వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం సంస్థ. వచ్చే ఏడాది నుంచి మనుషుల అంతరిక్ష పర్యాటకానికి కృషి చేస్తోంది. ఈ దిశగా పరిశోధనలు చేయనున్నారు. అందుకే కెల్లీ గెరార్డిని ఎంపిక చేశారు. ఈమె ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్ (ఐఐఏఎస్)లో పరిశోధకురాలు. ఆస్ట్రోనాటిక్స్, స్టెమ్ అంశాలతోపాటు తల్లిగా తన అనుభవాలను టిక్‌టాక్, ఇన్‌స్టాలలో పంచుకుంటూ ఉంటుంది. తనకు అక్కడ ఒక్కోదానిలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. స్పేస్ టూరిజంపై ఆసక్తి, కొంత ఫాలోయింగ్ ఉండటంతో ఈమెను ఎంచుకున్నారు.
వెళ్లి రావడానికే కాదు..
కెల్లీ కేవలం వెళ్లి రావడానికే పరిమితం కాదు. మానవ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సాంకేతికతలను తన మీద పరీక్షిస్తారు. సున్నా గ్రావిటీలో ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో శరీరంలో, శరీర బరువులో మార్పులకు సంబంధించి బయోమెట్రిక్ డేటాను సేకరిస్తారు. ఇది దాదాపుగా 60 నుంచి 75 నిమిషాలపాటు సాగుతుంది. వీటి ఆధారంగా పర్యటక స్పేస్ ఫ్లైట్లను మరింత ఆధునీకరిస్తారు.