ఉపగ్రహ ప్రయోగాలు.. ఖగోళ శాస్త్రజ్ఞులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయా? ఒకప్పటిలా గ్రహాలు, నక్షత్రాల కదలికలను జ్యోతిషులు సులువుగా పసిగట్టలేకపోతున్నారా? ఖగోళాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం.... ప్రైవేటు సంస్థలు వందల సంఖ్యలో ప్రయోగిస్తున్న ఉపగ్రహాలే. ఫలితంగా ఏది గ్రహమో, ఏది నక్షత్రమో, ఏది ఉపగ్రహమో పోల్చుకోలేక ఖగోళ శాస్త్రవేత్తలు ఇబ్బంది పడుతున్నారు.
12,000 ఉపగ్రహాలతో 'స్పేస్ ఎక్స్'
భారీ ఉపగ్రహ మండల(మెగా కన్స్టెల్లేషన్) ఏర్పాటు దిశగా ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్ ఎక్స్' అంతరిక్ష సంస్థ ప్రయత్నిస్తోంది. 'స్టార్ లింక్' పేరుతో 12,000 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని నిర్దేశించుకుంది. వీటి ద్వారా 250 కోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయం అందనుంది. 2019 నవంబర్‌లో 60 ఉపగ్రహాలను దశలవారీగా అంతరిక్షంలోకి పంపడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆ సంస్థ 800 ఉపగ్రహాలను పంపింది.
3,000 ఉపగ్రహాలతో బెజోస్..
'స్పేస్ ఎక్స్' తరహాలోనే మరో ప్రముఖ వ్యాపార వేత్త, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్.. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమయ్యారు. 'బ్లూ ఆరిజన్' ప్రాజెక్టులో భాగంగా 'కైపెర్' పేరుతో 3,000 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.