కరోనా కారణంగా ఇంటి వద్ద పని చేయించడానికే ఎక్కువ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యా సంస్థలు ఆన్లైన్లో పాఠాలు బోధించడానికే మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ల్యాప్‌టాప్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటివారు ల్యాప్‌టాప్ కొనే ముందు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.
బడ్జెట్
ల్యాప్‌టాప్ కొనేముందు బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం ముఖ్యమైంది. ఒకవేళ మీరు అనుకున్న బడ్జెట్ కంటే ల్యాప్‌టాప్ ధర ఎక్కువ అయితే కొనడం మానేయడం సమస్యకు పరిష్కారం కాదు. వివిధ ధరల్లో పలు రకాల బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ బడ్జెట్... మీ ఎంపికను నిలువరించలేదు.
ప్రాసెసర్, ర్యామ్
ఒక ల్యాప్‌టాప్ ప్రాసెసర్ దాని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా 'ఇంటెల్, ఏఎండీ సీపీయూ' ప్రాసెసర్‌తో ల్యాప్‌టాప్‌లు విపణిలో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ నుంచి ప్రారంభమవుతుంది. అత్యధికంగా కోర్ ఐ5ను వినియోగించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
ఎక్కువ ర్యామ్ ఉంటే అనేక పనుల్ని ఎటువంటి ఆటంకం లేకుండా చేయగలదు. మీ అవసరాలు తక్కువగా ఉంటే కోర్ ఐ3 ప్రాసెసర్‌లో 4 లేదా 8 జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ లేదా ఐ5 ప్రాసెసర్‌తో 4 జీబీ ర్యామ్ ఉన్నది కొనుక్కోవడం మంచిది. మధ్య తరహా ఉపయోగాలకు ఇంటెల్ కోర్ ఐ5లో 8జీబీ ర్యామ్, మరీ అధికంగా పని ఉండి, మీ బడ్జెట్ సరిపోతుందని అనుకుంటే కోర్ ఐ7లో 16 బీజీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ కొనుక్కోడం ఉత్తమం.