తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

శాటిలైట్​ ఇంటర్నెట్​​ కనెక్షన్​ కావాలా? ఏడాదికి రూ.లక్షన్నర కట్టాల్సిందే! - శాటిలైట్​ ఇంటర్నెట్​తో వేటికి ఉపయోగం

Satellite Internet Cost In India: ప్రపంచ కుబేరుడు ఎలన్​ మస్క్​కు చెందిన శాటిలైట్​ బ్రాడ్​బ్యాండ్​ సంస్థ స్టార్​లింక్​.. భారత్​లో వ్యాపార సేవలను త్వరలో ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన పరికరాలకు, సేవలకు అయ్యే ఖర్చు వివరాలను ఆ సంస్థ భారత్​ హెడ్​ ప్రకటించారు. అతి త్వరలోనే వీటికి సంబంధించిన అనుమతుల కోసం సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేసుకోనుంది.

స్టార్​లింక్​ వ్యాపార సేవలు
Starlink Connection Cost

By

Published : Dec 6, 2021, 7:29 PM IST

Satellite Internet Cost In India: శాటిలైట్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే ప్రయత్నంతో స్పేస్‌ఎక్స్‌ ఆధ్వర్యంలో ప్రారంభించిన కంపెనీ 'స్టార్‌లింక్‌'. ఇప్పుడు ఈ కంపెనీ భారత్​లో కమర్షియల్​ సర్వీసులను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. అయితే.. ఈ సేవలు పొందాలంటే ఎంత ఖర్చు చేయాలనే వివరాలను ఆ సంస్థ భారత్​ హెడ్​ సంజయ్​ భార్గవ లింక్డ్​ఇన్​లో పోస్ట్​ చేశారు. భారత్​లో ఈ సేవలను పొందాలనుకునే వినియోగదారులు మొదటి ఏడాది ఈ కనెక్షన్​కు రూ. 1,58,000 చెల్లించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.

నెలకు ఎంత చెల్లించాలి..?

ఈ సర్వీసులను పొందడానికి వినియోగదారుడు మొదట పరికరాల కోసం సుమారు రూ. 37,400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత నెలకు రూ. 7,425 వరకు కట్టాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంది. మొత్తంగా కనెక్షన్​ తీసుకున్న తొలి నెలలో సుమారు రూ. 45 వేల వరకు చెల్లించాల్సిఉంటుంది. రెండో ఏడాది నుంచి పరికరాలు కొనాల్సిన ఖర్చు ఉండదు కాబట్టి.. కట్టాల్సిన మొత్తం రూ. 1,15,000కు తగ్గుతుందని కంపెనీ పేర్కొంది.

వేటికి ఉపయోగం..?

ఈ కనెక్షన్లను భారత్​లో ప్రవేశ పెట్టడం ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం మరింత పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సేవలతో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మరింత ప్రయోజనం పొందుతాయని స్టార్‌లింక్ తెలిపింది. రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిచనుంది స్టార్​లింక్​. పైలట్​ ప్రాజెక్ట్​లో భాగంగా ప్రస్తుతానికి వీటిని జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాలని చూస్తోంది.

భారత్​లో ఇందుకు అనుమతి ఉందా..?

భారత్​లో కమర్షియల్​ సర్వీసులు ప్రారంభించడానికి వచ్చే జనవరి నెలాఖరుకు కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తోంది కంపెనీ. ఎటువంటి అడ్డంకులు లేకపోతే వచ్చే ఏడాది జనవరి నాటికి వాణిజ్య సేవలు ప్రారంభమవుతాయి. ముందుగా దిల్లీ చుట్టుపక్కల ఉన్న వంద పాఠశాలలకు ఉచితంగా కనెక్షన్లు ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ డిసెంబరుతో మొదలుపెట్టి వచ్చే డిసెంబరుకల్లా దేశంలో రెండు లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది స్టార్‌లింక్‌.

బ్లాక్​లిస్ట్​లో స్టార్​ లింక్​..!

ఇదిలా ఉంటే.. స్టార్​లింక్​ను కేంద్రం బ్లాక్​ లిస్ట్​లో పెట్టింది. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ బుకింగ్స్​ను సంస్థ ప్రారంభించడమే ఇందుకు కారణం.

Satellite Internet India

శాట్​లైట్​ ఇంటర్నెట్​ అంటే ఏంటి?

ఇప్పటివరకు హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ కావాలంటే ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. అది నగరాలూ పెద్ద పట్టణాల్లో తప్ప మారుమూల గ్రామాల్లో లేదు. చాలా నగరాల్లో శివారు ప్రాంతాలు కూడా ఇంటర్నెట్‌ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దూర ప్రాంతాలకూ, గిట్టుబాటు కాని చోటికీ ఫైబర్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లు ముందుకు రారు. అందువల్లనే కొండప్రాంతాల్లోని గ్రామాల్లోనైతే ఇంటర్నెట్‌ కాదు కదా సెల్‌ఫోన్లు కూడా పనిచేసే పరిస్థితి ఉండడం లేదు. చెట్టో, వాటర్‌ ట్యాంకో ఎక్కి కూర్చుని ఫోన్‌ మాట్లాడుతున్న వార్తలు పేపర్లలో చూస్తూనే ఉంటాం.

శాటిలైట్‌ ఇంటర్నెట్‌తో ఆ కష్టాలు తీరతాయి. నేరుగా ఆకాశంలో ఉన్న శాటిలైట్‌తో కనెక్షన్‌ కాబట్టి కొండలూ గుట్టలూ వాగులూ వంకలూ అడవులూ ఎడారులూ... ఎలాంటి ప్రదేశమైనా సరే ఫైబర్‌నెట్‌ చేరుకోలేని ప్రాంతాలన్నిటికీ ఇది చేరుకుంటుంది. అక్కడి వారు తేలిగ్గా ఇంటర్నెట్‌ వాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

How Satellite Internet Works

ఎలా పనిచేస్తుంది?

ఈ శాటిలైట్లు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికే నిర్దిష్టంగా సేవలు అందిస్తాయి. ఇవి భూమికి దూరంగా కాక దగ్గరగా తక్కువ కక్ష్యలో(దాదాపు 550కి.మీ.) తిరుగుతుంటాయి. దాంతో సేవలు కూడా నాణ్యంగా ఉంటాయి. గేమింగ్‌, వీడియో కాలింగ్‌ లాంటివన్నీ వేగంగా జరుగుతాయి. ఒకరకంగా టీవీ డిష్‌ కనెక్షన్‌ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారులు కూడా టీవీకి పెట్టుకున్నట్లే ఇంటిమీదో లేదా బయట వాకిట్లోనో వీలుగా ఉన్న చోట చిన్న డిష్‌లాంటి పరికరాన్ని బిగించుకోవాలి. ఆకాశంలో ఉన్న శాటిలైట్‌కీ ఈ డిష్‌కీ మధ్యలో చెట్లూ భవనాల్లాంటివి ఏవీ అడ్డం లేకుండా ఉంటే చాలు. డిష్‌ మీద మంచుపడినా కరిగిపోయేలా తయారుచేశారు. ఈ డిష్‌కి వైఫై రూటర్‌ని అనుసంధానిస్తారు. దాంతో కంప్యూటర్లనూ ఫోన్లనూ ఉపయోగించవచ్చు.

ఇదీ చూడండి:మనకీ వచ్చేస్తోంది.. శాటిలైట్‌ ఇంటర్నెట్‌..!

ABOUT THE AUTHOR

...view details