సిమ్‌కార్డులు తీసుకునేందుకు, ఆర్థిక లావాదేవీలకు ఇ-కేవైసీ కోసం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ వేలిముద్రలు వేస్తుంటాం. ఆధార్ కార్డు జారీచేసేప్పుడు మన వేలిముద్రలు/కనుపాపల ఐరిస్ తీసుకుని, డేటాలో నిక్షిప్తం చేసినందున, ఆధార్ అనుసంధానిత పథకాల్లో వ్యక్తుల ధ్రువీకరణ క్షణాల్లో పూర్తవుతోంది. అయితే వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ఈ వేలిముద్రల డేటాను సేకరిస్తున్న మోసగాళ్లు, వాటితో వేలిముద్రల రూపులు తయారు చేసి, వేరే రాష్ట్రాల్లో నగదు అపహరిస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.ఇందుకోసం ఆధార్, బయోమెట్రిక్స్ వివరాలను లాక్ చేసుకుని, అవసరమైనప్పుడు అన్‌లాక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు సంక్షిప్త సందేశాలు(ఎస్ఎంఎస్) లేదా ఎం ఆధార్ యాప్‌ను వినియోగించుకోవచ్చు.
ఎలాగంటే..
- ఆధార్‌తో అనుసంధానమైన సిమ్‌కార్డు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఎంఆధార్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
- దీనిలో మన ఆధార్ నెంబరు నమోదు చేసి, సూచనలు పాటిస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- తదుపరి 16 అంకెల వర్చువల్ ఐడీని సృష్టించుకోవాలి. దీనిని 24 గంటలకు ఒకసారి మార్చుకోవచ్చు కూడా.
- ఇది నమోదయ్యాక యాప్‌లో మన ఆధార్ కార్డు ప్రత్యక్షమవుతుంది.
- తదుపరి కింది భాగంలో సర్వీసెస్, మైఆధార్, ఎన్రోల్మెంట్ సెంటర్, మోర్ వంటి విభాగాలుంటాయి.
- ఇందులో మైఆధార్ను క్లిక్ చేస్తే గెట్ ఓటీపీ, క్యూఆర్‌కోడ్, ఇ-కేవైసీ, అథెంటికేషన్ హిస్టరీ, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా, అప్డేట్ హిస్టరీ వంటివి కనిపిస్తాయి.
- వాటి దిగువన ఆధార్ అప్డేట్, బుక్ యాన్ అపాయింట్మెంట్, వర్చువల్ ఐడీ, బయోమెట్రిక్స్లాక్, ఆధార్ లాక్ కనపడతాయి.
ఈ మోసాల బారిన పడకుండా..
మనం యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసో, ఫోన్ నెంబరుకు నగదు బదిలీ ద్వారానో బిల్లులు చెల్లిస్తుంటాం. ఇవన్నీ కూడా మన ఆధార్, బ్యాంక్ ఖాతా- ఫోన్‌నెంబరు జత అయిన ఫలితంగానే సాధ్యమవుతోంది. ఏటీఎంలలో అయితే నగదును కార్డు-పిన్ వినియోగించుకుని, ఉపసంహరిస్తుంటాం. గ్రామాల్లో ఏటీఎంలు అతి తక్కువగా ఉన్నాయి. గ్రామీణులకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి అందించేందుకు, ఖాతాల్లో నగదు జమ చేసేందుకు 'బ్యాంకింగ్ కస్టమర్ సర్వీస్ పాయింట్' (సీఎస్పీ)లను బ్యాంకులు నెలకొల్పాయి. ఆధార్‌తో అనుసంధానమయ్యే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు సాధారణ బ్యాంక్ ఖాతాదారులు కూడా నగదును ఈ కేంద్రాల్లో ఉపసంహరించుకోవచ్చు. గరిష్ఠంగా ఒక వ్యక్తి రోజుకు రూ.30,000 వరకు ఇక్కడ విత్‌డ్రా చేయొచ్చు.
ఒక బ్యాంక్ తరఫున నిర్వహించే కేంద్రంలో ఏ బ్యాంక్ ఖాతాదారు అయినా ఆధార్ అనుసంధానిత వివరాలతో, వేలిముద్ర వేసి కూడా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఈ సదుపాయాన్నే బిహార్ వంటి చోట్ల నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఖాతాదారుల వేలిముద్రలు, ఆధార్ వివరాలు సేకరించి, వాటితో రూపులు తయారు చేస్తున్నారు. తదుపరి సుదూర రాష్ట్రాల్లో తమకు అనువుగా ఉన్న గ్రామాల్లోని సీఎస్పీల దగ్గర, ఆ వేలిముద్రల సాయంతో, సంబంధితుల ఖాతాలోని నగదును అపహరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై విశాఖ పోలీసులు కేసులు కూడా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.