Smartphone Features: మొబైల్‌ఫోన్ల వాడకం మారిపోయింది. కాల్, మెసేజ్‌లకే కాదు.. సమస్త పనులకు ఇదే ఆధారమైపోయింది. విజ్ఞానానికైనా, వినోదానికైనా అన్నింటికీ ఇదే. ఫొటోలు తీయాలన్నా, సినిమాలు చూడాలన్నా, సంగీతం వినాలన్నా, డబ్బులు పంపించాలన్నా.. ముందుగా ఫోన్ మీద చేయి పడాల్సిందే. వినూత్న యాప్‌ల ఆవిష్కరణతో రోజురోజుకీ ఫోన్ సరికొత్త సొబగులు సంతరించుకుంటోంది మరి. గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షలాది యాప్‌లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా కొత్తగానూ మార్చేస్తాయి. కొన్ని ఇతర పరికరాలతో అనుసంధానం చేస్తే.. మరికొన్ని మన పనులను ఆటోమేట్ చేసేస్తాయి. కొన్ని యాప్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మంచి ఫీచర్లను తేలికగా, సమర్థంగా వాడుకునేలా చేస్తాయి. అలాంటి యాప్‌ల్లో కొన్ని ఇవీ..
లింకెట్ బ్రౌజర్
వెబ్ ప్రపంచంలో ఆసక్తికరమైన కథనాలను అన్వేషించటానికి సామాజిక మాధ్యమాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. కాకపోతే వాటిని అక్కడే చదువుకోవటం కుదరదు. వీటిని గుర్తుంచుకొని తర్వాత చదవటం కాస్త కష్టమైన పనే. ఇక్కడే లింకెట్ బ్రౌజర్ చేదోడుగా నిలుస్తుంది. ఇంతకుముందు దీన్ని క్రోమర్ అని పిలుచుకునేవారు. ఇది ప్రస్తుతం వాడుతున్న డిఫాల్ట్ బ్రౌజర్‌తో జతకట్టి పనిచేస్తుంది. నేపథ్యంలో వెబ్ పేజీలు కనిపించేలా చేయటం దీని ప్రత్యేకత. తెర మీద బబుల్స్ మాదిరిగా తేలియాడే పేజీల లింకులను ట్యాప్ చేసి ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. క్లిక్ చేసిన లింకులను ఏఎంపీ వర్షన్‌లో లోడ్ చేయటం వల్ల వేగం కూడా పెరుగుతుంది. వెబ్ పేజీలను ఆర్టికల్ మోడ్‌లోనూ చూసుకోవచ్చు.
పాపప్ విడ్జెట్ 3
మంచి ఆండ్రాయిడ్ విడ్జెట్లు నిజంగానే ఎంతగానో పనికొస్తాయి. కానీ ఎక్కువ విడ్జెట్లను వాడితే అవన్నీ హోం స్క్రీన్ మీద చిందరవందరగా కనిపిస్తాయి. ఫోన్ వేగమూ నెమ్మదిస్తుంది. పాప్ విడ్జెట్ 3 యాప్‌తో ఇలాంటి చిక్కులను తప్పించుకోవచ్చు. ఇది మనం ఎంచుకున్న విడ్జెట్లన్నింటినీ హోం స్క్రీన్ మీద చిన్న ఐకాన్లుగా మార్చేస్తుంది. వీటి మీద ట్యాప్ చేసినప్పుడు అది పైకి తేలి వచ్చి ఓపెన్ అవుతుంది. అందులో ఏముందో చూసుకోవటానికి వీలుంటుంది. ఇలా విడ్జెట్లను మరింత సౌకర్యంగా, వేగంగా వాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు- యాప్‌ను పూర్తిగా లాంచ్ చేయకుండానే తాజా ట్వీట్లను చూసుకోవచ్చు. దీంతో బ్యాటరీ సేవ్ అవుతుంది కూడా.
నోట్‌పిన్
దీని పనితీరును చూస్తే ఇంకా ఇది ఆండ్రాయిడ్‌లో ఎందుకు భాగం కాలేదోనని అనిపించటం ఖాయం. ఇది నోట్స్‌ను సృష్టించుకోవటానికే కాదు, వాటిని నోటిఫికేషన్స్ ప్యానల్‌కు పిన్ చేసుకోవటానికీ వీలు కల్పిస్తుంది. ఒకసారి పిన్ చేయగానే వాటిని తొలగించేంతవరకు నోటిఫికేషన్ ప్యానల్‌లోనే కనిపిస్తాయి. ఇలా ఇవి రిమైండర్లుగానూ ఉపయోగపడతాయన్నమాట. ఫోన్‌ను అన్‌లాక్ చేసిన ప్రతిసారీ ఆయా విషయాలను గుర్తుచేస్తాయి. నోట్‌పిన్‌ను ఉపయోగించుకోవటం తేలిక. ప్రాధాన్యాలను బట్టి నోట్స్‌ను వర్గీకరించుకోవచ్చు. ఇటీవల ముందుగా యాడ్ చేసినవీ, తర్వాత యాడ్ చేసినవి వేర్వేరుగా కనిపిస్తాయి. ఇవన్నీ వివిధ రంగుల్లోనూ దర్శనమిస్తాయి.
మాక్రోడ్రాయిడ్
ఇది ఆయా పనులను మనం నిర్ణయించుకున్నట్టుగా ఆటోమేటిక్‌గా చేసి పెట్టే యాప్. ఇందులో ట్రిగ్గర్, యాక్షన్, కాన్‌స్ట్రెయింట్స్ అని మూడు భాగాలుంటాయి. ట్రిగ్గర్ ద్వారా మనకు అవసరమైన పనులను జోడించుకోవాలి. అది ఎలా పనిచేయాలో యాక్షన్‌లో నిర్ణయించుకోవాలి. ఇక కాన్‌స్ట్రెయింట్స్‌లో అది ఎప్పుడెలా జరగాలో ఎంచుకోవాలి. దీంతో అవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఉదాహరణకు- క్రోమ్ యాప్‌ను ట్రిగ్గర్‌లో జోడించారనుకోండి. క్రోమ్‌ను ఓపెన్ చేసినప్పుడు హోంపేజీగా గూగుల్ ఓపెన్ కావాలని ఎంచుకున్నారు. పోన్ వైఫైతో కనెక్ట్ అయినప్పుడే క్రోమ్ ఓపెన్ కావాలని కాన్‌స్ట్రెయింట్స్‌లో నిర్ణయించుకున్నారు. అప్పుడు క్రోమ్‌ను తెరచిన ప్రతీసారీ గూగుల్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ వైఫై ఆఫ్ చేసి, మొబైల్ డేటాను ఆన్ చేశారనుకోండి. అప్పుడు హోంపేజీగా గూగుల్ ఓపెన్ కాదు. రాత్రిపూట ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచటం, కారులో ఉన్నప్పుడు టెక్స్ట్ మెసేజ్‌లను పైకి చదివి వినిపించటం.. ఇలాంటి రకరకాల పనులను దీనికి అప్పజెప్పొచ్చు.
యూనివర్సల్ కాపీ
ఆండ్రాయిడ్ ఫోన్లలో కాపీ, పేస్ట్ చేయటం మామూలే. కాకపోతే కొన్ని యాప్స్ దీన్ని సపోర్టు చేయవు. కొన్ని వెబ్‌సైట్లు కాపీ చేసుకోవటానికి అనుమతించవు. ఇక్కడే యూనివర్సల్ కాపీ ఉపయోగపడుతుంది. దీంతో ఎలాంటి యాప్ నుంచైనా దేన్నయినా కాపీ చేసుకోవచ్చు. ఇమేజ్ నుంచీ టెక్స్ట్‌ను కాపీ చేసుకోవచ్చు. ఇది పరికరంతో ఇట్టే కలిసిపోయి పనిచేస్తుంది. అవసరమైన పర్మిషన్లు ఇస్తే చాలు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక నోటిఫికేషన్ బార్‌లోని లింక్ సాయంతో ఓపెన్ చేసుకోవాలి. టెక్స్ట్ మీద వేలితో కాసేపు అలాగే నొక్కి ఉంచితే కాపీ అవుతుంది. ఇమేజ్‌లోని టెక్స్ట్‌ను కాపీ చేయాలనుకుంటే స్కానింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి మరి.