2000 సంవత్సరం నవంబర్ 2.. విశాలమైన మన అఖండ ప్రపంచంలో అందరం కలిసి ఉన్న చివరి రోజు. మనిషిగా పుట్టి బతికి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజు వరకే ఈ భూమిపై ఉన్నారు. కానీ ఆ రోజు తర్వాత నుంచే ధరణి వీడి దూరంగా ఉండాలని తెలిసినా మానవుడు తన సాహస ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. బంధాలు, బంధుత్వాలను త్యాగం చేసి అంతరిక్షంలో ప్రయోగాల్లో నూతన శకానికి నాంది పలికాడు. ఆ రోజు తర్వాత నుంచే పుడమి దాటి, శూన్యాన్ని ఛేదించుకుంటూ భూమికి పైన నివసించడం ఆరంభించాడు.
1961లోనే యూరీ గగారిన్ రోదసిని తొలిసారి చుట్టొచ్చినా... ఎవరూ భూమి దాటి లోయర్ ఆర్బిట్లో నివసించలేదు. 1998 నవంబర్ 20న నాసా సహా ఐదు దేశాల సంస్థలు ఐఎస్ఎస్(అంతర్జాతీయ స్పేస్ స్టేషన్)ను ప్రారంభించాయి. అనంతరం 2000 నుంచే మానవుడు సుదీర్ఘ కాలంగా అక్కడ ఉండటం ప్రారంభించాడు. ఇప్పటికీ నడి ఆకాశంలోకి శాస్త్రవేత్తలు వెళ్తూ వస్తూ ఉన్నా... ఎవరో ఒకరు ఆ స్టేషన్లో ఉంటూనే ఉంటారు. వారి కోసం ఆహారం, నీరు, నిత్యవసరాలు వంటివి ఇక్కడ నుంచి పంపిస్తూనే ఉంటారు ఇక్కడి ప్రజలు.