అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది. మూడు రోజుల క్రితం.. నలుగురు యాత్రికులతో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ఎక్స్ వాహక నౌక శనివారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) సురక్షితంగా భూమిని చేరింది. పారాచూట్ల సహాయంతో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో ఈ అంతరిక్షనౌక క్షేమంగా దిగింది. అందులోని వ్యోమగాములు కూడా పూర్తి సురక్షితంగా ఉన్నారు. అయితే వారంతా కొన్ని గంటలపాటు.. వైద్యులు, నిపుణుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు స్పేస్ ఎక్స్ వర్గాలు వెల్లడించాయి.
ప్రయాణం ఇలా..
అంతరిక్ష పర్యటనల కోసం స్పేస్ ఎక్స్ తీర్చిదిద్దిన వాహక నౌక డ్రాగన్ 'స్పేస్ క్యాప్సూల్' ద్వారా.. షిఫ్ట్-4 పేమెంట్స్ అనే డిజిటల్ పేమెంట్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు 38 ఏళ్ల జారెడ్ ఐజాక్మన్ సహా.. సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్, డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ, 51ఏళ్ల టీవీ నటి సియాన్ ప్రోక్టర్ బుధవారం రాత్రి అంతరిక్షంలోకి వెళ్లారు. ఫ్లోరిడాలోని 'కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి వీరి యాత్ర ప్రారంభమైంది.
వ్యోమగాములున్న క్యాప్సుల్.. అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)ను దాటి 160 కిలో మీటర్ల ఎత్తులో భూమి చుట్టు భ్రమం చేసింది. ఈ క్యాప్సూల్‌కు అమర్చిన భారీ అద్దం ద్వారా భూమిని వీక్షించారు అందులోని స్పేస్ టూరిస్టర్లు. 'ఇన్స్పిరేషన్-4' అనే ఈ మిషన్‌లో భాగంగా అంత ఎత్తులో (540 కిలో మీటర్లు).. మూడు రోజుల పాటు గడిపారు ఈ నలుగురు యాత్రికులకు. ఈ ఎత్తులో వారంతా జీరో గ్రావిడీని అనుభూతి చెందారు.