ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా ట్వీట్ ఎడిట్ ఫీచర్‌ను టెస్టింగ్‌లో భాగంగా కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.
Twitter Character Limit: సాధారణంగా ట్విట్టర్లో ఏదైనా రాసి పోస్ట్ చేయాలనుకుంటే కేవలం 280 అక్షరాలు వరకే ట్వీట్ చేయగలం. అంతకు మించి క్యారెక్టర్లు వాడాలనుకుంటే మరో ట్వీట్ చేయాల్సిందే. అందువల్ల కొన్నిసార్లు యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. అది గుర్తించిన ట్విట్టర్.. అక్షరాల పరిమితిని 280 నుంచి ఏకంగా 2,500కు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు నోట్స్ పేరిట కొత్త ఫీచర్‌ను త్వరలోనే తీసుకురానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. అందుబాటులోకి రాగానే యూజర్లు తమ సుదీర్ఘ సందేశాలను పోస్ట్ చేయొచ్చు.
దాంతో పాటు ఫొటోలు, వీడియోల వంటివి కూడా జోడించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ట్విట్టర్ టైమ్‌లైన్‌లో ఉంటుంది. మీరు చేసే ఈ సుదీర్ఘ ట్వీట్ ప్రివ్యూను కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఘనాలో ప్రయోగాత్మకంగా ట్విట్టర్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నోట్‌ను షేర్ చేసుకోవాలనుకునే వారి కోసం అందుకోసం ప్రత్యేకంగా లింక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. 2017 కంటే ముందు ట్విట్టర్లో క్యారెక్టర్ల పరిమితి 140గా ఉండేది. అయితే, అనంతరం ఆ పరిమితిని 280కి పెంచారు. ఇప్పుడు 2500 వరకు పెంచనుంది.