తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

నేతలపై ఉన్న కేసుల ఎత్తివేతపై హైకోర్టుల సమీక్ష!

హైకోర్టుల అనుమతితోనే ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుల విచారణ జరుపుతున్న జడ్జిలను బదిలీ చేయకూడదని ఆదేశించింది. రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఉపసంహరించుకున్న క్రిమినల్‌ కేసులను హైకోర్టులు సమీక్షించాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

Supreme Court
సుప్రీంకోర్టు

By

Published : Aug 11, 2021, 5:00 AM IST

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కేసులను హైకోర్టుల అనుమతి లేకుండా ఉపసంహరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టుల న్యాయాధికారులను సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు అదే స్థానంలో కొనసాగించాలని నిర్దేశించింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇవ్వాలని కోరుతూ భాజపా నాయకుడు అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.

ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ఆశించిన రీతిలో జరగడంలేదు. అందుకే ఈ అంశాన్ని రోజు వారీగా పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టులో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తున్నాం.

- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సొంత పార్టీ నేతలపై కేసుల ఎత్తివేత!

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణపై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, కోర్టు సహాయకుడు (అమికస్‌ క్యూరీ) విజయ్‌ హన్సారియా నివేదిక సమర్పించారు. ఆయన తొలుత వాదనలు వినిపిస్తూ "రాష్ట్ర ప్రభుత్వాలు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న తీవ్రమైన కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నాయి. ఇందుకు సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 321 కింద ఉన్న అధికారాలను ఉపయోగించుకుంటున్నాయి. ఈ నిబంధన కింద ప్రాసిక్యూటర్‌... కేసు తదుపరి విచారణను ఉపసంహరించుకుంటున్నట్టు ట్రయల్‌కోర్టు న్యాయాధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. న్యాయాధికారి ఇందుకు అంగీకరిస్తే నిందితులు ప్రాసిక్యూషన్‌ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఎలాంటి నిబంధనలు పాటించాలన్న విషయాన్ని స్టేట్‌ ఆఫ్‌ కేరళ వర్సెస్‌ అజిత్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. అయినా దాన్ని పాటించడం లేదు. అందువల్ల రాష్ట్ర హైకోర్టుల అనుమతి లేకుండా ఇలాంటి కేసులు ఉపసంహరించుకోవడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీచేయాలి" అని విజ్ఞప్తి చేశారు.

ఇవిగో ఉదాహరణలు..

కేసుల ఉపసంహరణపై విజయ్‌ హన్సారియా ఉదాహరణలు ఇచ్చారు. "ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి ప్రజా ప్రతినిధులపై 76 కేసులను ఎత్తివేసింది. ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న భాజపా ఎమ్మెల్యేలు సంగీత్‌ సోమ్‌, సురేష్‌ రాణా, కపిల్‌దేవ్‌, సాధ్వీ ప్రాచీలపై నమోదైన కేసులూ ఇందులో ఉన్నాయి.

  • కర్ణాటక ప్రభుత్వం 2020 ఆగస్టు 31న 61 కేసుల ఉపసంహరణకు ఆదేశాలు జారీ చేసింది. అందులో అత్యధికం ఎమ్మెల్యేలపై ఉన్నవే.
  • మహారాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబరు 31కి ముందు కొందరు కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను రద్దు చేసింది" అని వివరించారు.

జాప్యంపై సీబీఐకి ఉత్తర్వులు ఇవ్వండి

"ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణ పూర్తిచేయడానికి ఎంత కాలం పడుతుంది? ఇప్పటివరకు జరిగిన జాప్యానికి కారణాలేంటో చెప్పాలని పేర్కొంటూ సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీచేయా"లని హన్సారియా కోరారు. ఈ కేసుల పరిస్థితిపై నివేదిక సమర్పించేలా ఆదేశించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 2018లో 4,122 కేసులు పెండింగ్‌లో ఉండగా, 2020 నాటికి అవి 4,859కి పెరిగాయని చెప్పారు.

ఎత్తివేసిన కేసులపై హైకోర్టుల సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా కాకుండా, హైకోర్టుల అనుమతితోనే కేసులు ఎత్తివేసేలా చూడాలన్న అమికస్‌ క్యూరీ హన్సారియా చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఆయా రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఉపసంహరించుకున్న క్రిమినల్‌ కేసులను హైకోర్టులు సమీక్షించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. "సెక్షన్‌ 321 దుర్వినియోగమవుతుండడం ఇక్కడ ప్రధాన సమస్య. అందుకే ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసులను హైకోర్టుల అనుమతి లేకుండా ఉపసంహరించకూడదు. ఈ కేసులను విచారిస్తున్న న్యాయాధికారులను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకూ బదిలీ చేయకూడదు. న్యాయమూర్తుల పదవీ విరమణ, మరణంలాంటి సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు కావాలంటే హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరళ్లు సుప్రీంకోర్టుకు దరఖాస్తులు పంపించవచ్చు. ప్రస్తుతం కేసులను విచారణ జరుపుతున్న న్యాయాధికారుల జాబితాను సమర్పించాలి" అని ఆదేశించింది.

కేసుల తాజా పరిస్థితి నమోదుకు ఫార్మాట్‌

తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్‌ కేసుల వివరాలను రెండువారాల్లోపు సమర్పించాలని జస్టిస్‌ రమణ అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లను ఆదేశించారు. ఈ వివరాల నమోదుకు నిర్దిష్టమైన నమూనా(ఫార్మాట్‌)ను పంపించారు. దాని ప్రకారం.

  • న్యాయాధికారి పేరు..
  • ఎక్కడ, ఏ కోర్టులో పనిచేస్తున్నారు..
  • ప్రస్తుత స్థలంలో ఎప్పటి నుంచి ఉన్నారు..
  • ప్రస్తుతం ఉన్నచోట ఎన్ని కేసులు పరిష్కరించారు.
  • ఇంకా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అవి ఏ దశలో ఉన్నాయి..

రిజర్వు చేసిన తీర్పులేమిటి ఇలా వివరాలు నమోదు చేయాలని సూచించారు.

నివేదికలు ఇవ్వలేదంటే చెప్పడానికి ఏమీ లేదనే అర్థం

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ స్థితిగతులతో నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబరు 16, అక్టోబరు 6, నవంబరు 4న సీబీఐతోపాటు, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. అయితే ఇంతవరకూ నివేదికలు ఇవ్వకపోవడంపై జస్టిస్‌ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "2020లో మూడుసార్లు ఉత్తర్వులు జారీ చేసినా కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేయకపోవడం ఏమిటి?" అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రశ్నించారు. అందుకు ఆయన విచారం వ్యక్తం చేస్తూ సమన్వయ లోపం వల్ల ఇది జరిగిందని, తమకు చివరి అవకాశం ఇవ్వాలని కోరారు. "చివరి అవకాశం ఇస్తున్నాం. తదుపరి విచారణలోపు కేంద్రం ప్రమాణ పత్రం సమర్పించకపోతే ఇక అటువైపు నుంచి చెప్పడానికేమీ లేదని భావించి ముందుకెళ్తాం" అని జస్టిస్‌ రమణ స్పష్టంచేశారు. సాంకేతిక కారణాలవల్ల ట్రయల్‌కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు సరిగ్గా జరగడంలేదంటూ అమికస్‌ క్యూరీ హన్సారియా చెప్పిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలపై ప్రమాణ ప్రతంలో పొందుపరచాలని సూచించారు. తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.

రాష్ట్రపతితో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ భేటీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రపతిని కలవడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:నేర చరిత్ర వివరాలేవి? భాజపా, కాంగ్రెస్​కు జరిమానా!

ABOUT THE AUTHOR

...view details