తెలంగాణ

telangana

By

Published : Jan 13, 2021, 1:25 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

ETV Bharat / science-and-technology

వాట్సాప్ వద్దనుకుంటే.. ఈ యాప్​లు ట్రై చేయండి!

వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల దెబ్బకు చాలా మంది.. ప్రత్యామ్నాయ యాప్​లపై దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం మంచి ఫీచర్లతో పాటు వ్యక్తిగత గోప్యతకూ భంగం లేకుండా మెసేజింగ్ సేవలందించే యాప్​ల కోసం వెతుకుతున్నారు. మీరూ ఆ జాబితాలో ఉంటే.. వాట్సాప్​కు ప్రత్యామ్నాయ యాప్​లు ఏవి? వాటి ఫీచర్లు ఏమిటి? అనేది తెలుసుకోండి ఇప్పుడే.

best chatting apps to use instead of WhatsApp
వాట్సాప్​కు పోటీగా ఉన్న ఛాటింగ్ యాప్​లు

యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇటీవల తెచ్చిన నూతన నిబంధనలతో ఇరకాటంలో పడింది. కొత్త నిబంధనలను అంగీకరించకుంటే ఫిబ్రవరి 8 తర్వాత వాట్సాప్ వాడేందుకు వీలుండదని పెట్టిన షరత్తుపై ఇంటర్నెట్​లో ఆ యాప్​పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాట్సాప్ నూతన పాలసీని అంగీకరిస్తే వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో చాలా మంది వాట్సాప్​ను కాదని ప్రత్యామ్నాయ యాప్​లవైపు చూస్తున్నారు. మరి అలాంటి వారికి అందుబాటులో ఉన్న ఉత్తమ యాప్​లు ఏవి? వాటి ఫీచర్లు ఇతర వివరాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం.

సిగ్నల్

వాట్సాప్‌కు బదులుగా ఇటీవల ఎక్కువ వినిపిస్తున్న పేరు సిగ్నల్‌. వాట్సాప్‌ తరహాలోనే ఇది కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటోకాల్‌తో పనిచేస్తుంది. కొద్ది రోజుల ముందు వరకు ఈ యాప్‌ను ఎక్కువగా జర్నలిస్టులు, విద్యావేత్తలు, పరిశోధకులు మాత్రమే ఉపయోగించేవారు. ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ తర్వాత ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు పెరిగిపోయాయి. ఒకానొక దశలో యూజర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఓటీపీలు పంపలేక సిగ్నల్‌ టీమ్‌ చేతులెత్తేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఓపెన్ సోర్స్‌ ప్రొటోకాల్ కావడం వల్ల భద్రత, గోప్యతపై పలువురు సందేహాలు లేవనెత్తారు. వాట్సాప్‌ తరహాలోనే ఇందులో కూడా డిస్‌అప్పియరింగ్ మెసేజెస్‌, స్క్రీన్‌ లాక్‌, గ్రూప్‌ ఛాట్ సెక్యూరిటీ, వీడియో/ఆడియో కాల్ ఫీచర్స్‌ ఉన్నాయి. అన్ని రకాల డివైజ్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. సిగ్నల్‌ యూజర్‌ ఫోన్ నంబర్‌ మినహా ఇతర వివరాలను సేకరించదు.

సిగ్నల్

టెలిగ్రామ్​

సిగ్నల్, వాట్సాప్‌ మాదిరి టెలిగ్రామ్ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ కాదు. కానీ ఇందులో సీక్రెట్ ఛాట్ ఫీచర్‌ ద్వారా మనకు కావాల్సిన వ్యక్తులతో సురక్షితంగా సంభాషించవచ్చు. అంతేకాదు టైం లిమిట్‌తో సందేశాలను పంపుకోవచ్చు. అవతలి వ్యక్తి వాటిని చూసిన వెంటనే మీరు పెట్టిన టైం లిమిట్‌ లోపల అవి డిలీట్ అయిపోతాయి. ఇందులో మెసేజ్‌ ఛాట్‌తో పాటు ఆడియో/వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. 1.5జీబీ సామర్థ్యం కలిగిన ఫైల్స్‌ని పంపుకోవచ్చు. ఒక గ్రూపులో‌ సుమారు 2 లక్షల మందిని యాడ్ చెయ్యొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, విండోస్‌, విండోస్‌ ఎన్‌టీ, మాక్‌ఓఎస్‌, లైనెక్స్‌ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. టెలిగ్రామ్​ యూజర్‌ ఫోన్‌ నంబర్‌, కాంటాక్ట్స్‌, యూజర్ ఐడీ వివరాలను ప్రైవసీ నిబంధనలకు లోబడి సేకరిస్తుంది.

టెలిగ్రామ్

వైబర్‌

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న మరో యాప్‌ వైబర్‌. ఇది ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ని సపోర్ట్ చేస్తుంది. అన్ని రకాల మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో/వీడియో కాల్స్‌, గ్రూప్‌ ఛాట్స్‌ ఎన్‌క్రిప్ట్‌ చేయబడతాయి. మన ఛాటింగ్‌ను గూగుల్ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకుని కావాల్సినప్పుడు వాటిని తిరిగి రీస్టోర్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, విండోస్‌ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. ఒక గ్రూప్‌లో 250 మందిని సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఇందులో కూడా టెలిగ్రామ్ తరహాలోనే సీక్రెట్ ఛాట్‌ ఫీచర్ ఉంది. అయితే ఈ యాప్‌ కూడా యూజర్‌ నుంచి లొకేషన్‌, డివైజ్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌, యూజర్‌ ఐడీ, ఈ-మెయిల్ ఐడీ, పేరు, కాంటాక్ట్స్‌ వంటి వివరాలను సేకరిస్తుంది.

వైబర్‌

ఎలిమెంట్స్‌

చైనా యాప్‌లపై నిషేధం తర్వాత పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌ ఎలిమెంట్స్‌. ఈ యాప్‌ ద్వారా యూజర్స్‌ ఉచితంగా ఆడియో/వీడియో కాల్స్‌, వ్యక్తిగత/గ్రూప్‌ ఛాట్స్‌ చేసుకోవచ్చు. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ని సపోర్ట్‌ చేస్తుంది. సుమారు ఎనిమిది భారతీయ భాషల్లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

ఎలిమెంట్స్‌

థ్రీమా

స్విట్జర్లాండ్‌కు చెందిన థ్రీమా యాప్‌ కూడా వాట్సాప్‌లానే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మెసేజ్‌లు, గ్రూప్‌ ఛాట్స్‌, ఫైల్స్‌, స్టేటస్‌ మెసేజ్‌లు, ఆడియో/వీడియో కాల్స్‌ని సపోర్ట్ చేస్తుంది. యూజర్‌ నుంచి ఈ యాప్‌ ఎలాంటి డేటా సేకరించదు. అలానే యూజర్స్‌ పంపే సందేశాలు అవతలి వ్యక్తులకు డెలివరీ అయిన వెంటనే డిలీట్ అయిపోతాయి. అయితే ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 2.99 డాలర్లు చెల్లించాలి. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్ ‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

థ్రీమా

కిక్‌

ఈ యాప్‌లో ఉపయోగించాలంటే ఫోన్‌ నంబర్‌తో పనిలేదు. కేవలం మెయిల్ ఐడీతో రిజిష్టర్‌ చేసుకోవచ్చు. ఛాటింగ్‌లను ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ యాప్‌ని ఒకే యూజర్‌ ఐడీతో వేరే డివైజ్‌లో ఉపయోగిస్తే ఛాట్ డేటా మొత్తం డిలీట్ అవుతుంది. ఫొటోలు, వీడియోలు, గిఫ్‌లు, గేమ్స్‌ను ఈ యాప్‌ ద్వారా స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు.

కిక్​

వైర్‌

ఈ యాప్‌ని స్కైప్‌ సహ వ్యవస్థాపకుడు జానస్‌ ఫ్రిస్‌ రూపొందించాడు. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఫైల్స్‌, డాక్యుమెంట్స్‌, వెబ్‌ లింక్‌ షేరింతో పాటు ఆడియో/వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. వ్యాపారపరంగా ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహించే వారికి ఈ యాప్‌ ఎంతో ఉపయోగకరం.

వైర్

ఇవీ చూడండి:

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details