Spacex Starship Rocket Launch :అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్‌ఎక్స్' నిర్మించి ప్రయోగించిన బాహుబలి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. అయితే, ప్రయోగించిన ఎనిమిది నిమిషాల్లోనే రాకెట్ సిగ్నల్స్ కోల్పోవడం వల్ల లోపల జంట పేలుళ్లు సంభవించాయని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. దీంతో రెండోసారి కూడా స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైనట్లయింది. ఇక స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం (నవంబరు 18) ఉదయం దక్షిణ టెక్సాస్ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 400 అడుగుల(121 మీటర్లు) ఎత్తులో నిర్మించిన ఈ 'స్టార్‌షిప్-2' రాకెట్ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన లాంఛ్ వెహికిల్.
"బూస్టర్ స్టార్‌షిప్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించాం. అయితే కొద్ది నిమిషాల్లోనే రాకెట్ ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అప్పటివరకు సాఫీగా దూసుకుపోతున్న రాకెట్ ఒక్కసారిగా కూలిపోయింది."
-స్పెస్ఎక్స్ సైంటిస్టులు
విజయవంతమైతే ఇలా సాగేది..
దాదాపు గంటన్నర పాటు సాగే ఈ టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభంలో విడిపోయే బూస్టర్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా చర్యలు తీసుకున్నారు. స్పేస్‌క్రాఫ్ట్ మాత్రం భూమి చుట్టు ఒక పరిభ్రమణం సాగించి, పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయేలా రూపొందించారు. రెండు సెక్షన్ల (బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్) కలిగిన ఈ స్టార్‌షిప్ రాకెట్‌ను చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా 'స్పేస్‌ఎక్స్' రూపొందించింది.