ఇప్పటివరకు కొన్నిరకాల యాప్‌ల ద్వారానే వివిధ కార్యక్రమాలు చూస్తున్న వారికి శుభవార్త. అన్నిరకాల టీవీ కార్యక్రమాలనూ నేరుగా సెల్‌ఫోన్‌కే ప్రసారం చేసే విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో అమలుచేస్తామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర గురువారం తెలిపారు. ఇది దాదాపు ఎఫ్‌ఎం రేడియోలాగే పనిచేస్తుంది. అందులో రేడియో ఫ్రీక్వెన్సీని అందుకునేందుకు ఒక రిసీవర్ ఉంటుంది.
బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్‌కాస్ట్ సాంకేతికతలను కలిపి మొబైల్ ఫోన్లలో డిజిటల్ టీవీ కార్యక్రమాలు అందుకునేలా చేస్తారు. తద్వారా స్మార్ట్‌ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ నేరుగా వస్తుంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన 'బిగ్ పిక్చర్ సమిట్'లో మాట్లాడుతూ, టీవీ ప్రసారాలు నేరుగా సెల్‌ఫోన్‌కు అందితే వీక్షకుల సంఖ్య కొన్ని రెట్లు పెరుగుతుందని అపూర్వ చంద్ర అన్నారు. 'ప్రస్తుతం దేశంలో 20 కోట్ల టీవీలే ఉన్నాయి. కానీ, 60 కోట్ల స్మార్ట్‌ఫోన్లు, 80 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. అందువల్ల టీవీ మీడియా ప్రజలకు మరింత చేరువ అవుతుంది. దీనిపై బెంగళూరులో ఇప్పటికే ఐఐటీ కాన్పుర్, శాంఖ్య ల్యాబ్స్ ఒక పరిశోధన చేశాయి. త్వరలో నొయిడా లేదా దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తాం' అని ఆయన వివరించారు.
దేశంలో 120 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా, వారిలో 60 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ల ద్వారా అపరిమిత సమాచారం, వినోదం పొందుతున్నారని చంద్ర చెప్పారు. యువతరం సంప్రదాయ మీడియా నుంచి కొత్త మీడియా వైపు మళ్లుతున్నారని, అందువల్ల విశ్వసనీయత సవాలుగా మారిందని అన్నారు.