Twitter new Login : వెబ్ బ్రౌజర్లో లాగిన్ అవ్వకుండా ట్విట్టర్‌ను ఉపయోగించే నెటిజన్లకు మస్క్ టీమ్ బడా ట్విస్ట్ ఇచ్చింది. ఇకపై కచ్చితంగా లాగిన్ అయితే తప్ప మనం ట్వీట్స్‌ను చూడలేమంటూ ఓ కొత్త రూల్‌ను అమలు చేసింది. కనుక ట్విట్టర్ అకౌంట్ లేని వారు కచ్చితంగా ఓ నయా ఖాతాను క్రియేట్ చేసుకుని మరి వాడాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. అయితే 'విపరీతమైన డేటా స్క్రాపింగ్' కారణంగా ఇటువంటి అత్యవసర చర్యను తీసుకున్నట్లు ఎలన్ మస్క్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఇది తాత్కాలిక చర్య అని కూడా మస్క్ వెల్లడించారు.
Twitter Login News : అంకుర సంస్థల నుంచి అగ్రస్థాయి కంపెనీల వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే ప్రతీ సంస్థ.. ఖాతాల్లోని డేటాను ఉచితంగా తీసుకుంటున్నాయని మస్క్ అన్నారు. దీని వల్ల సాధారణ యూజర్ డేటా దోపిడీకి గురవుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా జరిగే అనవసరమైన సెర్చింగ్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల బయటి లింక్స్, ఎంబేడెడ్స్ ద్వారా ట్విట్టర్ ఖాతాల్లోని డేటాకు ఎటువంటి హానికారం కలగదని.. తమ వద్దనున్న డేటా సురక్షితంగా ఉంటుందని ట్విట్టర్ సంస్థ వెల్లడించింది. ఇక ముందు దీనికి ఓ దీర్ఘకాలిక పరిష్కారం దొరుకుతుందని తాము ఆశిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.