తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

satellite internet: మనకీ వచ్చేస్తోంది.. శాటిలైట్‌ ఇంటర్నెట్‌..!

అంతరిక్ష పరిశోధనలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఎలన్‌ మస్క్‌(Elon musk starlink) ఆలోచన. స్పేస్‌ఎక్స్‌(spacex news) ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించిన స్టార్‌లింక్‌(spacex starlink news) ఇటీవలే మనదేశంలో అనుబంధ సంస్థని నెలకొల్పింది. వచ్చే నెలలోనే పని మొదలుపెట్టి ముందుగా పది లోక్‌సభ నియోజకవర్గాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌(satellite internet) సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

satellite internet
శాటిలైట్‌ ఇంటర్నెట్‌

By

Published : Nov 21, 2021, 9:45 AM IST

  • అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎలన్‌ మస్క్‌ తర్వాతే ఎవరైనా! లేకపోతే అనంతపురం జిల్లాలోని ఊరికో, ఆదిలాబాద్‌ జిల్లాలోని పల్లెకో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడానికీ అమెరికాలో ఉండే ఎలన్‌ మస్క్‌కీ ఏమిటి సంబంధం? అంగారకుడి మీద కాలనీ అనీ అంతరిక్ష యాత్రలనీ తరచూ వార్తల్లో ఉండే ఈయన ఇప్పుడు నింగికీ నేలకీ ఇంటర్నెట్‌ నిచ్చెన వేస్తున్నాడు. దానిద్వారా ఇటు ప్రజల అవసరాలను తీరుస్తూనే అటు ఛార్జీల రూపంలో కోట్లు సంపాదించి అంతరిక్ష పరిశోధనలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఎలన్‌ మస్క్‌ ఆలోచన. స్పేస్‌ఎక్స్‌(spacex news)ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించిన స్టార్‌లింక్‌(spacex starlink news)ఇటీవలే మనదేశంలో అనుబంధ సంస్థని నెలకొల్పింది. వచ్చే నెలలోనే పని మొదలుపెట్టి ముందుగా పది లోక్‌సభ నియోజకవర్గాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌(satellite internet)సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న రామనాథ్‌ది మధ్యప్రదేశ్‌. లాక్‌డౌన్‌తో ఆఫీసు మూతపడడంతో ఇంటి దగ్గరనుంచే పనిచేయవచ్చన్నారని లాప్‌టాప్‌ సర్దుకుని భార్యాబిడ్డల్ని తీసుకుని సొంతూరు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లాక తెలిసింది ఊళ్లో ఇంటర్నెట్‌ సౌకర్యం సరిగా లేదని. స్నేహితులను అడిగితే ఉద్యోగానికి అవసరమైన ఇంటర్నెట్‌ స్పీడ్‌ కావాలంటే 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లాలన్నారు. లాక్‌డౌన్‌ కాబట్టి అక్కడికి రోజూ వెళ్లి రావడానికి బస్సుల్లేవు. అందుకని పొద్దున్నే మూడింటికి లేచి ఊరికి పాలప్యాకెట్లు తెచ్చే వ్యానులో ఎక్కి ఆ టౌన్‌కి వెళ్లేవాడు. మధ్యాహ్నం దాకా పాల ఫ్యాక్టరీ గోడౌన్‌లోనే కూర్చుని పనిచేసుకుని మళ్లీ అదే వ్యానులో సాయంత్రం ఇంటికి చేరేవాడు. లాక్‌డౌన్‌ అయిపోయినా చాలాకాలం ఆఫీసులు తెరవలేదు కాబట్టి రామ్‌నాథ్‌ ఆ నగరంలో గది అద్దెకు తీసుకుని పనిచేసుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇలాంటి అనుభవం చాలామందికి అయింది. ఊళ్లలో ఇంటర్నెట్‌ సౌకర్యం లేనివాళ్లు చాలామంది నగరం వదలకుండా ఇంటినుంచి పనిచేసుకోవాల్సి వచ్చింది.

అంతెందుకూ.. మన తెలుగు రాష్ట్రాల్లోనే పింఛన్లు, రేషన్‌ లాంటివి పంపిణీ చేసేటప్పుడూ, ప్రభుత్వ కార్యాలయాలూ బ్యాంకులూ జీవితబీమా లాంటి సంస్థలకు ఏదైనా పనిమీద వెళ్లినప్పుడూ నెట్‌ స్లోగా ఉందనో, సర్వర్‌ డౌన్‌ అయిందనో ఒకటికి రెండుసార్లు తిరగక తప్పని పరిస్థితి మనకి అనుభవమే. చాలా ఊళ్లలో బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ ఉండదు. ఉన్నా కూడా తరచుగా స్పీడ్‌ తగ్గిపోతుంటుంది. గట్టిగా గాలి వీచినా, వీధిలో ఊరేగింపు వెళ్లేటప్పుడు ఆ వైరుకి తగిలినా ఇక ఆరోజుకి అంతే సంగతులు. ఎవరైనా వచ్చి దాన్ని సరిచేసేవరకూ ఎంత ముఖ్యమైన పనులైనా ఆగిపోవాల్సిందే.

కరోనా వల్ల ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ మొదలయ్యాక మన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌(satellite internet india) ఎంత బలహీనంగా ఉందో తెలిసింది. ఐఐటీల్లో చదువుకునే విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు పెడితే చాలామంది నెట్‌ సమస్య వల్ల పాఠాలను డౌన్‌లోడ్‌ చేసుకోలేకపోయారట. ఐఐటీ వాళ్ల పరిస్థితే అలా ఉంటే ఇక మామూలు బడిపిల్లల సంగతి చెప్పనక్కరలేదు. చాలా ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య వచ్చేది. నెట్‌ బ్యాండ్‌విడ్త్‌ సరిపోక తెరమీద వీడియో పాఠం కదలకుండా ఆగిపోయేది. అక్కడ టీచరే ఆపేశారో, నెట్‌ సరిగా లేక రావడం లేదో తల్లిదండ్రులు తెలుసుకుని సరిచేసేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోయేది. లోకల్‌ సర్కిల్స్‌ అనే ఓ సంస్థ ఆన్‌లైన్‌ విద్య గురించి సర్వే చేయగా 43 శాతం పిల్లలు స్మార్ట్‌ఫోన్లూ, ఇంటర్నెట్టూ లేక తాము పాఠాలు వినలేకపోయామని చెప్పారు. ఈ పరిస్థితి చూసి కొన్ని రాష్ట్రాలు టెలివిజన్‌లో ప్రత్యేక ఛానల్‌ ఏర్పాటు చేసి మరీ పిల్లలకు పాఠాలు చెప్పాయి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2021 మార్చి నాటికి మనదేశంలో 82.5 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ వాడుతుంటే అందులో 80 కోట్లు మొబైల్‌ ఫోన్ల ద్వారానే వాడుతున్నారు. ఫోన్‌ కనెక్షన్‌ ఇచ్చే టెలికాం సంస్థలే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా ఇస్తాయి, రెండు సేవలకీ ఒకే టవర్‌ వినియోగిస్తాయి. ఆ టవర్లు దగ్గర్లో లేకపోతే సేవల్లో నాణ్యత ఉండదు. ఇక, 75 శాతం గ్రామీణ జనాభాకి అసలు బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం లేదు. దాంతో వైర్లెస్‌ రూటర్ల ద్వారా టెలికాం ఆపరేటర్లు అందించే కనెక్షన్‌లే దిక్కు. వాటికి స్పీడు తక్కువ, కనెక్టివిటీ సమస్యలు ఎక్కువ.

ఇదిగో... ఈ పరిస్థితే శాటిలైట్‌ ఇంటర్నెట్‌(satellite internet)ప్రొవైడర్లకు స్వాగతం చెబుతోంది.

శాటిలైట్‌తోనే ఎందుకు?

ఇప్పటివరకూ హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌(high speed internet) కావాలంటే ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. అది నగరాలూ పెద్ద పట్టణాల్లో తప్ప మారుమూల గ్రామాల్లో లేదు. చాలా నగరాల్లో శివారు ప్రాంతాలు కూడా ఇంటర్నెట్‌ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దూర ప్రాంతాలకూ, గిట్టుబాటు కాని చోటికీ ఫైబర్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లు ముందుకు రారు. అందువల్లనే కొండప్రాంతాల్లోని గ్రామాల్లోనైతే ఇంటర్నెట్‌ కాదు కదా సెల్‌ఫోన్లు కూడా పనిచేసే పరిస్థితి ఉండడం లేదు. చెట్టో వాటర్‌ ట్యాంకో ఎక్కి కూర్చుని ఫోన్‌ మాట్లాడుతున్న వార్తలు పేపర్లలో చూస్తూనే ఉంటాం.

శాటిలైట్‌ ఇంటర్నెట్‌తో(satellite internet) ఆ కష్టాలు తీరతాయి. నేరుగా ఆకాశంలో ఉన్న శాటిలైట్‌తో కనెక్షన్‌ కాబట్టి కొండలూ గుట్టలూ వాగులూ వంకలూ అడవులూ ఎడారులూ... ఎలాంటి ప్రదేశమైనా సరే ఫైబర్‌నెట్‌ చేరుకోలేని ప్రాంతాలన్నిటికీ ఇది చేరుకుంటుంది. అక్కడి వారు తేలిగ్గా ఇంటర్నెట్‌ వాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

ఈ శాటిలైట్లు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికే నిర్దిష్టంగా సేవలు అందిస్తాయి. ఇవి భూమికి దూరంగా కాక దగ్గరగా తక్కువ కక్ష్యలో(దాదాపు 550కి.మీ.) తిరుగుతుంటాయి. దాంతో సేవలు కూడా నాణ్యంగా ఉంటాయి. గేమింగ్‌, వీడియో కాలింగ్‌ లాంటివన్నీ వేగంగా జరుగుతాయి. ఒకరకంగా టీవీ డిష్‌ కనెక్షన్‌ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారులు కూడా టీవీకి పెట్టుకున్నట్లే ఇంటిమీదో లేదా బయట వాకిట్లోనో వీలుగా ఉన్న చోట చిన్న డిష్‌లాంటి పరికరాన్ని బిగించుకోవాలి. ఆకాశంలో ఉన్న శాటిలైట్‌కీ ఈ డిష్‌కీ మధ్యలో చెట్లూ భవనాల్లాంటివి ఏవీ అడ్డం లేకుండా ఉంటే చాలు. డిష్‌ మీద మంచుపడినా కరిగిపోయేలా తయారుచేశారు. ఈ డిష్‌కి వైఫై రూటర్‌ని అనుసంధానిస్తారు. దాంతో కంప్యూటర్లనూ ఫోన్లనూ ఉపయోగించవచ్చు.

ఎవరు చేస్తున్నారు?

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థలను నిర్వహిస్తున్న ఎలన్‌ మస్క్‌(elon musk starlink) స్పేస్‌ఎక్స్‌ ఆధ్వర్యంలో స్టార్‌లింక్‌(spacex starlink news) అనే మరో కొత్త సంస్థని పెట్టారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించనున్నారు. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌9 రాకెట్‌ ద్వారా ఈ శాటిలైట్‌లను కక్ష్యలో ప్రవేశపెడతారు. స్టార్‌లింక్‌ కిట్‌లో డిష్‌, రూటర్‌ తదితర పరికరాలన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి 50 నుంచి 175 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో పనిచేస్తున్నాయి స్టార్‌లింక్‌ కనెక్షన్లు. భవిష్యత్తులో దాన్ని 300 ఎంబీపీఎస్‌కి పెంచాలన్నది మస్క్‌ లక్ష్యం.

ఎంత డేటా ఇస్తారు?

డేటా మీద పరిమితి లేదు. నెలకింతని ఫిక్స్‌డ్‌ ఛార్జీలు తీసుకుంటారు. అది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. కొత్తలో కాస్త ఎక్కువున్నా రాను రాను ధర తగ్గుతుందని చెబుతోంది స్టార్‌లింక్‌. ఆసక్తి ఉన్నవారు స్టార్‌లింక్‌ వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

5జీ కన్నా ఇదే నయమా?

5జీ చాలా వేగంగా ఉంటుంది కానీ అది అందుబాటులోకి రావాలంటే సెల్‌టవర్లు కావాలి. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ లక్ష్యం- ఈ టవర్లేమీ అందుబాటులో లేని ప్రాంతాలు కాబట్టి దాంతో పోల్చడానికి లేదు.

ఈ లెక్కన చాలా శాటిలైట్స్‌ కావాలిగా?

అవును, ఇప్పటికే దాదాపు రెండువేల శాటిలైట్స్‌ పనిచేస్తున్నాయి. ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతున్న పనిచేసే శాటిలైట్స్‌లో సగానికన్నా ఎక్కువ స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందినవే. భవిష్యత్తులో కేవలం ఇంటర్‌నెట్‌ సేవలందించడానికే నలభై రెండువేల శాటిలైట్స్‌ని వినియోగించే లక్ష్యంతో ఉంది స్పేస్‌ఎక్స్‌(ఇప్పటివరకూ అన్నిరకాల పనులకీ కలిపి వివిధ దేశాలు పంపించిన శాటిలైట్స్‌ సంఖ్య 12 వేలు దాటదు. అందులో పనిచేస్తున్నవి 4,300 మాత్రమే). దాదాపు 75వేల కోట్ల రూపాయల అంచనాతో 2014లో మొదలైన 'స్టార్‌లింక్‌' ప్రాజెక్టు కింద అటు ఉపగ్రహాలనూ ఇటు అవసరమైన అనుమతులనూ సిద్ధం చేసుకుని ఫిబ్రవరి 2018న రెండు ప్రొటోటైప్‌ శాటిలైట్స్‌ని ప్రయోగించారు. ఏడాది తర్వాత ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా ఒకేసారి మరో 60 శాటిలైట్స్‌ని ప్రవేశపెట్టారు. కొన్నాళ్లపాటు వాటిని పరీక్షించి చూసి పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్నాక బీటా వర్షన్‌ని ప్రారంభించి అక్టోబరు 2019న ఎలన్‌ మస్క్‌ స్వయంగా శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ని ఉపయోగించి ట్విటర్‌లో పోస్ట్‌చేశారు. గత సెప్టెంబరు నాటికి 1740 శాటిలైట్స్‌ని ప్రయోగించింది స్పేస్‌ఎక్స్‌. కొంతకాలంగా ఈ సంస్థ రెండువారాలకోసారి చొప్పున అరవయ్యేసి శాటిలైట్స్‌ని ప్రవేశపెడుతూనే ఉంది. ఈ శాటిలైట్స్‌ ఒక్కోటీ 260 కిలోల బరువుతో టేబుల్‌ సైజులో ఉంటాయి. భూమివైపు యాంటెన్నాలు ఉంటాయి. సౌరశక్తితో పనిచేసే వైఫై రూటర్లలాంటివన్నమాట ఇవి. ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ కన్నా వీటి ద్వారా ఇంటర్నెట్‌ వేగం 47 శాతం ఎక్కువ ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఇంటర్నెట్‌ సదుపాయాలకు పరిమితంగా వాడుతున్న పెద్ద శాటిలైట్‌ భూమికి 36 వేల కి.మీ.దూరాన ఉండి పనిచేస్తోంది. అంత దూరమయ్యేసరికి సమయం ఎక్కువ పడుతోంది. ఈ చిన్న ఉపగ్రహాల వల్ల ఆ సమస్య ఉండదు. వీటన్నిటినీ సమన్వయపరచడానికి భూమ్మీద కొన్ని కార్యాలయాలను ఏర్పాటుచేశారు. ఇప్పటికే తమకు 19 దేశాల్లో లక్ష మంది వినియోగదారులున్నారనీ వారంతా బీటా సర్వీసును ఉపయోగిస్తున్నారనీ మరో ఐదు లక్షల ఆర్డర్లు ఉన్నాయనీ ప్రకటించింది స్టార్‌లింక్‌.

మనదేశంలో ఉందా?

స్పేస్‌ఎక్స్‌ సంస్థ మనదేశంలో 'స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' పేరుతో అనుబంధ సంస్థని నెలకొల్పింది. లైసెన్సులూ ప్రభుత్వ అనుమతులూ సిద్ధం చేసుకుంటోంది. దిల్లీలోనూ చుట్టుపక్కలా ఉన్న వంద పాఠశాలలకు ఉచితంగా కనెక్షన్లు ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ డిసెంబరుతో మొదలుపెట్టి వచ్చే డిసెంబరుకల్లా దేశంలో రెండు లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది స్టార్‌లింక్‌. అందులో 80శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేలా చూడాలన్నది ఆశయం. ఇప్పటికే ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా వేల సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు బుక్‌ అయ్యాయట.

అంతరిక్షంలో ఇన్ని ఉపగ్రహాలు తిరగడం వల్ల నష్టం లేదా?

ఉపగ్రహాలు ఎక్కువైపోతున్నాయనీ, కాలం తీరిన ఉపగ్రహాలతో ఇప్పటికే అంతరిక్షం చెత్తకుప్పలా తయారైందనీ, వీటివల్ల గ్రహాంతరజీవులకు మన ఉనికి తెలిసిపోయే అవకాశం ఉందనీ రకరకాల ఆందోళనలు లేవనెత్తారు కొందరు. ఆ విషయం మీద సీరియస్‌గానే అధ్యయనం చేసింది ఓ శాస్త్రవేత్తల బృందం. ఇప్పుడు మనం ప్రయోగిస్తున్న ఉపగ్రహాల సరాసరిని బట్టి చూస్తే ఇంకో 800 ఏళ్ల వరకూ ఏ ప్రమాదమూ లేదనీ ఈ ఉపగ్రహాల వల్ల గ్రహాంతర జీవులకు మన గురించి తెలిసే అవకాశమే లేదనీ ఆ బృందం తేల్చిచెప్పింది. మరోపక్క తయారీ సంస్థలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తక్కువ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అవి ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటే కాంతి కాలుష్యం ఏర్పడుతుందని అలా లేకుండా చూస్తున్నాయి. శాటిలైట్స్‌ కూడా దేనికీ తగలకుండా తమ కక్ష్యను తామే క్రమబద్ధం చేసుకుంటాయి. అంతేకాదు, జీవితకాలం అయిపోగానే వాటంతటవే కక్ష్యనుంచి తప్పుకుంటాయి. మెల్లగా వాతావరణంలో కలిసిపోయి భూమి మీద రాలిపోతాయి.

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగం?

ఫైబర్‌నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ లేని అన్నిచోట్లా- నగర శివారు ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలూ పాఠశాలలతో మొదలుపెట్టి మెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల వరకూ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో ఎంతో లబ్ధి పొందవచ్చు. నిరంతరాయంగా, వేగంగా వచ్చే ఇంటర్నెట్‌ వల్ల పనులు చాలా సులువవుతాయి. ఎంతో సమయం కలిసివస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలూ స్వచ్ఛంద సేవాసంస్థలూ నగరాలకు దూరంగా ఉండే రక్షణ సంస్థలూ సైనికశిబిరాల్లాంటి చోట్ల ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమాచార ప్రసారమే కాక, సహాయ కార్యక్రమాలు అమలు చేయడం కూడా తేలిగ్గా, త్వరగా జరుగుతుంది. పల్లెల్లో ఒక్క కనెక్షన్‌ తీసుకున్నా చాలు చుట్టూ ఉన్నవారు దాని నుంచి వైఫై సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

వ్యక్తిగత వాడకాన్ని బట్టి చూసినా... నిరంతరాయంగా ఇంటర్నెట్‌ పనిచేయడమే పెద్ద వెసులుబాటు. ఇక, స్పీడ్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద డాక్యుమెంట్లయినా సెకన్లలో పంపించుకోవచ్చు. కొద్ది క్షణాల్లోనే మొత్తం సినిమా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బఫరింగ్‌ లేకుండా వీడియోలు చూడొచ్చు. పనులన్నీ ఆన్‌లైన్‌లో చేసుకునే ఈ రోజుల్లో ఎవరైనా కోరుకునేది ఇంటర్నెట్‌ వేగమూ నాణ్యతలేగా..!

మార్స్‌ కాలనీకి పెట్టుబడి!

ప్రపంచవ్యాప్తంగా ఈ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ మార్కెట్‌ దాదాపు 75 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దాంట్లో ఎక్కువ భాగాన్ని అందిపుచ్చుకోగలిగితే స్టార్‌లింక్‌ ఆదాయం బాగా పెరుగుతుంది. దీని ద్వారా ఏటా రెండు నుంచి నాలుగు లక్షల కోట్లవరకూ సంపాదించాలన్నది ఎలన్‌ మస్క్‌ ఆలోచన. ఆ డబ్బుని స్పేస్‌ఎక్స్‌ మార్స్‌ కాలనీ ప్రాజెక్టుని సాకారం చేసుకోడానికి పెట్టుబడిగా ఉపయోగించాలన్నది మొత్తంగా ఈ స్టార్‌లింక్‌ సంస్థ వెనకాల ఉన్న ఆశయం.

పోటాపోటీగా... అమెజాన్‌, వన్‌వెబ్‌

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించడానికి చిన్నాపెద్దా సంస్థలు చాలానే రంగంలోకి దిగాయి కానీ స్టార్‌లింక్‌తో పోలిస్తే వాటి స్థాయి పరిమితంగా ఉంది. అమెజాన్‌, వన్‌వెబ్‌ లాంటివి మాత్రం స్టార్‌లింక్‌తో పోటీపడుతున్నాయి. 'ప్రాజెక్ట్‌ క్యూపర్‌' పేరుతో అమెజాన్‌ ఇప్పటికే రూ.72,500 కోట్ల పెట్టుబడితో రంగంలోకి దిగింది. 3236 శాటిలైట్స్‌ తయారుచేయించి వచ్చే ఏడాదినుంచీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 4,600 శాటిలైట్స్‌తో శాంసంగ్‌ కూడా ఈ సేవలు ప్రారంభించనున్నట్లు ఆరేళ్ల క్రితమే చెప్పింది కానీ ఆ తర్వాత పని ఎంతవరకూ వచ్చిందన్న కబురు ఆ సంస్థ నుంచి రాలేదు. లండన్‌కి చెందిన వన్‌వెబ్‌ సంస్థ ఇప్పటికే 650 శాటిలైట్స్‌ని ప్రవేశపెట్టింది. బ్రిటిష్‌ ప్రభుత్వమూ భారతీ గ్రూపుల సంయుక్త భాగస్వామ్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ వేర్వేరు దేశాల్లో ప్రయోగాత్మక సేవల్ని ప్రారంభించింది. చైనా కూడా తమ దేశానికి మాత్రమే పనికొచ్చేలా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ప్రాజెక్టుని ప్రారంభించింది.

అన్నీ సంచలనాలే!

ప్రపంచ శ్రీమంతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఎలన్‌ మస్క్‌ పేరు చెప్పగానే ఒకటీ రెండూ కాదు వరసగా చాలా విషయాలు గుర్తొస్తాయి. టెస్లా విద్యుత్‌ కారూ, పునర్వినియోగానికి పనికొచ్చే రాకెట్‌ లాంచర్‌ తయారుచేసిన స్పేస్‌ఎక్స్‌ సంస్థా, హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థా... లాంటివాటి కన్నా ముందూ తర్వాతా కూడా ఆయన చాలా కొత్త ఆవిష్కరణలు చేశారు. మస్క్‌ పుట్టి పెరిగింది దక్షిణాఫ్రికా. సంపన్న కుటుంబమే కానీ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నాలు చిన్నవయసులోనే చేయక తప్పలేదు. పదో ఏట నుంచే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి చూపిన మస్క్‌ తల్లి వెంట కెనడా వెళ్లి అటునుంచి అమెరికా చేరారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ సీటు వచ్చినా వదులుకుని తమ్ముడితో కలిసి 'జిప్‌2' అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టారు. నాలుగేళ్లకల్లా దాన్ని రెండువేల కోట్లకి అమ్మేశారు. ఆ డబ్బుతో ఎక్స్‌.కామ్‌ అనే ఆన్‌లైన్‌ బిల్లింగ్‌ సంస్థని పెట్టి తర్వాత 'పేపాల్‌'గా మార్చి 'ఈబే'కి అమ్మేశారు. దాంతో తొలిసారి ఆయన పేరు ఫోర్బ్స్‌ సంపన్నుల లిస్టులో చోటుచేసుకుంది. మొదటినుంచీ అంతరిక్ష పరిశోధనలంటే ఆసక్తి ఉన్న ఎలన్‌ మస్క్‌ ముప్పైఒక్క ఏళ్ల వయసులోనే(2002) స్పేస్‌ఎక్స్‌ని ప్రారంభించారు. 2004లో టెస్లా మోటార్స్‌లో చేరి నాలుగేళ్లకే దానికి సీఈవో అయి 'సోలార్‌సిటీ'(తర్వాత టెస్లా ఎనర్జీ) ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కృత్రిమమేధ తాలూకు ఫలితాలు అందరికీ అందుబాటులో ఉండాలని 'ఓపెన్‌ ఏఐ' పేరుతో లాభాపేక్షలేని పరిశోధనాసంస్థని ప్రారంభించారు. 'మస్క్‌ ఫౌండేషన్‌' ద్వారా ప్రకృతి విపత్తులు సంభవించినచోట సౌరశక్తితో పనిచేసే వ్యవస్థల్ని నెలకొల్పడానికీ, సైన్సు పరిశోధనలకీ, విద్యావ్యాప్తికీ సహాయపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 742 కోట్ల రూపాయల బహుమతి మొత్తంతో 'ఎక్స్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌'ని పెట్టారు. ప్రపంచానికి పొంచి ఉన్న పర్యావరణ ముప్పు అయిన కర్బన వాయువులను అరికట్టడానికి పనికొచ్చే సాంకేతికతను(కార్బన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ) అభివృద్ధిచేసిన వారికి ఈ బహుమతిని ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details