తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఇన్‌స్పైర్‌శాట్‌-1 రూపకర్తల్లో ఇద్దరు మన విద్యార్థులే - విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌

Inspireshot-1 : ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహ రూపకల్పనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ చాటారు. తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ టెక్నాలజీలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న.. ధ్రువ అనంత దత్తా, అమన్‌ నవీన్‌.... మరో నలుగురితో కలిసి శ్రీహరికోటలో ఈనెల 6, 7, 8 తేదీల్లో రాకెట్‌పైకి వెళ్లి ఉపగ్రహాన్ని అమర్చారు.

Inspireshot-1, ISRO
ఇన్‌స్పైర్‌శాట్‌-1 రూపకర్తల్లో ఇద్దరు మన విద్యార్థులే

By

Published : Feb 15, 2022, 9:51 AM IST

Inspireshot-1 : ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహం రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ఆరుగురు విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ధ్రువ అనంత దత్తా, అమన్‌ నవీన్‌ ఉన్నారు. తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో వీరు బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. సహచర విద్యార్థులతో కలిసి శ్రీహరికోటలో ఈనెల 6, 7, 8 తేదీల్లో రాకెట్‌పై వారు ఉపగ్రహాన్ని అమర్చారు. అనంత దత్తా విజయవాడవాసి. ఆయన తండ్రి డి.ఎస్‌.చక్రవర్తి.. ప్రశాంత్‌ ఆసుపత్రి సీఈవో. తల్లి విద్య మంగళగిరి ఎయిమ్స్‌లో వైద్యురాలు. అనంతదత్తా విజయవాడ ఎన్‌ఎస్‌ఎం పాఠశాలలో పదో తరగతి, నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదివారు. తిరువనంతపురంలోని ఐఐఎస్‌టీలో 2019లో బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ అండ్‌ రాకెట్‌ డిజైన్‌-ఏవియానిక్స్‌లో చేరారు. అంతరిక్ష శాస్త్రవేత్తను కావాలనేదే తన ఆశయమని వివరించారు.

*సికింద్రాబాద్‌కు చెందిన నవీన్‌.. బోయినపల్లిలోని పల్లవి మోడల్‌ స్కూలు, సెయింట్‌ అండ్రూస్‌ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదివారు. తండ్రి నవీన్‌ జయరాజ్‌ సంగీత ఉపాధ్యాయుడు. తల్లి నీలిమ విశ్రాంత ఆచార్యులు. ఐఐఎస్‌టీలోనే ముఖ్యమైన ప్రాజెక్టులు చేశారు. ఉపగ్రహం విజయవంతం కావడంలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని నవీన్‌ పేర్కొన్నారు.

అనంత్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యం

VSSC: పీఎస్‌ఎల్‌వీ- సి52 రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన అనంత్‌ టెక్నాలజీస్‌ క్రియాశీల పాత్ర పోషించింది. ఇస్రోకు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ)తో ఈ సంస్థకున్న ఒప్పందం ప్రకారం పీఎస్‌ఎల్‌వీ-సి52 వేర్వేరు దశలను సమీకృతం (ఇంటిగ్రేషన్‌) చేయడంతోపాటు టెస్టింగ్‌, క్వాలిఫయింగ్‌ బాధ్యతలను నిర్వర్తించింది. ‘ఆన్‌-బోర్డ్‌ కంప్యూటింగ్‌, నావిగేషన్‌, పవర్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్‌, ట్రాన్స్‌మిషన్‌, ఎలక్ట్రికల్‌ హార్నెస్టింగ్‌, సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌, టెస్టింగ్‌ వ్యవహారాల్లో మేం పాలుపంచుకున్నాం’ అని అనంత్‌ టెక్నాలజీస్‌ సీఎండీ డాక్టర్‌ సుబ్బారావు పావులూరి వివరించారు. తిరువనంతపురంలోని తమ యూనిట్‌నుంచి కంట్రోల్‌ ఎలక్ట్రానిక్స్‌, టెలిమెట్రీ, పవర్‌ సిస్టమ్స్‌ అందించినట్లు తెలిపారు. మూడు దశాబ్దాలుగా తాము ఇస్రోతో కలిసి ముందుకు సాగుతున్నామని.. ఇన్నేళ్లలో ఒక్క పొరపాటుకు కూడా తావు లేని విధంగా (జీరో-డిఫెక్ట్‌), సబ్‌సిస్టమ్స్‌ను అనంత్‌ టెక్నాలజీస్‌ అందించిందని తెలిపారు. ఇస్రో నిర్వహించిన దాదాపు 69 లాంచ్‌ వెహికల్స్‌, 89 స్పేస్‌క్రాఫ్ట్‌లలో భాగస్వామిగా ఉన్నామని వెల్లడించారు. ఐరోపా దేశాలు, అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక ఏరోస్పేస్‌, స్పేస్‌ కంపెనీలతో తాము కలిసి పనిచేస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి :Regulation of public places: ఆక్రమణల్లోని ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ.. ఇదే లాస్ట్​ ఛాన్స్​

ABOUT THE AUTHOR

...view details