ఈమధ్య వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వాడకం పెరిగాయి. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా సైట్లలో ఫేస్‌బుక్ ఒకటి. పదేళ్ల కింద సోషల్ మీడియా అంటే ఫేస్‌బుక్ అనేలా ఉండేది. ఇప్పటికీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అనేక మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. అందులోనే తమ భావాలను పంచుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు, దగ్గరివారితో మెసేజ్‌ల రూపంలో మాట్లాడుకుంటూ ఉంటారు. వ్యక్తిగత సంభాషణలకు ఫేస్‌బుక్‌ను మించిన ప్లాట్‌ఫామ్ లేదని చెప్పొచ్చు. అయితే, కొంతమంది దీనిని తప్పుడు ఉద్దేశంతో వాడుతున్నారు. ఫేస్‌బుక్‌కు ప్లస్ పాయింట్‌గా చెప్పుకునే కొన్ని అంశాలే పలు సందర్భాల్లో తీవ్ర అనర్థాలకు దారి తీస్తోంది. అదే ఫేక్ ప్రొఫైల్స్ల బెడద. ఈ జాఢ్యం ఎంతలా పెరిగిపోయిందంటే దీన్ని తయారు చేసిన ఫేస్‌బుక్‌నే తీవ్రంగా ఇబ్బంది పెట్టేవిధంగా. మరి ఈ ఫేక్ ప్రొఫైల్‌ల మాయాజాలాన్ని గుర్తించి వాటికి అడ్డుకట్ట ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్రమత్తత అవసరం..!
ఫేస్బుక్లో జరిపే పర్సనల్ చాటింగ్‌లు, అందులోనూ దగ్గరివారితో పంచుకున్న సున్నితమైన విషయాలను కేటుగాళ్లు దుర్వినియోగం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ ప్లాట్ ఫామ్‌లో మీకు కావాల్సిన వ్యక్తితో మీరు చాటింగ్ చేస్తుండొచ్చు. కానీ ఆ వ్యక్తి మీరు అనుకున్న వ్యక్తి కాకపోవచ్చు! అది ఆన్లైన్ ఫేక్ ప్రొఫైల్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వ్యక్తులు ఫేక్ ప్రొఫైల్స్ల రూపంలో మీకు దగ్గరై.. మీ సమాచారాన్ని రాబట్టి మిమ్మల్ని లేనిపోని సమస్యలకు గురిచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్స్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.
నిజాయతీగా ఉండాలి..!
ఎక్కడైనా సరే మనకో గుర్తింపు తెచ్చుకోవాలంటే మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలి. అది బయట సమాజంలో కానివ్వండి, విద్య, ఉద్యోగ, ఉపాధి లేదా ఇతర రంగం ఏదైనా కానివ్వండి. మనం ఎలా ఉన్నామో అలా ఉంటేనే ఇతరులకు నచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలోనూ మనదైన వ్యక్తిత్వంతో, హుందాగా ప్రవర్తిస్తేనే బాగుంటుంది. ఫొటోలు, విద్య, ఉద్యోగం వంటి మన వ్యక్తిగత సమాచారం కూడా సోషల్ మీడియాలో ఉన్నది ఉన్నట్లు అప్లోడ్ చేయాలి. అప్పుడే మన మిత్రులు మనల్ని సులువుగా గుర్తించగలరు.
కొందరు మాత్రం తమ సొంత గుర్తింపును కాక ఇతరుల ఐడెంటిటీని వాడి ఫేస్బుక్లో నకిలీ ఖాతాలను తెరుస్తుంటారు. కుటుంబీకులు లేదా మిత్రుల్లో ఎవరి ఫొటోలు అయినా తీసుకుని డిస్ప్లే పిక్చర్(డీపీ)లుగా పెట్టుకుంటారు. ఫేక్ ప్రొఫైల్స్ వాడే మగవారు ఎక్కువగా అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తుంటారట. తమకు తెలిసినవారిలో ఎవరైనా అందమైన అబ్బాయిలు ఉంటే వారి ఫొటోలు పెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్ చేస్తారట. సెలబ్రిటీలకు దగ్గరయ్యేందుకు కూడా ఫేక్ ప్రొఫైల్స్‌ను వినియోగిస్తున్నారట. ఇలాంటి ప్రొఫైల్స్ వాడేవారు ఏదైనా చెడు జరిగితే డీపీలో ఉన్న వ్యక్తుల మీదకు ఆ తప్పును నెడుతున్నారని నిపుణులు అంటున్నారు. కాబట్టి సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్‌బుక్‌ను వినియోగించే వారు నకిలీ(ఫేక్) ప్రొఫైల్స్‌ను గుర్తించడం అన్నది తప్పనిసరి. వీటిని జల్లెడ పట్టేందుకు పలు సూత్రాలను సూచిస్తున్నారు టెక్ నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అంగట్లో ఫేక్ అకౌంట్లు!
ఫేస్బుక్లో ఉండే ఫేక్ అకౌంట్లలో చాలా వరకు హ్యాక్ చేసిన అకౌంట్లే. ఫేస్బుక్లో ఉన్న పాత అకౌంట్లకు బ్లాక్ మార్కెట్లో డిమాండ్ బాగా పెరుగుతోందట. ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఫాలో అవుతూ ఒక కొత్త ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తే.. దాన్ని గుర్తించడం సులువే. అందుకే కొందరు కేటుగాళ్లు కొత్త అకౌంట్లకు బదులు అప్పటికే ఉన్న పాత అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా దేశానికి చెందిన పాత అకౌంట్‌ను బ్లాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి మరి కొంటున్నారట.
ఫేక్ వీరులు రెగ్యులర్‌గా పోస్ట్‌లు పెట్టరు!
ఫేక్ ప్రొఫైల్స్లలో ఒక విషయాన్ని సులువుగా గుర్తించొచ్చు. రోజువారి జీవితానికి సంబంధించిన అప్డేట్లు ఈ ఖాతాల్లో పెద్దగా ఉండవు. వారు ఎవరి పేరు మీద నకిలీ అకౌంట్ క్రియేట్ చేశారో.. వారికి సంబంధించి ఏవైనా ఫొటోలు గానీ వీడియోలు గానీ దొరికితేనే వాటిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటారు. ఒక్కోసారి ఆయా వ్యక్తుల ఫొటోలను దొంగిలించి కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటారు.