Twitter Post Limit : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజువారీగా చూసే పోస్ట్‌లపై పరిమితులు విధించారు. వెరిఫైడ్ ఖాతాదారులకు రోజుకు 6,000 పోస్ట్‌లు మాత్రమే చూసే అవకాశం ఉందని వెల్లడించారు. అన్‌వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకు 600 పోస్ట్‌లు మాత్రమే చూడొచ్చని పేర్కొన్నారు. కొత్త అన్‌వెరిఫైడ్ ఖాతాదారులు కేవలం 300 పోస్ట్‌లు మాత్రమే చూడొచ్చని వివరించారు. ట్విట్టర్లో డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మ్యానుపులేషన్ నివారించేందుకే.. తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలాన్‌మస్క్ ట్వీట్ చేశారు. త్వరలోనే రోజువాారిగా చూసే పోస్ట్‌ల సంఖ్యను వెరిఫైడ్ ఖాతాదారులకు 8వేలకు, అన్‌వెరిఫైడ్ ఖాతాదారులు 800లకు, కొత్త అన్‌వెరిఫైడ్ 400లకు పెంచనున్నట్లు మస్క్ మరో ప్రకటనలో వెల్లడించారు. మస్క్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారుడు తన పరిమితికి మించి పోస్ట్‌లను చూసిన తరువాత.. స్క్రోలింగ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.
ట్విట్టర్ సేవలకు అంతరాయం
ఇదిలా ఉండగా శనివారం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. అనతంరం ట్విట్టర్లో కొన్ని సమస్యలు తలెత్తాయి. దీనిపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ట్విట్టర్ అంతరాయం తర్వాత.. వినియోగాదారులు తమ అనుభవాలను చెెప్పేందుకు వేలాది సంఖ్యలో ట్విట్టర్‌ను సందర్శించారు. దీంతో ట్విట్టర్ యాక్సిస్‌లో ఉన్న వారు సైతం సమస్యలను ఎదుర్కొన్నారు. 45 శాతం యాప్‌లో, 40 శాతం వెబ్సైట్లో, మిగిలిన 15 శాతం ఫీడ్‌లో సమస్యలు తలెత్తాయి.