తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఆపదలో తోడుగా ఉండే సరికొత్త 'యాప్స్'​.. వాటి గురించి మీకు తెలుసా? - పోలీసులకు తోడుగా ఉండే యాప్ న్యూస్

జీవితంలో ఆపదలు వచ్చినప్పుడు ఎవరైనా తోడుంటే బాగుంటుందనిపిస్తుంది. అయితే సరిగ్గా అలాంటి సమయంలోనే కొన్ని యాప్స్ సహాయపడతాయి. ఇవి మన సామాజిక అవసరాలను తీర్చే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా?..

these apps helps you in day to day life
ఆపదలలో అండగా నిలిచే యాప్స్

By

Published : Jan 11, 2023, 10:32 AM IST

Updated : Jan 11, 2023, 10:54 AM IST

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో తెలియదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఎవరో ఒకరు తోడుంటే ఎంత బాగుంటుందో అనీ అనిపిస్తుంటుంది. అవసరానికి ఆదుకొని, ఆపద నుంచి బయటపడేసే వారుంటే ఆ భరోసాయే వేరు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పురుడు పోసుకుంటున్న కొన్ని యాప్‌లు అలాంటి నమ్మకాన్నే కల్పిస్తున్నాయి. నిజానికి సామాజిక అనుసంధానం, వస్తువుల కొనుగోలు, ఫిట్‌నెస్‌ వంటి వాటికోసం చాలాకాలంగా యాప్‌లను వాడుకుంటూనే ఉన్నాం. ఇవి సామాజిక అవసరాలు తీర్చే విధంగానూ రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటివాటిల్లో కొన్ని ఇవీ..

గర్భిణులకు ఆండగా..
గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు అందించటానికి, అనుక్షణం వెన్నుదన్నుగా నిలవటానికి ఐఐటీ రూర్కీ, దిల్లీలోని ఎయిమ్స్‌ పరిశోధకులు స్వస్థగర్భ యాప్‌ను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి భారత్‌ మిషన్‌లో భాగంగా దీన్ని రూపొందించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో గర్భిణులకు సంబంధించిన యాప్‌లు చాలానే ఉన్నప్పటికీ స్వస్థగర్భ ప్రత్యేకతే వేరు. ఎప్పుడు అవసరమైనా డాక్టర్‌ను సంప్రదించటానికిది వీలు కల్పిస్తుంది మరి.

గర్భిణులకు ఆండగా యాప్ న్యూస్

ఇది గర్భిణులకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునే వేదిక మాత్రమే కాదు.. ఆసుపత్రికి వెళ్లాల్సిన సమయాన్నీ గుర్తుచేస్తుంది. ఎప్పుడెప్పుడు ఏయే పరీక్షలు చేయించుకోవాలో కూడా సూచిస్తుంది. చికిత్స సదుపాయాలు అంతగా అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల వారికిది బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లతో గర్భిణులు సంప్రదించేందుకు తోడ్పడుతూ ప్రత్యక్షంగా సాయం చేస్తుంది. దీన్ని డాక్టర్లు, గర్భిణులు కూడా బాగా ఆమోదిస్తున్నట్టు ప్రాథమిక ప్రయోగంలో వెల్లడైంది.

అంధులకు చూపుగా..
అంధులు, కళ్లు సరిగా కనిపించనివారు రోజువారీ పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకు వంట వండేటప్పుడు టమోటాలు పండాయో, కాయగానే ఉన్నాయో తెలుసుకోవటం కష్టమవుతుంది. బ్రెడ్డు ప్యాకెట్‌ మీద ఎక్స్‌పైరీ తేదీ, దుస్తుల రంగు సరిపోవటం వంటివి కనుక్కోవటం అంత తేలిక కాదు. ఇలాంటి సమయాల్లోనే తోడుగా నిలుస్తోంది బీ మై ఐస్‌. పేరుకు తగ్గట్టుగానే ఇది అంధులకు, సరిగా కళ్లు కనిపించవారికి 'చూపు'గా నిలవటానికి తోడ్పడే యాప్‌.

అంధులకు చూపుగా నిలిచే యాప్

ఎక్కడి నుంచైనా సరే.. అవసరమైన సమయాల్లో ప్రత్యక్ష వీడియో ద్వారా వారికి దన్నుగా నిలవొచ్చు. లక్షలాది మంది స్వచ్ఛందంగా ఇందులో సైన్‌ ఇన్‌ అయ్యి, కళ్లు కనిపించనివారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 180 భాషల్లో ఎవరినైనా సాయం చేయమని అడగొచ్చు. అంధులు ఒక్క వీడియో కాల్‌తో అటువైపు ఉన్నవారి నుంచి సాయం పొందొచ్చు. ఫోన్‌ కెమెరాతో చుట్టుపక్కల పరిసరాలను అవతలివారికి కనిపించేలా చేయటం ద్వారా ఎక్కడ ఏయే వస్తువులు ఉన్నాయో, అవేంటో అవతలివారికి ఇట్టే అర్థమవుతాయి.

రైతులకు దన్నుగా..
మనది ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. శ్రామికుల్లో సుమారు 50% మంది కర్షకులే. ఆరుగాలం కష్టపడినా రైతులకు ఫలితం దక్కేది అంతంతే. క్రిములు, కీటకాలు, ఇతర చీడపీడలు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి. దీంతో ఎంతోమంది రైతులు పంటలను కోల్పోతున్నారు. ఇలాంటి దుస్థితి నుంచి కాపాడటానికి హైదరాబాద్‌, బెర్లిన్‌కు చెంది అంకుర సంస్థ ప్లాంటిక్స్‌ అనే యాప్‌ను రూపొందించింది.

రైతులకు దన్నుగా యాప్

ఇది కృత్రిమ మేధ సాయంతో పంటలకు ఏయే సమయాల్లో ఎలాంటి పోషకాలు అందించాలో, పంటలు ఎంత ఏపుగా పెరుగుతున్నాయో తెలియజేస్తుంది. రైతులు ఆయా పంటలను ఫొటో తీసి, అప్‌లోడ్‌ చేస్తే చాలు. దాన్ని నిశితంగా పరిశీలించి, ఎలాంటి చీడ పీడలు సోకాయో యాప్‌ గుర్తిస్తుంది. వాటికి పరిష్కార మార్గాలనూ సూచిస్తుంది. అంతేకాదు.. ఆయా ప్రాంతాల్లో సోకుతున్న చీడ పీడల గురించీ రైతులను అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే దీన్ని కోటి మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రోజుకు 70వేల మంది చురుకుగా వాడుకుంటున్నారు.

ఆకలిని తీర్చగా..
ఆకలి పెద్ద సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని అంచనా. మనదేశంలోనూ సుమారు 19 కోట్ల మంది పోషణలోపంతో బాధపడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించటానికే ఐక్యరాజ్యసమితి షేర్‌దమీల్‌ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు ఆహారాన్ని అందించే అవకాశం కలుగుతుంది. ఒక్క ఫోన్‌ ట్యాప్‌తోనే దీన్ని సాధించొచ్చు. ఈ యాప్‌ను వాడేవారు డిజిటల్‌ రూపంలో డబ్బును చెల్లించొచ్చు. ఆ డబ్బుతో ఎక్కడ, ఎవరికి ఆహారం అందించారో కూడా తెలుసుకోవచ్చు.

ఆకలిని తీర్చేందుకు యాప్

రక్తదాన సంధాయినిగా..
అవసరమైనప్పుడు ఆసుపత్రుల్లో రక్తం అందుబాటులో లేకపోవటం పెద్ద సమస్య. ప్రపంచంలో చాలా దేశాలు దీంతో సతమతమవుతున్నాయి. అత్యవసర సమయాల్లో రక్తం దొరికితే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి. అందుకే ఫ్రెండ్స్‌టుసపోర్ట్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఇది మనదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, యెమెన్‌ దేశాల్లోనూ సేవలు అందిస్తోంది. ఫ్రెండ్స్‌టుసపోర్ట్‌.ఆర్గ్‌ యాప్‌ను 10 లక్షలకు పైగా మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

రక్తదాన సంధాయినిగా పనిచేసే యాప్

ఇందులో యూజర్లు రక్తదాతగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్లు రక్తదానం చేయటమే కాదు.. ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛంద రక్తదాతలనూ వెతికి పెట్టొచ్చు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులను ఆహ్వానించి, రక్తదానం చేసేలా కూడా ప్రోత్సహించొచ్చు. రక్తాన్ని ఇచ్చే సమయంలో రక్తదానానికి ముందు, తర్వాత ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా యాప్‌ వివరిస్తుంది.

పోలీసులకు తోడుగా..
సిటిజెన్‌కాప్‌. ఇదో దేశీయ యాప్‌. ఇన్ఫోక్రాఫ్ట్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ దీన్ని తయారుచేసింది. పేరును బట్టి ఇది పౌర పోలీసులనే భావన కలిగించినా దీని ఉద్దేశం వేరు. లొకేషన్‌ ఆధారంగా పనిచేసే ఇది నేరాల గురించి తెలియజేయటానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా దీన్ని మహిళలకు సాయం చేయటానికి రూపొందించారు. ఇబ్బందులు లేకుండా నేరాలను రిపోర్టు చేయటం వల్ల పోలీసుల పనీ తేలికవుతుంది. సిటిజెన్‌కాప్‌ను ముందుగా ఇండోర్‌లో ఆరంభించారు.

పోలీసులకు తోడుగా ఉండే యాప్

క్రమంగా భోపాల్‌, జబల్‌పుర్‌, ఉజ్జయిని, రాయ్‌పుర్‌, బెంగళూరు, నోయిడా, వారణాసి వంటి పట్టణాలకు విస్తరించారు. గూగుల్‌ప్లే నుంచి దీన్ని 5 లక్షలకు పైగా మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే దీన్ని వాడుకోవటంలో, సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా చాలా అనుమతులనూ కోరుతుంది. నేరాలతో ముడిపడినది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి. ఏదేమైనా నేరాలను తక్షణం రిపోర్టు చేయటానికిది ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

నడకే సేవగా..
ఫిట్‌నెస్‌ను కాపాడుకోవటానికి నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం వంటివి చేస్తూనే ఉంటాం. వీటితోనే సమాజ సేవ చేయగలిగితే? ఛారిటీ మైల్స్‌ యాప్‌ అలాంటి అవకాశమే కల్పిస్తుంది. ఆయా సేవల కోసం డబ్బును సంపాదించటానికి తోడ్పడుతుంది. మనం నడిచిన లేదా పరుగెత్తిన ప్రతిసారీ 25 సెంట్లు ఆర్జించొచ్చు. సైకిల్‌ తొక్కితే 10 సెంట్లు లభిస్తాయి. చేయాల్సిందల్లా ఆ డబ్బును ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకోవటం. వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫౌండేషన్‌, అల్జీమర్స్‌ అసోసియేషన్‌, వూండెడ్‌ వారియర్‌ ప్రాజెక్ట్‌, స్టాండప్‌ టు క్యాన్సర్‌ వంటి ఎన్నో సంస్థలకు దాన్ని అందేలా చేయొచ్చు.

నడకే సేవగా నిలిచే యాప్
Last Updated : Jan 11, 2023, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details