అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన పోటీలో తెలుగు యువకులు సత్తా చాటారు. నగదు బహుమతితో పాటు రెండేళ్ల పాటు నాసాలో పనిచేసే అవకాశాన్ని సాధించారు. చంద్రునిపై ఉన్న మంచును నీరుగా మార్చే ప్రాజెక్టు రూపకల్పనకు పోటీలను నాసా ‘బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్’ పేరున నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల నుంచి 374 బృందాలు పోటీకి పేర్లు నమోదు చేసుకున్నాయి. ‘టీం ఏఏ-స్టార్’ పేరిట తెలుగు యువకులు ప్రణవ్ ప్రసాద్, అమరేశ్వర ప్రసాద్, సాయి ఆశిష్ కుమార్‌ల బృందం పాల్గొంది. నాసా ఎంపిక చేసిన పది బృందాల్లో వీరికీ చోటు దక్కింది. దాంతో పాటు రూ.25 వేల డాలర్ల బహుమతి గెలుచుకుంది. ఈ విషయాన్ని నాసా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
ముగ్గురూ కలిసి..
టీం ఏఏ-స్టార్ పేరిట ఏర్పడ్డ ఈ బృందానికి అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ప్రణవ్ ప్రసాద్ సారథ్యం వహించారు. తెనాలి నుంచి చుండూరు అమరేశ్వర ప్రసాద్, విశాఖ నుంచి కరణం సాయి ఆశిష్ కుమార్ భాగస్వాములయ్యారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ ముగ్గురు స్టార్టప్‌ల ఏర్పాటు, ఉన్నత చదువుల్లో నిమగ్నమయ్యారు. గతంలోనూ సాయి ఆశిష్, అమరేశ్వర ప్రసాద్‌లు మరో సాంకేతిక నిపుణుడితో కలిసి నాసా నిర్వహించిన ‘లూనార్ ఛాలెంజ్’లో పాల్గొన్నారు. అందులో మూడో స్థానంలో నిలిచి 2 వేల డాలర్ల బహుమతిని సొంతం చేసుకున్నారు.