జీవరాశికి మూలం జీవకణం. అది గ్రహించిన ఆహారంతో మెటబాలిజమ్ జరిపి జీవాన్ని నిలుపుతుంది. అంతేకాదు.. తనలాంటి మరొక దాన్ని పునరుత్పత్తి చేయగలదు. కాలంతో పాటు జరిగే మార్పుల ఫలితంగా ఈ జీవకణం నుంచి బుద్ధి జీవులు ఆవిర్భవిస్తారు. ఈ సిద్ధాంతమే ఇతర నక్షత్ర, గ్రహవ్యవస్థలపై జీవరాశి ఉంటుందనే ఆశకు ప్రాణం పోస్తోంది. ఇలా జరగడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టొచ్చేమోగానీ.. భూమిపై జరిగింది కూడా ఇదే. భూపరిణామ క్రమంలో సహజసిద్ధమైన రీతిలోనే జీవపరిణామం జరిగింది. ఇదే మాదిరిగా భూమిని పోలిన ఇతర అంతరిక్ష వస్తువులపైన కూడా ఇలాంటి పరిణామమే జరగడం సహజమైన విషయమే అవుతుందనేది శాస్త్రవేత్తల అంచనా.
మొదలైన అన్వేషణ..
మన భూ గ్రహానికి ఇతర నక్షత్ర వ్యవస్థల నుంచి సంకేతాలు కాంతి వేగంతో వస్తున్నాయి. భూమిపై ఉన్నవారిని పలకరించేందుకే అన్యగ్రహవాసులు ఎవరైనా పంపుతున్నారేమోనని సందేహం. మరి, వాటిని గుర్తించాలంటే? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. దీంట్లో భాగంగానే 1972లో అమెరికా ‘పయొనీర్-10’ వ్యోమనౌకను ప్రయోగించింది. అది మనిషికి తెలిసిన అన్ని గ్రహాలనూ దాటుకుని సుదూర విశ్వంలోకి చేరుకుంది. అంటే.. రోదసీ కుహరం నుంచి సంకేతాలు పంపింది. 2003, జనవరి 22న ఆఖరి సందేశం పంపింది. తర్వాత అది పంపే సంకేతాలు మనకు చేరనప్పటికీ.. పయొనీర్ మాత్రం పాలపుంత కేంద్రం వైపు దూసుకువెళుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ప్రయత్నంగా అమెరికా పంపిన పయొనీర్-2 కూడా మరొక దశలో సౌరకుటుంబంలోకి దూసుకెళ్లింది. తర్వాత అనంత విశ్వంలో ఎక్కడైనా బుద్ధి జీవులు తారసపడితే వారికి అర్థమయ్యేలా మన సందేశాలు కనిపించడం కోసం బంగారు తాపడం చేసిన అల్యూమినియం పలక మీద గ్రాఫిక్ మెసేజ్ రాసి ‘పయొనీర్-10’ వ్యోమనౌకని పంపారు. ఇంత వరకూ దానికి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా ప్రపంచ దేశాలు పలు అంతరిక్ష నౌకల్ని ప్రయోగిస్తూ లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించేలా చేసి.. ఇతర గ్రహాలపై జీవరాశి ఉనికిని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
వాయేజర్ విశేషాలు..
తొలిసారి శనిగ్రహాన్ని క్లిక్ మనిపించిన ఘనత వాయేజర్-1కి దక్కుతుంది. 1977, సెప్టెంబరు 5న అమెరికా దీన్ని ప్రయోగించింది. ఇది సుమారు ఏడాది పాటు ప్రయాణం చేసి శనిగ్రహం ఫొటోలను దానికి 760, 510 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి తీసింది. వాటిని భూమికి పంపింది. తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన వాయేజర్-2 నిర్విరామంగా 300 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి యురేనస్ గ్రహానికి చేరువలోకి వెళ్లిన తొలి అంతరిక్షనౌకగా చరిత్ర సృష్టించింది. 2020నాటికి అది సౌరకుటుంబం సరిహద్దులు దాటి అంతర్ నక్షత్రమండలంలో ప్రవేశించింది. ఇంతవరకూ మనకు తెలియని ఈ ప్రాంతంలోని విశేషాల్ని తెలుసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు.. అక్కడ జీవరాశి ఉనికి ఉండే అవకాశం ఉన్న గ్రహంపై ఆవిరి జాడలు ఉన్నట్లు గుర్తించారు. దానికి సూపర్ ఎర్త్ అని, కే2-18బీగా నామకరణం చేశారు. ఇది అరుణ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ 110 కాంతి సంవత్సరాల దూరం ఒక కక్ష్యలో భ్రమణం చేస్తోందని గమనించారు. మనదేశం ఈ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఇతర దేశాలకు దీటుగానే అంతరిక్ష ప్రయోగానికి నాంది పలికింది. 1963, నవంబరు 21న తుంబా నుంచి తొలి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించడంతో భారత్ అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.