.

ABOUT THE AUTHOR

...view details