Surgeries with Robotics : కాలానుగుణంగా వైద్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా సులభతరం చేస్తున్నాయి. దీనికి ఉదాహరణే రోబోటిక్ పరిజ్ఞానం. 40 ఏళ్ల కిందట పెద్ద కోతలతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేది. 25 ఏళ్ల కిందట ల్యాప్రోస్కోపిక్ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. గత పదేళ్లుగా రాష్ట్రంలో రోబోటిక్ పరికరాలతోనూ ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ రెండు మూడేళ్ల కిందటి వరకు నెలకు ఒకటో రెండో రోబోటిక్ శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రస్తుతం నెలకు కనీసం 500 వరకు జరుగుతున్నాయి.
ఈ చికిత్సల్లో ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులు పోటీపడుతున్నాయి. ఇప్పుడు 75 శాతం క్యాన్సర్ శస్త్రచికిత్సలను రోబోటిక్ విధానంలోనే చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని 50 మందికి పైగా వైద్యనిపుణులు రోబోటిక్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వైద్యులు కూడా ఇక్కడికి శిక్షణ కోసం వస్తుండటం విశేషం. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రాకున్నా.. త్వరలోనే నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రులకు ఆయా పరికరాలను కొనుగోలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి.
ఎన్నో ప్రయోజనాలు..
- రోబోటిక్ విధానంలో రోబోలకు 5, 8 మి.మీ. పొడవైన సర్జికల్ పరికరాలు అమర్చి ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ.. వైద్యులు ఆపరేషన్ చేస్తారు.
- రోబో కెమెరాలో ‘త్రీ డైమన్షన్ (త్రీడీ)’ విజన్ ద్వారా శరీరంలోని అతి చిన్న కణాలను కూడా పెద్దగా, స్పష్టంగా చూడవచ్చు. రోబో చేతులు అతి తక్కువ కోతతో శరీరంలోకి ప్రవేశిస్తాయి.
- రోబోలో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాల ద్వారా ఏ అవయవంలో కణజాలానికి ఎంత మేర కోత పెట్టాలో కచ్చితంగా తెలుసుకుని అనుసరించవచ్చు. అదనంగా పక్కనున్న ఒక రక్తనాళానికి, కణజాలానికి కూడా కోత పడే పరిస్థితి ఉండదు.
- ఉదాహరణకు సాధారణ పద్ధతుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఆపరేషన్‌కు 12-15 అంగుళాల మేర కోత పెట్టాల్సి ఉంటుంది. రోబో ద్వారా నాలుగు రంధ్రాలు, 8 మి.మీ. కోత పెడితే సరిపోతుంది. ఈ గాయం త్వరగా మానిపోతుంది.
- వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నంత సేపు నిలబడాల్సిన అవసరం ఉండదు.
- రోబో ద్వారా ఆపరేషన్లకు సుమారు రూ.2 లక్షల అదనపు వ్యయమైనా, ఆసుపత్రిలో ఉండాల్సిన రోజులు, ఆ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
- కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్‌లు వాడడం వల్ల కొందరికి 40 ఏళ్లు దాటకపోయినా తుంటి కీలులో రక్తప్రసరణ తగ్గిపోయింది. దీన్ని వైద్య పరిభాషలో ‘అవాస్క్యులర్ నెక్రోసిస్’ అంటారు. దీనికి తుంటి కీలును మార్చాల్సి వస్తుంది. రోబోటిక్ చికిత్స ద్వారా తుంటి, బంతి గిన్నెలను సమర్థంగా అమర్చడం సాధ్యమవుతోంది.
- యూరాలజీ చికిత్సల్లో రోబో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. పెద్ద కోత ఉండదు కనుక ఇన్‌ఫెక్షన్ అవకాశాలు, రక్తస్రావం, రక్తం గడ్డ కట్టే ప్రమాదం, మందుల వాడకం అన్నీ తగ్గుతాయి. రోగి త్వరగా కోలుకుంటారు.