విద్యకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ 34 డైరెక్ట్ టూ హోం(DTH) ఛానెళ్లను స్వయంప్రభ ఛానెల్(Swayam Prabha Chanel) ద్వారా అందుబాటులోకి తెచ్చింది. అందులో ఐఐటీ పాల్‌కు నాలుగు ఛానళ్లు కేటాయించారు. జేఈఈకి సంబంధించి మూడు, నీట్‌కు సంబంధించి ఒక దాన్ని తీసుకొచ్చారు. ఎయిర్‌టెల్, టాటా స్కై, జియో డిష్ వినియోగదారులు కూడా వాటిని ఉచితంగా పొందొచ్చు. సెటాప్ బాక్స్ ఉండాలి. ప్రతిరోజూ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి నాలుగు గంటల నుంచి ఆరు గంటలపాటు పాఠాలు ప్రసారం అవుతాయి. మళ్లీ వాటినే రోజంతా ప్రసారం చేస్తారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్వయంప్రభ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని కూడా పాఠాలు వినొచ్చు. యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. వచ్చే అయిదేళ్లలో విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ సంస్థలపై ఆధారపడకుండా ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాయి.
- ఛానెల్ 19: ఐఐటీ పాల్: జీవశాస్త్రం
- ఐఐటీ 20: ఐఐటీ పాల్: రసాయనశాస్త్రం
- ఐఐటీ 21: ఐఐటీ పాల్: గణితం
- ఛానెల్ 22: ఐఐటీ పాల్: భౌతికశాస్త్రం
దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలకు మొత్తం 12-13 లక్షల మంది, నీట్‌కు మరో 15 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఆయా ప్రవేశాల పరీక్షల శిక్షణ భారీ ఖర్చుతో కూడుకున్నందున పేద విద్యార్థులు వెనకబడకుండా ఉండాలన్నది కేంద్ర విద్యాశాఖ ఆలోచన. ఈ క్రమంలోనే 11, 12వ తరగతి లేదా ఇంటర్ విద్యార్థులకు మేలు చేసేలా ఐఐటీ ప్రొఫెసర్ అసిస్టెడ్ లెర్నింగ్(IIT PAL) పేరిట గణిత, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలపై వివిధ ఐఐటీల ఆచార్యులతో వీడియో పాఠాలను రూపొందించాలని మూడేళ్ల క్రితం ఐఐటీలు నిర్ణయించాయి. ‘ఐఐటీ పాల్’ పాఠాల రూపకల్పన బాధ్యతను ఐఐటీ దిల్లీ తీసుకుంది. ఇతర ఐఐటీలైన మద్రాస్, ఖరగ్‌పూర్, బొంబాయి, గువాహటి, రూర్కీ, కాన్పూర్ ఐఐటీల ఆచార్యులతోపాటు కేంద్రీయ విద్యాలయాల ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటోంది. ఇప్పటివరకు నాలుగు సబ్జెక్టులకు సంబంధించి 200 పాఠాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు.