తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ట్విట్టర్​కు కేంద్రం షాక్- ఇక కష్టమే... - ఐటీ రూల్స్ ట్విట్టర్ వివాదం

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్(New IT Rules)​ విషయంలో ట్విట్టర్​కు(Twitter) మరో షాక్ తగిలింది. నూతన నిబంధనలు పాటించని కారణంగా ట్విట్టర్​ మధ్యవర్తిత్వ వేదిక హోదాను కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Twitter lost intermediary platform status
ట్విట్టర్​కు మధ్యవర్తిత్వ హోదా రద్దు

By

Published : Jun 16, 2021, 10:21 AM IST

Updated : Jun 16, 2021, 1:36 PM IST

మైక్రో బ్లాగింగ్​ ప్లాట్​ఫాం ట్విట్టర్​కు(Twitter) భారత్​లో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. కేంద్రం మే 26 నుంచి తప్పనిసరి చేసిన కొత్త ఐటీ నిబంధనలను (New IT Rules) పాటించని కారణంగా.. ట్విట్టర్​ మధ్యవర్తిత్వ వేదిక హోదాను కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కొత్త ఐటీ రూల్స్​ను పాటించని ఏకైక సంస్థ ట్విట్టర్​ మాత్రమేనని పేర్కొన్నాయి.

ఉద్దేశపూర్వక దిక్కరణే..

ఈ వ్యవహారంపై ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. మార్గదర్శకాలను పాటించడంలో ట్విట్టర్ విఫలమైందని పేర్కొన్నారు. నిబంధనల అమలుకు అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ట్విట్టర్​ వాటిని తప్పించుకునే దారిని ఎంచుకుందని మండిపడ్డారు.

స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే సంస్థగా చెప్పుకునే ట్విట్టర్​.. మధ్యవర్తిత్వ మార్గదర్శకాల విషయంలో మాత్రం ఉద్దేశ పూర్వక ధిక్కరణకు పాల్పడిందని ఆరోపించారు రవిశంకర్ ప్రసాద్​.

రవి శంకర్ ప్రసాద్​ ట్వీట్లు

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్​ అన్నింటినీ పాటించేందుకు ప్రయత్నిస్తున్నామని జూన్​ 9న కేంద్రానికి లేఖ రాసింది ట్విట్టర్​. నోడల్ కన్​స్ట్రక్చువల్​​ అధికారి (ఎస్​పీపీ), రీజినల్​ గ్రీవెన్స్ అధికారి (ఆర్​జీఓ) నియామకం తుది దశలో ఉందని అందులో పేర్కొంది.

కొత్త రూల్స్​ కచ్చితంగా పాటించాలని జూన్​ 5న కేంద్రం జారీ చేసిన తుది నోటీసులకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది.

ఆ అధికారిని నియమించినా..!

అయితే.. నూతన ఐటీ నియమాలకు అనుగుణంగా ఎట్టకేలకు చీఫ్​ కంప్లయన్స్​ అధికారిని నియమించినట్లు ట్విట్టర్​ బుధవారం ఉదయం పేర్కొంది. త్వరలోనే కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించనున్నట్లు తెలిపింది. ఈ లోపే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏమిటీ మధ్యవర్తిత్వ హోదా?

ఈ హోదా వల్ల.. సోషల్‌మీడియాలో ఎవరైనా అభ్యంతరకర సమాచారం పెట్టినా.. దాన్ని తమ వేదికగా ప్రచారం చేసినా.. ఆ సంస్థకు ఏమీ కాదు. కేవలం పోస్టు పెట్టిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేవారు. అంటే యూజర్లకు మధ్యవర్తులుగానే ఈ ప్లాట్​ఫామ్​లను చూస్తారు. కానీ మధ్యవర్తి హోదా రద్దయితే ఆయా సోషల్‌ మీడియా సంస్థలు కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది.

కేసు నమోదు..

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ట్విట్టర్‌పై కేసు కూడా నమోదైంది. జూన్‌ 5న ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘాజియాబాద్‌ పోలీసులు ట్విట్టర్‌, కొందరు జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అభ్యంతరకర, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించనందుకుగానూ ఈ కేసు నమోదైంది.

కొత్త నిబంధనలు..

భారత్‌లో సామాజిక మాధ్యమాలు, వార్తాసైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్రం ఫిబ్రవరిలో ప్రకటించింది. వీటి ప్రకారం.. ఆయా సంస్థలు..

  • దేశంలో వీటి పేరు, చిరునామా, అధికారుల వివరాలు తమ యాప్‌ల్లో, సైట్లలో స్పష్టంగా తెలియజేయాలి.
  • నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి దేశీయంగా అంతర్గత యంత్రాంగం ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలి.
  • అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు.. తదితరాల వివరాలు నెలకోసారి అందజేయాలి.
  • దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారం, పోస్టులు పెడితే.. వాటి మూలాలను (మెసేజ్‌లోని వివరాలు ఇవ్వకున్నా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.
  • ఎవరైనా వినియోగదారుల సందేశాలనుగానీ, వారి అకౌంట్లనుగానీ సామాజిక మాధ్యమం తొలగిస్తే వారికి తమ వాదన వినిపించుకోవటానికి తగిన సమయం కల్పించాలి.
  • సామాజిక మాధ్యమాలపై వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వంలోని ఓ ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది.

వాస్తవానికి ఈ నిబంధనలు ఫిబ్రవరిలోనే అమల్లోకి వచ్చినా.. దిగ్గజ సామాజిక వేదికలకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3 నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు మే 25తో ముగియడం వల్ల మే 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సామాజిక మాధ్యమ వేదికలన్నీ ఈ రూల్స్‌కు కట్టుబడి ఉండాలి. లేని పక్షంలో ఇన్నాళ్లూ వాటికి రక్షణ గోడగా నిలుస్తున్న 'మధ్యవర్తి హోదా' రద్దవుతుందని కేంద్రం గతంలోనే హెచ్చరించింది.

ఇదీ చదవండి:దిగొచ్చిన ట్విట్టర్​.. ఆ పోస్టుకు భారత అధికారి నియామకం

Last Updated : Jun 16, 2021, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details